ఆ పట్టుదలకు... సీఎం ప్రశంస!

పురిటి నొప్పులు భరించి, ఓ బిడ్డను ఈ లోకంలోకి తేవడాన్ని మరోజన్మగా చెబుతారు. తిరిగి ఆమె శరీరం కోలుకోవడానికి కొన్నిరోజులు పడుతుంది. అంత నీరసంలోనూ తన లక్ష్యాన్ని వదల్లేదు శ్రీపతి.

Published : 15 Feb 2024 01:24 IST

పురిటి నొప్పులు భరించి, ఓ బిడ్డను ఈ లోకంలోకి తేవడాన్ని మరోజన్మగా చెబుతారు. తిరిగి ఆమె శరీరం కోలుకోవడానికి కొన్నిరోజులు పడుతుంది. అంత నీరసంలోనూ తన లక్ష్యాన్ని వదల్లేదు శ్రీపతి. ఆ పట్టుదలకి విజయం తలొంచడమే కాదు, ముఖ్యమంత్రి ప్రశంసలూ దక్కాయి.

తమిళనాడులోని తువించికుప్పం అనే మారుమూల గిరిజన గ్రామం శ్రీపతిది. కనీస సౌకర్యాలే ఎరుగని ఊరది. 15కి.మీ. కాలినడకన వెళితే కానీ బస్సు సౌకర్యం ఉండదు. అలాంటివారికి చట్టాలు, హక్కులపై అవగాహన ఎలా ఉంటుంది? వారికే సమస్య వచ్చినా ప్రశ్నించేదెవరు? ఇవన్నీ ఆలోచించిన శ్రీపతి తన ప్రజలకు అండగా నిలవడానికి ‘లా’ చదవాలి అనుకుంది. అమ్మానాన్నలు దినసరి కూలీలు. ముగ్గురు పిల్లల్లో ఈమే పెద్దది. పోషణే భారం. అలాంటిది చదివించడమంటే మరింత భారమే. అయినా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చదువు కొనసాగిస్తూ వచ్చింది. దీనికోసం సొంత ఊరుని విడిచి అవతనూరుకు వలస వెళ్లారు కూడా. ‘జడ్జి’ అవ్వాలన్నది శ్రీపతి కల. కానీ బ్యాచిలర్‌ ఆఫ్‌ లా పూర్తవడంతోనే అమ్మానాన్నలు పెళ్లి చేశారు. భర్త వెంకట్రామన్‌ అంబులెన్స్‌ డ్రైవర్‌. ఆమె కలను అతనూ ప్రోత్సహించడంతో సన్నద్ధత కొనసాగించింది.

‘తమిళనాడు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ పడింది. ఇంతలో నేను గర్భవతిని. అయినా దరఖాస్తు చేశా. తీరా పరీక్ష, ప్రసవ సమయం ఒకేరోజు. ఇక ఆశ వదులుకోవాల్సిందే అనుకున్నా. నిరుత్సాహానికి గురయ్యా. కానీ డెలివరీ డేటుకి ఒకరోజు ముందే ప్రసవమైంది. నాలో మళ్లీ ఆశ చిగురించింది. వైద్యులు అంగీకరించలేదు. నేను పట్టుబట్టా. దీంతో వారి ఆధ్వర్యంలో 200 కి.మీ. ప్రయాణించి మరీ పరీక్ష రాశా. నీరసం ఆవరించేది. రాయలేనేమో అనిపించినప్పుడల్లా మా తండా గిరిజనులు గుర్తొచ్చేవారు. తిరిగి ఉత్సాహం తెచ్చుకొని పూర్తిచేశా. శ్రమ ఫలించి, సివిల్‌ జడ్జిగా ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉంది’ అంటుంది 23ఏళ్ల శ్రీపతి.

ప్రశంసల వెల్లువ..

ఆ తెగ నుంచి ఎంపికైన తొలి సివిల్‌ జడ్జి కావడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ శ్రీపతిని అభినందిస్తూ ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్ట్‌ పెట్టారు. ‘మంత్రులు, అధికారులు ఫోన్‌ చేసి అభినందనలు చెబుతున్నారు. మా తండావారైతే ఏకంగా పూలదండలు, డప్పులు, వాద్యాలతో ఊరేగించడం మర్చిపోను’ అంటోంది శ్రీపతి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్