నేతలకు పాఠాలు నేర్పిస్తారు!

‘నాన్నా... నేను పెద్దయ్యాక రాజకీయాల్లోకి వెళ్తా’ ఐదో తరగతి చదువుతున్న ఆ చిన్నారి మాటలకి అమ్మానాన్నలు సంతోషించలేదు సరికదా, మౌనంగా ఉండిపోయారు. అలా ఎందుకు ఉండిపోయారో తర్వాతి కాలంలో ఆ అమ్మాయికి తేలిగ్గానే అర్థమైంది.

Published : 06 Feb 2024 07:17 IST

‘నాన్నా... నేను పెద్దయ్యాక రాజకీయాల్లోకి వెళ్తా’ ఐదో తరగతి చదువుతున్న ఆ చిన్నారి మాటలకి అమ్మానాన్నలు సంతోషించలేదు సరికదా, మౌనంగా ఉండిపోయారు. అలా ఎందుకు ఉండిపోయారో తర్వాతి కాలంలో ఆ అమ్మాయికి తేలిగ్గానే అర్థమైంది. కానీ యువత, ముఖ్యంగా అమ్మాయిలు రాజకీయాల్లోకి రావాలంటే మార్పు రావాలన్న ఉద్దేశంతో ‘ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ డెమోక్రసీ’ని స్థాపించి దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులకు పాఠాలు నేర్పుతున్నారు హేమాక్షి మేఘాని...

‘మీ రోల్‌ మోడల్‌ ఎవరు?’... అని ఓ అమ్మాయినో, అబ్బాయినో అడిగి చూడండి. వెంటనే నచ్చిన హీరో పేరో, క్రికెటర్‌ పేరో... ఇంకా అడిగితే ఓ వ్యాపారవేత్త పేరో చెబుతారు. రాజకీయ నాయకుల పేర్లు ఎందుకు చెప్పరు? కారణం వాళ్లకి నాయకులు రోల్‌ మోడల్‌గా ఉండటం లేదు కాబట్టి. 2016లో ఓ సర్వే చేస్తే... 18శాతం మంది యువత మాత్రమే కాస్త పాలిటిక్స్‌ అంటే ఆసక్తి ఉన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలనే ఐఎస్‌డీ (ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ డెమోక్రసీ)ని స్థాపించా అంటారు హేమాక్షి. ఆమె స్వస్థలం గుజరాత్‌. పేదపిల్లలకు నాణ్యమైన చదువుని అందించాలన్న లక్ష్యంతో ‘టీచ్‌ ఫర్‌ ఇండియా’ కార్యకర్తగా ముంబయిలో రెండేళ్లపాటు పనిచేశారు. అయినా చిన్నప్పుడు తను ఇష్టపడ్డ రాజకీయాలని మాత్రం మరచిపోలేకపోయారు. దాంతో కొందరు రాజకీయ వ్యూహకర్తలతోనూ కలిసి పనిచేశారు. బంగ్లాదేశ్‌, ఒడిశాలో.. విద్యాభివృద్ధి కోసం పనిచేశారు. వరల్డ్‌ బ్యాంక్‌ గ్రాడ్యుయేట్‌ స్కాలర్‌షిప్‌ని అందుకుని.. హార్వర్డ్‌ కెనడీ స్కూల్‌ నుంచి పబ్లిక్‌ పాలసీలో పీజీ చేశారు. అక్కడి పాఠాలు ఆమె జీవితాన్ని మలుపు తిప్పాయి.

అందుకే ఆ బడి...

‘హార్వర్డ్‌ కెనడీ స్కూల్లో చదువుకున్న అనుభవం ఎన్నో విలువైన పాఠాలు నేర్పింది. ముఖ్యంగా ‘ఓవల్‌ ఆఫీస్‌’ అనే ప్రోగ్రామ్‌లో భాగంగా... ఎంపిక చేసిన విద్యార్థినులకు నాయకత్వ శిక్షణ ఇస్తారక్కడ. అలా శిక్షణ అందుకున్న వారిలో నేనూ ఉన్నా. అనేక దేశాల మాజీ దేశాధ్యక్షులు... తమ అనుభవాలు పంచుకుంటారక్కడ. అవన్నీ విన్నాక నాలో అనేక ప్రశ్నలు రేకెత్తాయి. మనదేశ రాజకీయాల్లో ఎంతమంది మహిళలు, యువత ప్రాతినిధ్యం వహిస్తున్నారు అని ఆలోచిస్తే... చాలా తక్కువమంది కనిపించారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలనే స్నేహితుడు ప్రఖార్‌భర్తియాతో కలిసి 2018లో దిల్లీలో ఐఎస్‌డీ స్థాపించా. గ్రామీణ యువత, మహిళలు, చదువుకున్నవారు, నిజాయతీపరులను రాజకీయాల్లో భాగం చేయాలనుకున్నాం. న్యాయవాదులని తయారుచేయడానికి ‘లా’స్కూళ్లు... వ్యాపారవేత్తలని ప్రోత్సహించేందుకు ఇంక్యుబేటర్లు ఉన్నట్టుగా... దీన్ని పొలిటికల్‌ ఇంక్యుబేటర్‌ అనుకోవచ్చు. కొత్తవారే కాదు ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నవారూ ఈ శిక్షణ అందుకోవచ్చు’ అంటారు హేమాక్షి. ఈ స్కూల్‌ నుంచి డెమోక్రసీ ఎక్స్‌ప్రెస్‌, షీ రిప్రజెంట్స్‌, ది గుడ్‌ పొలిటీషియన్‌ వంటి కోర్సులని అందిస్తున్నారు. ఇప్పటి వరకూ 200 మందికిపైగా శిక్షణ తీసుకున్నారు. 

అన్ని మతాలు... అన్ని ప్రాంతాలూ...

దేశంలోని పదిహేను పార్టీలకు చెందిన వ్యక్తులు ఇక్కడ పాఠాలు నేర్చుకుంటున్నారు. వాళ్లంతా విభిన్న మతాలు, ప్రాంతాలకు చెందిన వాళ్లు. ఆనందీబెన్‌, కనిమొళి, మేధాపాట్కర్‌, ప్రవీణ్‌కుమార్‌ వంటివారు ఇక్కడ పాఠాలు చెప్పినవాళ్లలో ఉన్నారు. ‘మా పూర్వ విద్యార్థుల్లో కొందరు స్థానిక ఎన్నికల్లో పాల్గొంటున్నారు. వాళ్లు ఓటు కోసం ఏదో ఇస్తామని మభ్యపెట్టరు. ప్రజల్లో ఆలోచనని రేకెత్తిస్తారు. క్షేత్రస్థాయిలో పనిచేసే మహిళా రైతులు, గ్రామీణ విద్యార్థులకు ప్రాధాన్యమిస్తున్నాం. వారంతా రేపటి ప్రజాస్వామ్య విలువల్ని బతికించాలన్నదే మా కల. మా పాఠాలు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ల్లోనూ సాగుతాయి’ అనే హేమాక్షి ఈ బడి నిర్వహణకు కావాల్సిన నిధులను క్రౌడ్‌ఫండింగ్‌ ద్వారా సేకరిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్