ఆ రాణులు... ‘గంజీఫా’ని బతికించారు!

‘రాజులు... రాణులు... సంస్థానాలు... గతకాలపు జ్ఞాపకాలు’ అని నిరాశపడేవారికి మహారాష్ట్రలోని సావంత్‌వాడీ సంస్థానం కోట తలుపులు తెరిచి... మనమూ ఆ రాచరికపు వైభవాన్ని ఆస్వాదించే అవకాశం కల్పిస్తోంది. శతాబ్దాల నాటి గంజీఫా కళని ఆధునిక తరానికి పరిచయం చేసేందుకు యువరాణి శ్రద్ధా సావంత్‌ చేసిన ప్రయత్నం ఇది.

Updated : 19 Feb 2024 07:05 IST

‘రాజులు... రాణులు... సంస్థానాలు... గతకాలపు జ్ఞాపకాలు’ అని నిరాశపడేవారికి మహారాష్ట్రలోని సావంత్‌వాడీ సంస్థానం కోట తలుపులు తెరిచి... మనమూ ఆ రాచరికపు వైభవాన్ని ఆస్వాదించే అవకాశం కల్పిస్తోంది. శతాబ్దాల నాటి గంజీఫా కళని ఆధునిక తరానికి పరిచయం చేసేందుకు యువరాణి శ్రద్ధా సావంత్‌ చేసిన ప్రయత్నం ఇది. ఫ్యాషన్‌, ఇంటీరియర్‌ల్లోకి చొచ్చుకొస్తున్న గంజీఫా కళకీ... ఈ యువరాణికీ ఏంటి సంబంధం అనుకుంటున్నారా?...

ఈ మధ్యనే సావంత్‌వాడీ కోటలోని కొంత భాగాన్ని... బొటిక్‌ హోటల్‌గా మార్చి పర్యాటక విడిదిగా మార్చారు. అక్కడ అడుగుబెట్టిన వారికి డోర్‌నాబ్‌ దగ్గర్నుంచీ గోడలూ, ఫర్నిచర్‌ దేన్ని చూసినా గంజీఫా కళ తాలూకూ స్ఫూర్తి కన్నులనిండుగా కనిపిస్తుంది. ‘అరె ఈ కళ అద్భుతంగా ఉందే’ అనుకుంటే అక్కడి నుంచి కళాకారులు తయారుచేసిన అందమైన కార్డ్స్‌, బోర్డ్‌గేమ్స్‌, పోట్లీ బ్యాగులు వంటివాటిని కొని తీసుకెళ్లొచ్చు. నిజానికి ఆ కళనీ, కళాకారుల్నీ బతికించేందుకే అమెరికా నుంచి వచ్చిన శ్రద్ధ ఆ కోటని సామాన్య ప్రజలకోసం తెరిచి ఉంచింది.

బాబర్‌తో వచ్చి...

గంజీఫా... చూడచక్కని రంగుల్లో గుండ్రంగా, కొన్ని దీర్ఘచతురస్రంగా ఉండే ఈ కార్డ్స్‌ని పేకల్లా ఆడేవారు. వాటిలో కొన్నింటిపై రాజులు, రాణులు, కోటలు, గుర్రాల్లాంటి బొమ్మలుంటే మరికొన్నింటిపై రామాయణ పాత్రలూ, విష్ణుమూర్తి అవతారాలు, యోగాసనాలు, నాట్య ముద్రలూ ఉంటాయి. మరికొన్నింటిపై శ్రమజీవులు, సైనికుల చిత్రాలుంటాయి. ‘ఈ కార్డ్స్‌ మనకు పర్షియా నుంచి వచ్చాయి. బాబర్‌ వస్తూ, వస్తూ తనతోపాటు తెచ్చాడని చరిత్ర చెబుతోంది. మొగలుల కాలంలో ప్రాచుర్యం పొందిన వీటిని రాజులు బంగారం, వెండితో తయారు చేయించుకొనేవారు. సామాన్యులూ ఆసక్తి చూపించి... చెక్కనీ, పాత చీరల్నీ, రాళ్లను పొడిచేసిన రంగుల్నీ వాడి తయారుచేసేవారు. మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ కళ ప్రాచుర్యం పొందింది. అలా ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాల నుంచి వెళ్లిన కొందరు చిత్రకారులు మహారాష్ట్రలోని సావంత్‌వాడీ రాజులకి ఈ గంజీఫా కార్డ్స్‌ని పరిచయం చేశారు. ఆ తర్వాత ఒడిశా, మైసూరు, కశ్మీర్‌, గుజరాత్‌, నేపాల్‌ ప్రాంతాలకు ఈ కళ పరిచయమైనా ఆ వైభవం క్రమంగా తగ్గుతూ వచ్చిందంటారు ఈ కార్డ్స్‌పై పరిశోధనలు చేసిన వసుధాజోషి.

ఆమెతో మొదలై...

తొలితరం క్రికెటర్‌ ఫతేసింగ్‌రావ్‌ గైక్వాడ్‌ చెల్లెలు రాణీ సత్వశిలాదేవి 16 ఏళ్ల వయసులో మహారాష్ట్రలోని సావంత్‌వాడీ సంస్థానానికి కోడలిగా అడుగు పెట్టిన రోజులవి. ఆమెకు బొమ్మలు వేయడం అన్నా, ప్రకృతిని ఆరాధించడం అన్నా ఇష్టం. అప్పుడే గంజీఫా బొమ్మలున్న కార్డ్స్‌ని సంస్థానంలో ఆడటం చూశారామె. వాటి గురించి ఆరాతీసి... ఆ బొమ్మలు తయారుచేసిన చిత్రకారుడు 82 ఏళ్ల పాండురంగ చితారేని కలిశారు. ఆ కళ తెలిసిన ఆఖరి వ్యక్తి అతడేనని తెలిసి అది అంతరించిపోకూడదని సత్వశిలాదేవి అతన్ని సంస్థానంలోనే ఉంచి మరికొందరు యువతకు శిక్షణ ఇప్పించారు. ఆ తర్వాత ప్రత్యేకంగా దీనికోసం ఒక స్కూల్‌నే స్థాపించారు. ఇప్పటికీ ఆ స్కూల్‌ నడుస్తోంది. అలా మొదలైన రాజమాత ప్రయత్నాన్ని ఆమె కోడలు శుభదాదేవీ, ఆమె కోడలు శ్రద్ధ కొనసాగిస్తున్నారు. ‘ఎనిమిదిపదుల వయసులో ఇప్పటికీ రాజమాత తెల్లవారుజామున నాలుగ్గంటల నుంచీ స్వయంగా బొమ్మలు చేస్తారు. కళాకారులతో కళాఖండాలు తయారుచేయిస్తారు. ఆమెని చూశాక మాకూ ఆమె ప్రయత్నాన్ని గౌరవించాలనిపించింది. అందుకే కళాకారులకు అధిక జీతాలనిచ్చి ఈ కళని ఆధునిక తరాలకి పరిచయం చేస్తున్నాం’ అంటోంది శ్రద్ధ. ఈ రాణీల స్ఫూర్తితో  మైసూరు, ఒడిశా ప్రాంతాల్లోనూ ఈ కార్డ్స్‌, కళాఖండాలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. ఒడిశాలో అయితే సంబల్‌పూర్‌- గంజీఫా మేళవింపుతో తయారుచేస్తున్న చీరలు లేటెస్ట్‌ ట్రెండుగా మారాయి. మైసూరులో ఈ కార్డ్స్‌తో బోర్డ్‌ గేమ్స్‌ని తయారుచేసి పిల్లలకు పరిచయం చేస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్