నివేదిత... ‘భక్షక్‌’ రియల్‌ హీరో!

అమ్మానాన్నల ప్రేమ ఎలా ఉంటుందో తెలియని అనాథలు. పేదరికం బాధ పడలేక కాసింత నీడ ఉంటుందని నమ్మి వచ్చిన అమాయక ఆడపిల్లలు. చివరికి వాళ్లకు మిగిలిందేంటి?అత్యాచారాలు.. అవాంఛిత గర్భాలు... చావులు. వాళ్లలో లోకం తెలియని పదేళ్లలోపు పసిమొగ్గలే ఎక్కువ! ఆమే లేకపోతే వాళ్ల కన్నీళ్లు ఆ ‘షెల్టర్‌ హోమ్స్‌’ గోడలకే పరిమితం అయ్యేవి.

Updated : 16 Feb 2024 06:57 IST

అమ్మానాన్నల ప్రేమ ఎలా ఉంటుందో తెలియని అనాథలు. పేదరికం బాధ పడలేక కాసింత నీడ ఉంటుందని నమ్మి వచ్చిన అమాయక ఆడపిల్లలు. చివరికి వాళ్లకు మిగిలిందేంటి?అత్యాచారాలు.. అవాంఛిత గర్భాలు... చావులు. వాళ్లలో లోకం తెలియని పదేళ్లలోపు పసిమొగ్గలే ఎక్కువ! ఆమే లేకపోతే వాళ్ల కన్నీళ్లు ఆ ‘షెల్టర్‌ హోమ్స్‌’ గోడలకే పరిమితం అయ్యేవి. కానీ నివేదితా ఝా అలా కానివ్వలేదు. ప్రభుత్వంతో పోరాడి ప్రపంచానికి తెలిసేటట్టు చేసింది. ఆ కథే ఇప్పుడు  భూమి పెడ్నేకర్‌ నటించిన ‘భక్షక్‌’గా విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది...

2018... ‘ఉండటానికి ఇల్లు లేక రోడ్లపైనో, దొరికిన వసతి గృహాల్లోనో ఉండే వాళ్ల జీవితాలు ఎలా ఉంటాయి?’.. ప్రాజెక్ట్‌ వర్క్‌లో భాగంగా ఈ అంశాన్ని ఎంచుకున్నారు టిస్‌(టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌స్టడీస్‌)లో చదువుకుంటున్న విద్యార్థులు. అపూర్వ వివేక్‌, సునీతా బిశ్వాస్‌లని కలుపుకొని ఏడుగురు వీళ్లు. అప్పటికే వివిధ సామాజిక అంశాలపై పనిచేసిన అనుభవం ఉన్నవాళ్లే వారంతా. దాంతో బిహార్‌లోని 35 జిల్లాల్లో ఉన్న 110 వసతి గృహాలపై లోతైన అధ్యయనమే చేశారు. షాకింగ్‌! 15 వసతి గృహాల్లో ఘోరాలు జరుగుతున్నాయని కనిపెట్టారు. ముఖ్యంగా ముజఫర్‌పుర్‌లోని బాలికా వసతి గృహంలో ఆడపిల్లలపై జరుగుతున్న దారుణాల గురించి వంద పేజీల రిపోర్ట్‌ రాసి ప్రభుత్వానికి నివేదించారు. కానీ ఏం లాభం! నెలరోజులయినా ప్రభుత్వం పట్టించుకోనేలేదు. అప్పుడే ఇండిపెండెంట్‌ జర్నలిస్ట్‌గా పనిచేస్తున్న నివేదితా ఝాకి ఈ విషయం తెలిసింది. ఆ బాలికా గృహంలో ఏం జరుగుతోందో తెలుసుకుంది. అక్కడ పనిష్మెంట్‌ పేరుతో అమ్మాయిలపై సంస్థ నిర్వాహకులే అఘాయిత్యాలు చేస్తారు. మాట వినకపోతే జననాంగాల్లో కారం పోస్తారు. సిగరెట్లతో కాలుస్తారు. ఇనుప రాడ్లతో కొడతారు. అవసరం అయితే అధికారుల దగ్గరకు ‘కానుక’గా పంపిస్తారు. వీటన్నింటి వెనకా ఉన్న సూత్రధారి బ్రజేష్‌ ఠాకూర్‌. అతనే ఈ షెల్టర్‌ యజమాని. ‘సేవా సంకల్ప్‌ ఏవమ్‌ వికాస్‌ సమితి’ పేరుతో వసతి గృహాన్ని నడుపుతూ అందుకు కావాల్సిన నిధులని ప్రభుత్వం నుంచే పొందేవాడు. మంత్రులతో కలిసి కాఫీ తాగేంత పలుకుబడున్న వ్యక్తి. అంతెందుకు... సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మంజూవర్మ భర్త అతనికి స్నేహితుడే. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోయింది. చివరికి నివేదిత ‘బిహార్‌ మహిళా సమాజ్‌’ బృందంతో కలిసి పెద్ద ఎత్తున పోరాడారు. అలా కేసు హైకోర్టుకి వెళ్లింది. కానీ ఏం లాభం? మీడియా ఈ విషయంలో చొరవ తీసుకోవద్దంటూ తీర్పు వచ్చింది. ఇంత జరిగినా ఆ సంస్థకు ప్రభుత్వం నిధులు ఇస్తూనే ఉంది.

పిల్‌ వేసి...

‘ఇదేం దారుణం.. ప్రపంచానికి ఆ ఆడపిల్లలపై జరిగిన అఘాయిత్యాలు తెలియాలి’ అంటూ మీడియాపై నిషేధాన్ని తొలగించాలని ఫౌజియా షకీల్‌ అనే మహిళా లాయర్‌ సాయంతో పిల్‌ దాఖలు చేసింది నివేదిత. ఈ కేసు సీబీఐకి వెళ్లింది. 34 మంది అమ్మాయిలపై అత్యాచారాలు జరిగాయనీ, కొందరు ఆడపిల్లలు ‘మాయం’ అయ్యారనీ తెలిసినా... సీబీఐ దగ్గరా ఆశించిన ఫలితం దక్కలేదు ఆమెకి. దాంతో తక్కిన షెల్టర్‌ హోమ్స్‌లోనూ ఏం జరుగుతోందో తెలుసుకోవాలని మరో పిల్‌ దాఖలు చేసింది. దాంతో సుప్రీంకోర్టు పోక్సో కోర్టుకి అప్పగించి, విచారణ వేగవంతం చేయమంది. నెమ్మదిగా నివేదిత కష్టానికి ఫలితం దక్కింది. మంత్రులు, అధికారులపై ఒత్తిడి పెరిగింది. ప్రభుత్వం దిగిరాక తప్పని పరిస్థితి. నేరస్థులని పట్టుకున్నారు.

అలా ప్రపంచానికి ముజఫర్‌పుర్‌ ఆడపిల్లల కష్టాలని తెలియచేసిన నివేదిత ప్రస్తుతం బిహార్‌ వర్కింగ్‌ జరల్నిస్ట్‌ సంఘానికి ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. సౌత్‌ ఏషియన్‌ విమెన్‌ ఇన్‌ మీడియా బిహార్‌ చాప్టర్‌కి ప్రెసిడెంట్‌ కూడా. బిహార్‌, ఝార్ఖండ్‌ ప్రాంతాల్లోని ఆడపిల్లలపై ఉన్న వివక్షని వ్యతిరేకిస్తూ మూడు పుస్తకాలు రాశారు. ఆమె స్ఫూర్తితో వైశాలీసింగ్‌ పాత్రలో భూమి పెడ్నేకర్‌ నటించిన ‘భక్షక్‌’ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్