దీదీలు కోట్లు సృష్టించారు!

ప్రభుత్వ ఆసుపత్రులు, బ్యాంకులు, స్కూళ్లు, ఇన్‌స్టిట్యూట్‌లు...  ఇలా బిహార్‌లో ఎక్కడికెళ్లినా భోజనం సమయానికి వేడివేడిగా పొగలు కక్కుతున్న కమ్మని ఇంటివంట సిద్ధంగా ఉంటుంది.

Published : 22 Feb 2024 05:03 IST

ప్రభుత్వ ఆసుపత్రులు, బ్యాంకులు, స్కూళ్లు, ఇన్‌స్టిట్యూట్‌లు...  ఇలా బిహార్‌లో ఎక్కడికెళ్లినా భోజనం సమయానికి వేడివేడిగా పొగలు కక్కుతున్న కమ్మని ఇంటివంట సిద్ధంగా ఉంటుంది. ‘దీదీ కీ రసోయీ’ చేసిన అద్భుతం ఇది...  అదొక్కటే కాదు, హౌస్‌ కీపింగ్‌, నర్సరీలు, గాజుల తయారీ ఇలా ఏ రంగంలో చూసినా  ‘దీదీ’లు విప్లవం తీసుకొస్తూ కోట్ల రూపాయల సంపదని సృష్టిస్తున్నారు. ఇదంతా ‘జీవిక’ చలువే!

బిమాస్‌... (బిహార్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ అలైడ్‌ సైన్సెస్‌) రోగులు, వైద్యులతో నిత్యం రద్దీగా ఉంటుంది. అక్కడే మరోపక్కకు వెళ్తే వంటల ఘుమఘుమలు. ఆ ఆసుపత్రి పరిసరాల్లోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న కిచెన్‌లో వేలమందికి ఒంటి చేత్తో వంటలు వండేస్తున్నారు దీదీ కీ రసోయి సభ్యులు. ముప్పైమంది మహిళలు... వండేవారు వండుతుంటే, వడ్డించేవారు వడ్డిస్తున్నారు. డ్యూటీ టైం అయిపోగానే వాళ్లు వెళ్లిపోతారు. మరొక బృందం డ్యూటీ ఎక్కుతుంది. మొత్తం మీద వీళ్ల పనితీరు ఆసుపత్రికి మంచి పేరు తీసుకొచ్చింది. దాంతో బిహార్‌లోని 38 జిల్లాలకూ ఈ సేవలు విస్తరించాయి. 1700 మంది మహిళలు ఉపాధి బాట పట్టారు. 117 మంది మహిళలు వ్యాపారవేత్తలుగా మారి రూ.57 కోట్ల వ్యాపారం చేస్తున్నారు. అలాగని ఈ మహిళలంతా పెద్ద చదువులు చదువుకున్న వాళ్లు అనుకుంటే పొరపాటు. తమ పిల్లల్ని చదివించుకోవడానికీ, కడుపునిండా తినడానికీ కూడా ఇబ్బంది పడినవాళ్లు. అలాంటి వాళ్లని వ్యాపారవేత్తలని చేసిన గొప్పతనం ‘జీవిక’దే. బిహార్‌లోని ప్రభుత్వ పేదరిక నిర్మూలనా సంస్థ పేరే జీవిక. ఇది ప్రపంచబ్యాంకుతో కలిసి వేసిన అడుగే ఇప్పుడిలా లక్షలమంది మహిళల జీవితాల్లో వెలుగులని తీసుకొచ్చింది. 2006లో గయ, నలందలతోపాటు మరో రెండు గ్రామాల్లో పైలట్‌ ప్రాజెక్ట్‌గా మొదలైన జీవిక ఉద్యమం ఇప్పుడు పదిలక్షల స్వయం సహాయక బృందాలకు చేరువైంది. ప్రపంచ బ్యాంకు వీరికి ఆర్థికంగా అండగా ఉంటోంది.

అన్నింటా తామై...

ఆసుపత్రుల్లో దీదీ కీ రసోయి సేవలు విజయవంతం కావడంతో... బ్యాంకులూ, స్కూళ్లూ, ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్‌లకూ విస్తరించారు. ‘ప్రభుత్వ ఆసుపత్రులకు మంచి డాక్టర్ల అవసరం ఎంత ఉందో... ఇతర సేవల అవసరమూ అంతే ఉంది. క్యాంటీన్‌లో రోగులకీ, వైద్యులకీ కమ్మని భోజనం కావాలి. బెడ్స్‌పైన శుభ్రమైన దుప్పట్లు మెరవాలి. యాప్రాన్‌లు, కిటికీ తెరలు... తెల్లగా మెరిసిపోవాలి. ఈ అవసరాలని ఉపాధి మార్గాలుగా ఎందుకు మలచకూడదు అనుకున్నారు ‘జీవిక’ సీఈవోగా పనిచేస్తున్న రాహుల్‌కుమార్‌. అలా దీదీ లాండ్రీలు, నర్సరీలు కూడా మొదలయ్యాయి. అలాగే మరికొన్ని స్వయం సహాయక బృందాల మహిళలు ఇంటి పట్టునే ఉండి మొక్కలు పెంచుతూ నర్సరీ నిర్వాహకులుగా, పట్టుపురుగుల పెంపకంలో రాణిస్తూ వ్యాపారవేత్తలుగా మారి తమ జీవితాలని మార్చుకుంటున్నారు.   

గాజుల తయారీతో...

గతంలో బిహార్‌ ప్రభుత్వం సీజ్‌ చేసిన మద్యం బాటిళ్లను పగలకొట్టి ఆ వృథాని పారబోసేది. ఇప్పుడా రద్దుని దీదీలకు ఇచ్చి వాటితో రోజుకి 80,000 గాజులని తయారుచేయిస్తోంది జీవిక. అలా పట్నా ఇప్పుడు బ్యాంగిల్‌ క్యాపిటల్‌గా మారింది. ప్రతి ఏడాది రిపబ్లిక్‌ డే రోజు... దిల్లీలో జరిగే పరేడ్‌లో గత కొన్నేళ్లుగా ‘జీవిక’ శకటాన్నే తమ అభివృద్ధికి సూచికగా చూపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్