ఆ నవ్వుకు గుర్తుగా ముస్కాన్‌!

అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు...అందరూ పొగుడుతుంటే ఆనందంతో హృదయం నిండిపోయేది.

Updated : 20 Feb 2024 04:47 IST

అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు...అందరూ పొగుడుతుంటే ఆనందంతో హృదయం నిండిపోయేది. ఆమె ఉన్నత శిఖరాలు అధిరోహిస్తే చూడాలని తపిస్తోన్న ఆ తల్లికి... తను ఇక లేదు అన్న కబురు అందితే? గుండె పగిలిపోదూ! లోకమంతా చీకటై పోదూ! మృదుల్‌ భాసిన్‌ పరిస్థితీ అంతే! ఆయితే ఆవిడ ఆ దుఃఖంలోనే మిగిలిపోలేదు. తనలాంటి పరిస్థితి మరెవరికీ రావొద్దని తపిస్తున్నారు.

1999... పిల్లలంతా హడావుడిగా స్కూలుకు పరుగులు తీస్తున్నారు. 17 ఏళ్ల ధ్రువ  మాత్రం ఆరోజు స్కూలు డుమ్మా కొట్టేసింది. అందుకు కారణమూ లేకపోలేదు. కథక్‌ నృత్యకారిణి తను. ఆరోజు రాత్రి ప్రోగ్రామ్‌ ఉంది. ‘రిహార్సల్స్‌కి వెళుతున్నా’నని అమ్మకో పెద్ద హగ్‌ ఇచ్చి బయటపడింది. మనసంతా భంగిమలు, ముఖకవళికల గురించే ఆలోచిస్తోంది. తను చేసే నృత్యమేదైనా అందులో ఓ మెసేజ్‌ ఉండాలి అనుకుందా అమ్మాయి. అందుకే దాని మీద అంత దృష్టి. అలా వెళుతున్న తనను ఒక స్కూల్‌ బస్సు వెనకగా వచ్చి ఢీకొట్టింది. ఏం జరుగుతోందో అర్థమయ్యేలోపే అంతెత్తున గాల్లో లేచిన శరీరం బలంగా రోడ్డును తాకింది. ‘అమ్మా’ అన్న మాట తప్ప మరేమీ నోట్లోంచి రాకుండా స్పృహ కోల్పోయింది.

ఆఫీసుకి టైం అవుతోందని ధ్రువ తల్లి మృదుల్‌ హడావుడి పడుతున్నారు. ఇంతలో ఫోన్‌ మోగింది. ఇంట్లోంచి బయటికొస్తూనే ఫోనెత్తారు. కూతురికి యాక్సిడెంట్‌ అని తెలియగానే చేతిలో సామానంతా అక్కడే పడేసి బయటకు పరుగుతీశారు. ఇంటికి కొద్దిదూరమే! రక్తపు మడుగులో పడివున్న కూతుర్ని చూసి, షాకయ్యారు. తీరా ఆసుపత్రికి తీసుకెళ్లాక ‘కొన్ని నిమిషాలు ముందు తీసుకొచ్చినా అమ్మాయి బతికుండే’దన్న సమాధానం వచ్చింది. ఆ మాట విన్నాక మృదుల్‌ దుఃఖాన్ని ఆపడం ఎవరివల్లా కాలేదు. ‘ధ్రువ సరైన మార్గంలోనే వెళుతోంది. బస్‌ డ్రైవర్‌ తాగి ఉన్నాడు. తాగుబోతనే గతంలో అతన్ని ఉద్యోగం లోంచి తీసేశారు. అయినా స్కూలు యాజమాన్యం నియమించుకుంది. ఢీకొట్టాక కనీసం వాహనం ఆపకుండా వెళ్లిపోయాడు. చుట్టూ ఉన్నవాళ్లూ అయ్యో అనుకుంటూ ఉండిపోయారే తప్ప అంబులెన్స్‌కి ఫోన్‌ చేయడానికి ప్రయత్నించలేదు’ అంటారు మృదుల్‌.

ప్రతిదీ వేదికే!

వీళ్లది జైపుర్‌. కూతురు చనిపోయిన బాధలో ఉద్యోగం మానేసి ఇంటికే పరిమితం అయ్యారామె. ఏ ప్రమాద వార్త విన్నా ఆమెకు కూతురే గుర్తొచ్చేది. తనలాంటి బాధ మరెవరికీ వద్దనుకున్న ఆమె 2001లో ‘ముస్కాన్‌’ పేరుతో ఎన్‌జీఓ ప్రారంభించారు. ‘ఇప్పటిలా గతంలో అంత అవగాహన లేదు. అత్యవసర సమయంలో 108కి ఫోన్‌ చేయాలన్న విషయమూ తెలియదంటే పరిస్థితేంటో అర్థమైంది. డ్రైవర్లు బండి నడిపే సమయంలో గమనించుకోవాల్సినవి, రోడ్డు భద్రత నియమాలు, అత్యవసర చికిత్సలతోపాటు డ్రైవర్లకు శిక్షణ ప్రారంభించాం. చాలావరకూ ఫుట్‌పాత్‌లు యాడ్‌ బోర్డులు, చిరు వ్యాపారుల దుకాణాలతో నిండిపోవడంతో పాదచారులు రోడ్డుమీద నడుస్తుంటారు. ఇదీ ప్రమాదాలకు కారణమే అని గుర్తించి, వారికీ అవగాహన కల్పిస్తాం. స్కూళ్లు, కళాశాలలు, టీచర్లు, పోలీసులు, ఉద్యోగులు... ప్రతిఒక్కరికీ వీటి గురించి వివరించడం మొదలుపెట్టాం. రోడ్డు, స్కూళ్లు, సోషల్‌ మీడియా ప్రతిదీ మాకు వేదికే. ఇందుకోసం దేశవ్యాప్తంగా సిబ్బందినీ నియమించుకున్నాం. ప్రమాదం జరిగాక ఫిర్యాదు చేయడానికీ భయపడేవారూ ఎక్కువే. యాక్సిడెంట్‌ చేసింది తామే అని పోలీసులు అనుకుంటారనో, ఆసుపత్రివాళ్లు బిల్లు కట్టమంటారేమో అని భయం. కానీ అలాంటిదేమీ అవసరం ఉండదు. దీనిపై పోలీసులు, ఆసుపత్రులతోపాటు సాధారణ జనాలకి అవగాహన కల్పిస్తున్నా’మంటారీమె.

ఇప్పటివరకూ 40వేలమందికి పైగా డ్రైవర్లకు శిక్షణనిచ్చారు. చదువు రానివారి కోసం తోలుబొమ్మలాటలు, వీధినాటకాలు వంటివీ వేస్తుంటారు. రాజస్థాన్‌లో ప్రారంభమైన వీరి సేవలు ప్రభుత్వ సంస్థలతో కలిసి దేశమంతా విస్తరించాయి. ఈ క్రమంలో అందుకున్న పురస్కారాలూ ఎన్నో. ‘ధ్రువ అనగానే తన చిరునవ్వే గుర్తొస్తుంది ఎవరికైనా. అందుకే మా సంస్థకి ‘ముస్కాన్‌’ అని పేరు పెట్టాం. మాలాగా ఎవరూ ఆత్మీయులను కోల్పోవద్దన్న చిన్న ప్రయత్నం ఎంతోమందిలో మార్పునకు కారణమవుతోంటే ఆనందమేస్తుంది. అందుకే మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నా’మంటారు మృదుల్‌.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్