మనసున్న మహారాణి!

ఆమె... ఓ మహారాణి... ప్రపంచంలోకెల్లా అతిపెద్ద భవనం ఆమె నివాసం... భారత రాజకుటుంబాల్లోకెల్లా అత్యంత ధనవంతురాలుగా... అద్భుత సౌందర్యరాశిగా ఫోర్బ్స్‌ గౌరవాన్నీ అందుకున్నారు... మానవతావాదిగానూ పేరొందారు. ఆమె గైక్వాడ్‌ రాణి రాధికా రాజే.

Updated : 12 Feb 2024 10:48 IST

ఆమె... ఓ మహారాణి... ప్రపంచంలోకెల్లా అతిపెద్ద భవనం ఆమె నివాసం... భారత రాజకుటుంబాల్లోకెల్లా అత్యంత ధనవంతురాలుగా... అద్భుత సౌందర్యరాశిగా ఫోర్బ్స్‌ గౌరవాన్నీ అందుకున్నారు... మానవతావాదిగానూ పేరొందారు. ఆమె గైక్వాడ్‌ రాణి రాధికా రాజే. ‘బరోడా షాలు’ చీరను పునరుద్ధరించడంతోపాటు తనదైన చీరల సేకరణతో ఇన్‌స్టాలోనూ సందడి చేస్తున్నారు!

రాధికా రాజే వాంకానేర్‌ రాజకుటుంబపు వారసురాలు. గైక్వాడ్‌ రాజవంశానికి చెందిన హెచ్‌ఆర్‌హెచ్‌ సమర్జిత్‌ సింగ్‌ని వివాహం చేసుకుని బరోడా (వడోదర) సంస్థానంలోకి కోడలిగా అడుగుపెట్టారామె. రాణీవాసమంటే... పట్టు పీతాంబరాలు, ధగధగలాడే నవరత్న ఖచిత హారాలూ ధరించి మేలి ముసుగులో రాచరికపు పరదాల మధ్య ఉండిపోవాలనుకోలేదామె. సంప్రదాయ సంకెళ్లను తెంచుకుని... సామాజిక సేవకై కదిలారు. వేలమంది చేతివృత్తుల వారికి చేయూతనిస్తున్నారు. ఈ విషయంలో తండ్రి డాక్టర్‌ ఎమ్‌ కె రంజిత్‌ సింగ్‌ ఝాలా లక్షణాలే తానూ పుణికిపుచ్చుకున్నానని గర్వంగా చెబుతారామె. ఐఏఎస్‌ అధికారిగా పనిచేయాలనే లక్ష్యంతో తన రాచరికపు గుర్తింపునే త్యజించారాయన. అంతేకాదు, భోపాల్‌ విషవాయువు ప్రబలినప్పుడు అక్కడికి కమిషనర్‌గా వెళ్లి అలుపెరగని సేవలందించారు. అది చిన్నారి రాధికపై చెరగని ముద్రవేసింది. తర్వాత వారి కుటుంబం దిల్లీకి మారింది. అక్కడ సాధారణ జీవనశైలినే అనుసరించారు. రాధిక, ఆమె చెల్లి... బడికి వెళ్లడానికి ప్రభుత్వ బస్సులనే వినియోగించుకునేవారట. రాధికకు చదవటం, రచనలు చేయడమంటే చాలా ఇష్టం. ఆమె దిల్లీలోని లేడీ శ్రీరామ్‌ కాలేజీలో ఇండియన్‌   హిస్టరీలో పీజీ చేశారు. 2002లో బరోడా యువరాజు సమర్జిత్‌ సింగ్‌ని వివాహం చేసుకోకముందు ఓ ఆంగ్ల పత్రికలో కొన్నాళ్లు జర్నలిస్టుగానూ పనిచేశారు.

అమ్మదే ఆ ఆలోచన...

రాజకుటుంబంలో పుట్టినా... జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలను చూశానంటారామె. అంతేకాదు, తానెప్పుడూ రాచరికపు అంతస్తుల్లో జీవించాలని అనుకోలేదనీ చెబుతారు.‘చదువుతూనే జర్నలిస్టుగా పనిచేశా. రాజకుటుంబ యువతిగా ఇదంతా ఎంత అసాధారణ విషయమన్నది అప్పటికి నాకు తెలియదు. మా కజిన్స్‌ అందరికీ ఇరవై ఏళ్లకే పెళ్లిళ్లయిపోయాయి. సమర్జిత్‌తో వివాహమైనా... ఉన్నత చదువులు చదవాలనే నా కోరికను ఆయన ప్రోత్సహించారు. అయితే, నా ఆలోచనలకూ, స్వతంత్ర భావాలకూ అమ్మ ఓ కారణం. ఆవిడ మమ్మల్ని ఎవరిపైనా ఆధారపడకుండా పెంచారు’ అని గుర్తు చేసుకుంటారామె. రాధిక మెట్టినింట అడుగుపెట్టాక ప్యాలెస్‌ గోడలపై ఉన్న రవివర్మ చిత్రాలనూ, ఆ పెయింటింగ్‌ల్లోని వస్త్రాలనూ చూసి ఆశ్చర్యపోయారు. గైక్వాడ్‌ వంశ మహారాణులైన శాంతాదేవి, మృణాళినీ దేవి, అలౌకికారాజే, అంజనారాజే, ఇందిరారాజే, జమ్నాబాయి, చిమ్నాబాయిలు ఆ చిత్రాల్లో ధరించిన వివిధ చేనేత చీరలకి పునరుజ్జీవనం తేవాలనుకున్నారు. రాధిక, వాళ్లత్తగారితో కలిసి స్థానిక నేతపనివారి సాయంతో అలాంటి చీరల్ని నేయించారు. వీటిల్లో రాజ్‌కోట్‌ పటోలా, బనారెస్‌, కాటన్‌ చందేరీ, బరోడా షాలు వంటివెన్నో ఉన్నాయి. ఇవన్నీ తీసుకెళ్లి ముంబయి వేదికగా ఎగ్జిబిషన్‌ పెడితే ఒక్కటీ మిగల్లేదట. దాంతో తర్వాత దేశవిదేశాల్లోనూ ప్రదర్శించారు. ఈ పనివల్ల అక్కడి చేనేత కార్మికులకు గుర్తింపుతో పాటు ఉపాధీ లభించింది. మహారాజా ఫతేసింగ్‌ మ్యూజియం, మహారాణి చిమ్నాబాయి స్త్రీ ఉద్యోగాలయ, సీడీఎస్‌ ఆర్ట్‌ ఫౌండేషన్‌ల ద్వారా ఎన్నో స్వయం ఉపాధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు రాధిక. ‘దర్పాన్ని ప్రదర్శిస్తే వచ్చే గుర్తింపు కంటే... ఎదుటివారికి సాయపడితే వచ్చే సంతృప్తి అంటేనే నాకిష్టం. నచ్చిన రంగాన్ని ఎంపిక చేసుకుని.. మనసుకి నచ్చినట్టు జీవించమనీ మా అమ్మాయిలకూ చెబుతున్నా’ అంటారామె. దీంతో పాటు ప్రస్తుతం ప్యాలెస్‌లోని విలువైన ఆస్తులను డిజిటలైజ్‌ చేసే పనిలో ఉన్నారు. అంతేనా, రాజకుటుంబాలకు చెందిన అత్యంత ధనవంతురాలిగానే కాకుండా భారత రాజవంశ స్త్రీలలోకెల్లా సౌందర్యవతిగానూ ఫోర్బ్స్‌ గుర్తింపునిచ్చింది.


పన్నెండేళ్లు పట్టింది...

భారతదేశంలోనే ఖరీదైన, విలాసవంతమైన ఇల్లు ముఖేష్‌ అంబానీ ఎంటీలియానే అనుకుంటాం. కానీ, విస్తీర్ణంలో దాన్ని మించిన నివాసభవనం ఒకటుంది. అదే ‘లక్ష్మీవిలాస్‌ ప్యాలెస్‌’. గుజరాత్‌లోని బరోడా (వడోదర)లో ఉంది. 500 ఎకరాల్లో 176 గదులతో నిర్మించిన ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్‌ నివాసాల్లో ఒకటి. బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ కన్నా నాలుగురెట్లు పెద్దది. బరోడా రాజ కుటుంబం గైక్వాడ్‌ వంశస్థులైన హెచ్‌ఆర్‌హెచ్‌ సమర్జిత్‌ గైక్వాడ్‌, రాధికారాజేలు దీన్ని నిర్వహిస్తున్నారు. ఈ రాజప్రాసాదాన్ని నిర్మించడానికే పన్నెండేళ్లు పట్టిందట.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్