నీటి ఊట... కోటి గెలిచింది!

వచ్చేది వేసవి కాలం. గుక్కెడు నీళ్ల కోసం ఎంత కష్టపడాలో తెలిసిందే! తన గ్రామంలో అలాంటి నీటి కష్టాలు ఉండకూడదనుకున్నారామె. దాంతో గ్రామస్థులకు నీటి పొదుపుపై అవగాహన తీసుకొచ్చి... గ్రామాన్ని సుభిక్షం చేశారు.

Published : 22 Feb 2024 01:09 IST

వచ్చేది వేసవి కాలం. గుక్కెడు నీళ్ల కోసం ఎంత కష్టపడాలో తెలిసిందే! తన గ్రామంలో అలాంటి నీటి కష్టాలు ఉండకూడదనుకున్నారామె. దాంతో గ్రామస్థులకు నీటి పొదుపుపై అవగాహన తీసుకొచ్చి... గ్రామాన్ని సుభిక్షం చేశారు. ఆ కృషికి తాజాగా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డుని అందుకున్నారు చిట్ల స్వరూపారాణి...

నీటి కటకటతో మైళ్లకొద్దీ దూరం వెళ్లి, ఆడవాళ్లు బిందెలు మోసుకొస్తూ కష్టపడటం చూశాక... తన గ్రామంలో పడ్డ ప్రతి వాన చినుకునీ ఒడిసిపట్టాలనుకున్నారు జనగామ జిల్లాలోని నెల్లుట్ల గ్రామానికి చెందిన చిట్ల స్వరూపారాణి. 2019లో ఈ ఊరి సర్పంచిగా ఎన్నికయ్యారామె. ఇటీవలే ఆమె పదవీకాలం ముగిసినా నీటి పొదుపు విషయంలో ఎన్నో మంచి మార్పులకు శ్రీకారం చుట్టారామె. నెల్లుట్ల... 1804 గడపలున్న గ్రామం. 6335 మంది జనాభాతో... 14 వార్డులున్న పెద్ద పంచాయతీలో... స్వరూప నీటి వృథాను తగ్గించడం, పునర్వినియోగం వంటి విషయాలని అక్కడున్న వారందరికీ అర్థమయ్యేలా వివరించారు. అయితే దీని కోసం ప్రత్యేకించి నిధులు వెచ్చించడం సాధ్యం కాదు కాబట్టి గ్రామీణ ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేశారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా సోక్‌పిట్స్‌, వృథానీటిని పీల్చుకునే లీచ్‌పిట్స్‌ ఏర్పాటు చేశారు.

కిచెన్‌గార్డెన్లతోపాటు రెండు చెక్‌డ్యాంలు, నాలుగు చిన్ననీటి కుంటలు తవ్వించారు. మురుగునీటి నిర్వహణ సమర్థంగా జరిగేలా 745 మ్యాజిక్‌ సోక్‌పిట్స్‌ని ఏర్పాటు చేశారు. దీంతో గ్రామంలోనే కాదు చుట్టుపక్కల కురిసిన ప్రతి నీటి చుక్కా భూమిలోకి ఇంకింది. రెండు ఏళ్లలో భూగర్భ జలమట్టం గణనీయంగా పెరిగింది. ఒకప్పుడు కరవు ప్రాంతంగా... వేసవిలో 20 మీటర్ల లోతులో మాత్రమే దొరికే నీళ్లు ఈ సంరక్షణ చర్యలతో 5మీటర్ల పైకి రావడంతో మహిళల కష్టాలు గట్టెక్కాయి. తర్వాతి తరాలకూ నీటి నిర్వహణపై అవగాహన రావాలని గోడలపై బొమ్మలు గీయించారామె. ‘జల్‌జీవన్‌ మిషన్‌’, నేషనల్‌ వాటర్‌ మిషన్‌ లాంటి పథకాల ద్వారా వచ్చే నిధులను సద్వినియోగం చేసుకొని గ్రామాన్ని జలరాశిగా మార్చారు స్వరూపారాణి. నీటి పొదుపుతోపాటు పచ్చదనానికీ ప్రాధాన్యం ఇచ్చారు. నాలుగేళ్ల్లలో 11 ఎకరాల్లో 65 వేల మొక్కలను నాటించారు. ఒకప్పుడు చెత్తాచెదారంతో నిండిన ఈ గ్రామం ఇప్పుడు దానిమ్మ, జామ తోటలతో కళకళలాడుతోంది. ఈ కృషికి ఫలితంగా ‘దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ్‌ పంచాయత్‌ సతత్‌ వికాస్‌’ పురస్కారం కింద.. నెల్లుట్ల గ్రామం నీటి సమృద్ధి విభాగంలో జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి రూ. కోటి రివార్డుని గెలిచింది. రాష్ట్రపతి ఇచ్చిన తేనీటి విందుకు హాజరై స్వరూపా దంపతులు ఈ అవార్డుని అందుకున్నారు.

కర్రె వీరయ్య, న్యూస్‌టుడే,

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్