మొక్కలమ్మి రూ.కోట్లు సంపాదిస్తోంది!

తపన, పట్టుదల ఉంటే ఏ కలనైనా నెరవేర్చుకోవచ్చని నిరూపిస్తోంది రమణ్‌దీప్‌ కౌర్‌.  కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచనతో ఉద్యోగం మానేసి నర్సరీ వ్యాపారం మొదలుపెట్టిన కౌర్‌కి లాక్‌డౌన్‌ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది.

Published : 05 Feb 2024 01:09 IST

తపన, పట్టుదల ఉంటే ఏ కలనైనా నెరవేర్చుకోవచ్చని నిరూపిస్తోంది రమణ్‌దీప్‌ కౌర్‌.  కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచనతో ఉద్యోగం మానేసి నర్సరీ వ్యాపారం మొదలుపెట్టిన కౌర్‌కి లాక్‌డౌన్‌ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. ఆశలన్నీ చెదిరినా... పరిస్థితులకు ఎదురీది అవకాశాలు సృష్టించు కోవటమే కాదు... రూ.5 కోట్ల టర్నోవర్‌నూ సాధించింది. ఆ విజయ గాథను మనమూ తెలుసుకుందామా!

మాన్సాలో పుట్టి పెరిగిన రమణ్‌దీప్‌ కౌర్‌ 2013లో పెళ్లయ్యాక లూథియానాలో స్థిరపడింది.  చేసే ఉద్యోగంలో కొత్తదనమేమీ కనిపించలేదు కౌర్‌కి. దాంతో ఉద్యోగానికి స్వస్తి చెప్పి 2020లో ‘బొటానికా ది నర్సరీ’ ప్రారంభించింది. అయితే, కొవిడ్‌ రాకతో వ్యాపార కార్యకలాపాలు ఏడాదిపాటు పూర్తిగా స్తంభించిపోయాయి. ఏం చేయాలో తెలియని స్థితి.. అయినా ఆత్మ విశ్వాసాన్ని కోల్పోలేదు కౌర్‌. కొత్త అవకాశాలు వెతికింది. కొవిడ్‌ సమయంలోనూ అవసరమైన వారికి ఇంటికే మొక్కలను డెలివరీ చేయటం మొదలుపెట్టింది.

విదేశాలకూ..

తొలినాళ్లలో ఒక ఎకరాలో నర్సరీని నిర్వహించిన కౌర్‌.. తను తీసుకొచ్చిన డెలివరీ విధానానికి మంచి స్పందన లభించడంతో మరో 3 ఎకరాలు లీజుకు తీసుకుంది. ప్రస్తుతం లూథియానాలోని బిర్మి గ్రామంలో ఐదున్నర ఎకరాల్లో బొటానికల్‌ నర్సరీ నిర్వహిస్తోంది. ఇందులో వెయ్యి రకాల మొక్కలు  సాగుచేస్తోంది. అన్నిరకాల పూలు, బోన్సాయ్‌, పండ్ల మొక్కలు, విత్తనాల వంటి వాటిని స్పెయిన్‌, చైనా తదితర దేశాలకూ ఎగుమతి చేస్తోంది. దేశవిదేశాల్లోని ప్రఖ్యాత సంస్థలకూ బొకేలు, మొక్కలను సరఫరా చేస్తోంది. ఎంపిక చేసుకున్న మొక్కలను 3 నెలలపాటు ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షిస్తోంది కూడా. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘బొటానికా ది  నర్సరీ’ పేరుతో వీడియోలు పోస్టు చేస్తోన్న కౌర్‌..,అవసరమైన వారికి ఇంటికే మొక్కలను పంపిస్తుంది. ప్రస్తుతం రూ.5 కోట్లుగా ఉన్న టర్నోవర్‌ను, 5 ఏళ్లలో రూ.50కోట్లకు చేర్చడమే తన ధ్యేయమంటోంది. తల్లిదండ్రులు పిల్లల విదేశీ చదువులకు అయ్యే ఖర్చుని వాళ్ల ఆలోచనలకు పెట్టుబడిగా పెడితే..యువత అద్భుతాలు సాధించడం ఖాయమంటోందీమె. తన వద్ద ఉపాధి పొందుతున్న వారిలో ఎక్కువమంది మహిళలే కావటం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్