ఒక్క ఛాన్స్‌ అంటూ వచ్చి... ఫోర్బ్స్‌కెక్కారు!

‘మా సినిమాలో హీరోయిన్‌ పాత్రకు మిమ్మల్ని పరిశీలిస్తున్నాం. ఒకసారి ఆడిషన్‌కి రాగలరా?’ అన్న కాల్‌ వస్తే ఎవరైనా ఏం చేస్తారు? ఎగిరి గంతేస్తారు. రష్మిక మందన్న మాత్రం ‘నాకు అనుభవమే లేదండీ’ అని చెప్పేసిందంట. అలాగని తనకేమీ ఆసక్తి లేక కాదు. అప్పటికే రెండుసార్లు నిరాశ చెందేసరికి మళ్లీ అలాగే జరుగుతుందని భయం. చదువులో ఫస్ట్‌ కాకపోయినా ఆటపాటల్లో చురుకు. ఓసారి కాలేజీ కార్యక్రమానికి హోస్ట్‌గా చేసింది.

Updated : 17 Feb 2024 14:10 IST

‘నో...’, ‘షూటింగ్‌ క్యాన్సిల్‌...’ ఇలా కొన్ని రిజెక్షన్లు ఎదుర్కొన్నాక ‘ఒకే ఒక్క ఛాన్స్‌’ అంటూ ఇంట్లో వాళ్లని ఒప్పించి... అతి తక్కువ సమయంలోనే ‘నేషనల్‌ క్రష్‌’గా పేరు తెచ్చుకుంది రష్మిక.

‘ఆటల్లేవ్‌.. పోయి చదువుకో’ అని తల్లిదండ్రులు ఎంత చెప్పినా ‘ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి. దేశం తరపున ఆడి చూపిస్తా’ అంటూ పేదరికానికి ఎదురీది అథ్లెట్‌గా దేశం తరపున పతకాలు కొల్లగొడుతోంది విశాఖపట్నం అమ్మాయి జ్యోతి యర్రాజి.

తమ ప్రతిభతో దేశం మనసు దోచిన వీరిని ఫోర్బ్స్‌ 30 అండర్‌ 30 జాబితాలో చేర్చి శెభాష్‌ అంటోంది.  

చిన్న పట్టణం నుంచి...

‘మా సినిమాలో హీరోయిన్‌ పాత్రకు మిమ్మల్ని పరిశీలిస్తున్నాం. ఒకసారి ఆడిషన్‌కి రాగలరా?’ అన్న కాల్‌ వస్తే ఎవరైనా ఏం చేస్తారు? ఎగిరి గంతేస్తారు. రష్మిక మందన్న మాత్రం ‘నాకు అనుభవమే లేదండీ’ అని చెప్పేసిందంట. అలాగని తనకేమీ ఆసక్తి లేక కాదు. అప్పటికే రెండుసార్లు నిరాశ చెందేసరికి మళ్లీ అలాగే జరుగుతుందని భయం. చదువులో ఫస్ట్‌ కాకపోయినా ఆటపాటల్లో చురుకు. ఓసారి కాలేజీ కార్యక్రమానికి హోస్ట్‌గా చేసింది. ఆ చలాకీతనం చూసి, సినిమా అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. మధ్యతరగతి కుటుంబం. ‘నిలబడితే సరే, లేకపోతే? నువ్వు చదివేది ఇంటరే! కనీసం డిగ్రీ అయినా పూర్తిచేయి’ అన్నారట అమ్మానాన్నలు. తొలి అవకాశం పోయింది. మరోసారి... కాలేజీ అందాల పోటీల్లో సరదాగా పాల్గొని కిరీటం దక్కించుకుంది. తర్వాత రాష్ట్ర, జాతీయ స్థాయుల్లోనూ అదే విజయం. ఆ ఆత్మవిశ్వాసంతో పదులకొద్దీ ఆడిషన్లు ఇస్తే అవకాశం వచ్చింది. నెలరోజుల రిహార్సల్స్‌ తర్వాత ‘సినిమా ముందుకు సాగ’దన్నారు. ఆ వైఫల్యం తర్వాత ‘మనకిది సరిపడదులే’ అనేసుకుంది. కానీ మూవీ టీమ్‌ పట్టుబట్టడంతో ఆడిషన్‌కి వెళ్లి ఎంపికైంది. తొలి చెక్‌ అందుకున్నాక రష్మికకు ఏం చేయాలో అర్థం కాలేదట. ఆనందంగా అమ్మకు ఫోన్‌ చేస్తే ఆవిడ కంగారుపడ్డారు. ‘ఒక్క సినిమానే. తర్వాత మానేస్తా’నని బతిమాలిందట. హీరో, దర్శకులు పేరున్నవారే అవ్వడంతో సరేనన్నారు. అదే 2016లో విడుదలైన ‘కిరిక్‌ పార్టీ’. అదేమో పెద్ద విజయం సాధించింది. ఆ తర్వాత మరొక్కటి, ఇంకొక్కటంటూ... ఎనిమిదేళ్లలో కన్నడ, తెలుగు, తమిళం, హిందీల్లో 20కిపైగా సినిమాలు చేసింది. దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకొని ‘నేషనల్‌ క్రష్‌’గా ఎదిగింది. వ్యాపారంలోకీ అడుగుపెడుతోంది. కర్ణాటకలోని విరాజ్‌పేట అనే చిన్న పట్టణం అమ్మాయి ఈ స్థాయికి చేరడం గొప్పేగా మరి! అందుకే ఫోర్బ్స్‌ తాజా ‘30 అండర్‌ 30’ జాబితాలో 27 ఏళ్ల రష్మికకు చోటిచ్చింది. చిరునవ్వుకు మారుపేరుగా ఉండే రష్మిక తెర మీద విజయాలే కాదు, తెర వెనక నెగిటివిటీనీ ఎదుర్కొంది. బాడీషేమింగ్‌, ట్రోలింగ్‌... ఒకానొక దశలో పరిశ్రమను వదలడమే మేలేమో అనీ అనుకుంది. కానీ అందరినీ ఒప్పించడం సాధ్యం కాదని అర్థమయ్యాక వాటిని పట్టించుకోవడం మానేసింది. విమర్శలకు చిరునవ్వుతోనే సమాధానం చెబుతుంది. ‘ఏడుపు, కోపం వీటిని బలహీనతలుగా లెక్కేస్తారు. అందరి ముందూ వాటిని ప్రదర్శించాల్సిన అవసరం లే’దన్న అమ్మ మాటలే తనకు స్ఫూర్తి అంటుంది రష్మిక.


గంజినీళ్లు తాగి...

పాలకు బదులు గంజినీళ్లు, ఆకలేస్తే అరటిపండ్లు తిని కడుపునింపుకొని రోజులు నెట్టుకొచ్చిన అమ్మాయి... ఇప్పుడు అథ్లెట్‌గా ప్రపంచ రికార్డులు బద్దలుకొడుతోంది. దేశంలోనే వేగవంతమైన హర్డ్‌లర్‌గా రాణిస్తోంది. గత ఏడాది ఆసియాగేమ్స్‌లో పతకం సాధించి తెలుగు రాష్ట్రాలకు పేరుతెచ్చిన జ్యోతి యర్రాజి స్వస్థలం విశాఖపట్నంలోని కైలాసపురం. తండ్రి సూర్యనారాయణ ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డ్‌. తల్లి కుమారి ఆసుపత్రిలో పార్ట్‌ టైం ఉద్యోగం చేసేది. ఒక మగపిల్లాడి తర్వాత జ్యోతి కడుపులో ఉండగా ‘ఒక వేళ ఆడపిల్ల పుడితే... కట్నాలు, కానుకలు తీసుకురావడం ఎలా’ అని వాళ్ల అమ్మ బెంగపెట్టుకోని రోజులేదట. ఆ భయంతోనే ఓ రోజు ఆసుపత్రికి వెళ్లి ‘ఆడపిల్ల అయితే వదు’్ద అని వైద్యులతో చెప్పింది. వాళ్లు మందలించి ఎవరైనా ఒకటే అని నచ్చచెప్పడంతో ఇంటికి తిరిగివచ్చింది. ‘పాపపుట్టాక... పాలు పట్టే స్థోమత లేక గంజినీళ్లని పాలబాటిల్‌లో పోసి తాగించేదాన్ని. సరే... నాలుగు అక్షరం ముక్కలన్నా వస్తే ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటుందనుకున్నా. కష్టపడి వాళ్లన్నయ్యతో పాటు చదివిస్తుంటే, తను ఆటలు ఆడటం మొదలుపెట్టింది. సన్నగా, చురుగ్గా ఉండేసరికి స్కూల్లోనూ ప్రోత్సహించేవారు. రోజంతా పరుగులు పెట్టి ఇంటికి ఆలస్యంగా వచ్చేది. చదువుకుంటే బాగుపడతావ్‌ అని చెప్పినా ఇంట్లో తెలియకుండా ఆడేది. కొట్టినా, తిట్టినా... ఏం చేసినా తనకి ఆటలపై ఉన్న ఇష్టాన్ని పోగొట్టలేం అని తెలిసి వదిలేశా. తనే గెలిచింది. ఇప్పుడు తనకొచ్చే పతకాలని దాచడానికి మా ఇరుకిల్లు సరిపోవడం’ లేదని సంతోషంగా చెప్పుకొచ్చింది జ్యోతి తల్లి కుమారి. తండ్రి నెల జీతం తనకు స్పోర్ట్స్‌ షూ కొనడానికి కూడా సరిపోదని తెలిసి రోడ్డువారన దొరికే వాటితోనే సాధన చేసింది జ్యోతి. దాంతో కాళ్లకు గాయాలు, వెన్నునొప్పి. సాధన సమయంలో సరైన పోషకాహారం కూడా ఉండేది కాదు. స్కూల్లో ఇచ్చే పప్పుండలు... చౌకగా దొరికే అరటిపండ్లతోనే కడుపు నింపుకొనేది. ‘నాన్న జీతం తక్కువ. అందుకే ఇంట్లో అడగలేకపోయేదాన్ని. ఒక స్పాన్సర్‌ స్పైక్‌ షూ కొనిచ్చాక గాయాల బాధ తగ్గింది. శాయ్‌ శిక్షణ నాకు అండగా నిలిచింది. అయినా చదువునీ నిర్లక్ష్యం చేయలేదు. డిగ్రీ చేస్తున్నా. ఇప్పుడిలా ఫోర్బ్స్‌ గుర్తింపు రావడం ఆనందంగా ఉంది.’ అనే జ్యోతి గత ఏడాది ఎన్నో రికార్డులని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఇరాన్‌లో జరుగుతున్న 11వ ఏషియన్‌ ఇండోర్‌ అథ్లెటిక్‌ ఛాంపియన్‌షిప్‌నకు దేశం తరఫున నాయకత్వం వహిస్తోంది.

రావివలస సురేష్‌, విశాఖపట్నం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్