వివక్షను దాటి... రక్షణ రంగంలో!

అమ్మాయిలు రక్షణ రంగంలో అడుగుపెట్టి... త్రివిధ దళాల్లో తమ సత్తా చాటుతున్నారు. కదనరంగంలో కర్తవ్య నిర్వహణలో ముందుకు సాగుతున్నారు. తమదైన యుద్ధ విన్యాసాలతో, శత్రుదేశాలపై గర్జిస్తున్నారు. మొన్న కర్తవ్యపథ్‌లో ప్రతిభ చాటిన ఈ వీరనారీమణులు...ఇప్పుడు సౌదీ అరేబియాలోని రియాద్‌లో జరుగుతోన్న వరల్డ్‌ డిఫెన్స్‌ షో-2024లో తమ శక్తిని ప్రపంచానికి చాటనున్నారు.

Published : 07 Feb 2024 03:56 IST

అమ్మాయిలు రక్షణ రంగంలో అడుగుపెట్టి... త్రివిధ దళాల్లో తమ సత్తా చాటుతున్నారు. కదనరంగంలో కర్తవ్య నిర్వహణలో ముందుకు సాగుతున్నారు. తమదైన యుద్ధ విన్యాసాలతో, శత్రుదేశాలపై గర్జిస్తున్నారు. మొన్న కర్తవ్యపథ్‌లో ప్రతిభ చాటిన ఈ వీరనారీమణులు...ఇప్పుడు సౌదీ అరేబియాలోని రియాద్‌లో జరుగుతోన్న వరల్డ్‌ డిఫెన్స్‌ షో-2024లో తమ శక్తిని ప్రపంచానికి చాటనున్నారు.

దేశ రక్షణలో మహిళలు మగవారికి ఏ మాత్రం తీసిపోరని చాటి చెప్పే సందర్భాలెన్నో ఇటీవలి కాలంలో ఆవిష్కృతమవుతూనే ఉన్నాయి. తాజాగా సౌదీ అరేబియా రాజధాని రియాద్‌ ఇందుకు వేదిక అయ్యింది. ఫిబ్రవరి 4-8వరకూ జరుగుతోన్న వరల్డ్‌ డిఫెన్స్‌ షోలో ఇండియా తరఫున భారత వైమానిక దళానికి చెందిన స్క్వాడ్రన్‌ లీడర్‌ భావనాకాంత్‌, ఆర్మీకి చెందిన కల్నల్‌ పొనుంగ్‌ డోమింగ్‌, నేవీ లెఫ్టినెంట్‌ అన్ను ప్రకాష్‌లు పాల్గొంటున్నారు. రక్షణ రంగలో వస్తోన్న మార్పులనూ, విజ్ఞానాన్నీ, కొత్త ఆలోచనల్నీ, సామర్థ్యాలను అన్వేషించడానికి ఉన్న దారుల్నీ ఇక్కడ చర్చించనున్నారు. ఈ కార్యక్రమానికి పలు దేశాల అత్యున్నత స్థాయి సైనికాధిపతులు, ప్రభుత్వ అధికారులు, రక్షణ రంగంలోని కీలక విభాగాధికారులు హాజరు కానున్నారు.

యుద్ధవిమానాలు నడిపేస్తూ...

2016లో భారత వైమానిక దళంలో ఫైటర్‌ పైలట్‌గా చేరిన మొదటి ముగ్గురు మహిళల్లో భావనాకాంత్‌ ఒకరు. బిహార్‌లోని దర్భంగా జిల్లా బెగుసురాయ్‌ ఆమె స్వస్థలం. మధ్యతరగతి కుటుంబం. ఖోఖో, బ్యాడ్మింటన్‌ల్లో ప్రతిభ చూపుతోన్న ఆమెను చూసి అంతా క్రీడాకారిణి అవుతుందనుకున్నారు. కానీ, సవాళ్లను సాధించడమంటే ఇష్టమున్న భావన పైలట్‌ కావాలని కలలు కన్నారు. 2014లో ఇంజినీరింగ్‌ పూర్తిచేసి కొన్నాళ్లు ఓ ఎంఎన్‌సీ కంపెనీలో చేరారు. తర్వాత తన లక్ష్యం దిశగా అడుగులు వేస్తూ ఏఎఫ్‌సీఏటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి హైదరాబాద్‌లోని ఎయిర్‌ఫోర్స్‌ అకాడెమీలో శిక్షణలో చేరారు. కఠోర దశలన్నీ అవలీలగా దాటేసి 2017లో ఫైటర్‌ స్క్వాడ్రన్‌లో చేరారు. అంబాలా ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి మిగ్‌ 21 బైసన్‌ యుద్ధవిమానాన్ని 1400 గంటల పాటు ఒక్కరే నడిపి రికార్డు సృష్టించారు. ప్రస్తుతం భావన ఐఏఎఫ్‌కు చెందిన సుఖోయ్‌ ఎస్‌యూ-30 ఫ్లీట్‌లో పైలట్‌గా పనిచేస్తున్నారు. నేడు  జరిగే చర్చల్లో రక్షణ రంగంలో లింగ వైవిధ్యం, మహిళల ప్రాతినిధ్యం వంటి విషయాలతో పాటు కంబాట్‌ ఏవియేషన్‌లో లింగ భేదాన్ని తగ్గించడంలో భారతవైమానిక దళ కృషిని వివరించనున్నారు.

ఇంజినీరింగ్‌ అద్భుతాలు చేస్తూ...                                                                          

పొనుంగ్‌ డోమింగ్‌ది అరుణాచల్‌ ప్రదేశ్‌. భారతసైన్యంలో కల్నల్‌ స్థాయి పదోన్నతి అందుకున్న ఆ రాష్ట్ర మొదటి మహిళాధికారి. 2008లో భారతసైన్యంలో లెఫ్టినెంట్‌గా నియమితులయ్యారామె. నాలుగున్నరేళ్లలోనే మేజర్‌ స్థాయికి ఎదిగారు. 2014లో డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలో యునైటెడ్‌ నేషన్స్‌ పీస్‌ కీపింగ్‌ ఫోర్స్‌ మిషన్‌లో పనిచేశారు. 2019లో లెఫ్టినెంట్‌ కల్నల్‌ స్థాయికి పదోన్నతి పొందారు. పొనుంగ్‌ మహారాష్ట్రలోని వాల్‌ చంద్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ నుంచి సివిల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. ఆర్మీలో చేరక ముందు కొంత కాలం ప్రైవేట్‌ సెక్టార్‌లో పనిచేశారు. ఆమె నాయకత్వం వహిస్తోన్న యూనిట్‌ ప్రస్తుతం లద్దాఖ్‌లోని డెమ్‌చోక్‌ సెక్టార్‌లో హై ఆల్టిట్యూడ్‌ రోడ్‌ని నిర్మిస్తోంది. దీనిద్వారా సుదూర ఔట్‌పోస్టుల్లో ఒకటైన ఫుక్చేకు కనెక్టివిటీని అందించనున్నారు. ఇది అతి సున్నితమైన ప్రాంతంలో, వాస్తవ నియంత్రణ రేఖకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. అంతేకాదు, తూర్పు లద్దాఖ్‌లోని ఎల్‌ఏసీ సమీపంలో ఉన్న అధునాతన ల్యాండింగ్‌ గ్రౌండ్‌ను యుద్ధ కార్యకలాపాలకోసం పూర్తి స్థాయిలో అప్‌గ్రేడ్‌ చేసే కీలక ప్రాజెక్టుకు కూడా నాయకత్వం వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సైనిక కార్యకలాపాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఇంజినీరింగ్‌ పోషించే కీలకపాత్ర వంటి విషయాలను ఈ సమావేశాల్లో ప్రస్తావించనున్నారు.

యుద్ధనౌకలో సేవలందిస్తూ...

ఇక అన్ను ప్రకాష్‌ నావికావైమానిక కార్యకలాపాల అబ్జర్వర్‌. ఐఎన్‌ఎస్‌ కొచ్చి అనే ఫ్రంట్‌ లైన్‌ డిస్ట్రాయర్‌లో పనిచేస్తోన్న మొదటి మహిళాధికారుల్లో ఒకరు. భారతనౌకాదళంలో యుద్ధనౌకలో సేవలందిస్తోన్న మహిళల ప్రాతినిధ్యం, దేశ సముద్ర రక్షణ సామర్థ్యాల గురించి ఇక్కడ చర్చించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్