కథ చెబుతాం... ఊ కొడతారా?

‘చీకటి పడేలోపు ఇంటికి వెళ్లాలని వడివడిగా అడవిలో నడుస్తూ... దారి తప్పి ఆ అబ్బాయి అడవిలో చిక్కుకుపోయాడం’టూ... సీతా శ్రీనివాస్‌ కథ చెబుతుంటే పిల్లలందరిలో ఉత్కంఠ. ఆ తర్వాత ఏమైందనే కంగారు. అలా చిన్నారులకు తన కథల ద్వారా జీవిత విలువలెెన్నో నేర్పుతున్నారీమె. అలాగే శ్రీ కరుణ వినిపించే కథలకు పిల్లల నుంచి పెద్దవాళ్లవరకూ అంతా మైమరచి పోవాల్సిందే.

Updated : 23 Feb 2024 05:09 IST

‘చీకటి పడేలోపు ఇంటికి వెళ్లాలని వడివడిగా అడవిలో నడుస్తూ... దారి తప్పి ఆ అబ్బాయి అడవిలో చిక్కుకుపోయాడం’టూ... సీతా శ్రీనివాస్‌ కథ చెబుతుంటే పిల్లలందరిలో ఉత్కంఠ. ఆ తర్వాత ఏమైందనే కంగారు. అలా చిన్నారులకు తన కథల ద్వారా జీవిత విలువలెెన్నో నేర్పుతున్నారీమె. అలాగే శ్రీ కరుణ వినిపించే కథలకు పిల్లల నుంచి పెద్దవాళ్లవరకూ అంతా మైమరచి పోవాల్సిందే. వేలమంది పిల్లలను కథ వైపు నడిపిస్తున్న ఈ స్టోరీ టెల్లర్స్‌ను వసుంధర పలకరించింది.

20 ఏళ్లుగా పిల్లలకు కథలు చెబుతున్నా. కథవల్ల ఒరిగేదేంటి అంటారు చాలామంది. చిన్నారులను భవిష్యత్తులో ఉన్నత వ్యక్తిత్వం ఉన్న వారిగా తీర్చిదిద్దగలిగే శక్తి కథకు మాత్రమే ఉంది. కెరీర్‌, లక్ష్యం అంటూ.. పిల్లలను పరుగు పెట్టిస్తుంటే.. అది వారిని కథకు దూరం చేస్తోంది. చిన్నప్పుడు అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు నాకు కథను పరిచయం చేసి, దానిపై ప్రేమను పెంచారు. మాది వైజాగ్‌. కథలు వింటూ.. పుస్తకాలు చదువుతూనే పెరిగా.

అలా మొదలైంది...

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సోషల్‌వర్క్‌లో మాస్టర్స్‌ చేసి, దలైలామా చేతుల మీదుగా గోల్డ్‌ మెడల్‌నూ అందుకొన్నా. ఆ తర్వాత పెళ్లై, మావారి ఉద్యోగరీత్యా కొన్నేళ్లు సింగపూర్‌లో ఉన్నాం. చైల్డ్‌ కౌన్సెలింగ్‌ కోర్సు చేసి, అక్కడి పాఠశాలల్లో బిహేవియర్‌ ప్రాబ్లమ్‌ ఉండే పిల్లలకు కౌన్సెలింగ్‌ ఇచ్చేదాన్ని. అప్పుడో విద్యార్థి వచ్చాడు. ప్రతిదానికీ ఏదో ఒకటి చెప్పేవాడు. ఎదురు నేను కథ చెబితే సైలెంట్‌ అయ్యేవాడు. వాడి ప్రవర్తనలో మంచి మార్పూ వచ్చింది. అలా వాడివల్ల కథ చెప్పడంలో నాకున్న నైపుణ్యాన్ని గుర్తించగలిగా. దాన్నే కెరియర్‌గా తీసుకొని సింగపూర్‌ నేషనల్‌ లైబ్రరీ బోర్డుకు వలంటీర్‌గా ఆరేళ్లపాటు పిల్లలకు కథలు చెప్పా.

వందలకొద్దీ...

2011లో వైజాగ్‌ తిరిగొచ్చా. 1-5 తరగతులవారికి ఒక స్కూల్‌లో ఫుల్‌టైం స్టోరీ టెల్లర్‌గా అవకాశం వచ్చింది. పౌరాణికం, చరిత్ర, ప్రపంచదేశాల సంప్రదాయాలు, సామాజిక, భౌగోళిక అంశాలు సహా స్ఫూర్తి, సాహసం, నీతి వంటి ప్రతి అంశం ఉండేలా ఆయా వయసును బట్టి కథలనెంచుకుంటా. టీనేజ్‌ పిల్లలకూ వారెదుర్కొనే సమస్యలకు పరిష్కారం చూపించేలా కథలు చెబుతా. ఇప్పటివరకు వేల కథలు వినిపించా. పాత్రకు తగ్గట్లు నేను గొంతు మార్చి చెబుతుంటే చిన్నారులు వినడంలో లీనమైపోతారు. బొమ్మలతోనూ కథ చెప్పిస్తా. వారాంతాల్లో వలంటీర్‌గా వైజాగ్‌ పబ్లిక్‌ లైబ్రరీలోనూ ఎన్జీవోలు, బ్లైండ్‌ స్కూల్‌ విద్యార్థులకూ కథలు వినిపిస్తున్నా. కొవిడ్‌లో ఆన్‌లైన్‌లో పిల్లలకు కథలెన్నో చెప్పాను. పలు డాక్యుమెంటరీలకు వాయిస్‌ఓవర్‌ ఇస్తున్నా. పాడ్‌కాస్ట్‌లోనూ చెబుతున్నా. కథతో పిల్లల్లో జీవన నైపుణ్యాలు పెంపొందుతాయి. తమలోని భావోద్వేగాలను వ్యక్తపరచగలరు. తల్లిదండ్రులు కనీసం వారానికి రెండు రోజులైనా పిల్లలతో కథలు, బొమ్మల పుస్తకాలను తీయించి సమయం వెచ్చించాలి. లైబ్రరీని పరిచయం చేయాలి. ఇవన్నీ పేరెంట్స్‌, పిల్లల మధ్య అనుబంధాన్నీ... పెంచుతాయి. పైచదువులకెళ్లిన విద్యార్థులు ఎప్పుడైనా ఎదురైనప్పుడు ‘ఇట్స్‌ స్టోరీ టైం మేడం’ అని గుర్తు చేస్తూ దగ్గరకొచ్చి హగ్‌ చేసుకోవడం మాటల్లో చెప్పలేని తృప్తినిస్తుంది.

నాన్న ఉద్యోగరీత్యా వేరే రాష్ట్రానికి వెళితే, భీమవరంలో అమ్మమ్మ దగ్గర పెరిగా. మా అమ్మమ్మ, నానమ్మ, ముత్తమామ్మ అందరూ కథలు చెప్పేవాళ్లే. నానమ్మ ఇల్లైతే చిన్న లైబ్రరీ. నాలుగో తరగతికి వచ్చేసరికి ఆంగ్లం, తెలుగు కథల పుస్తకాలన్నీ చదివేసేదాన్ని. ఆ తర్వాత నాన్నతోపాటు బెంగళూరు వెళ్లా. తనెక్కువగా స్టోరీ బుక్స్‌ కొనిచ్చేవారు, లైబ్రరీకి తీసుకెళ్లేవారు. ఆ తర్వాత ఆయన ఉద్యోగరీత్యా ఎన్ని రాష్ట్రాలకెళ్లినా కథకు మాత్రం నేను దూరం కాలేదు. కంప్యూటర్‌సైన్స్‌ చదివా. పెళ్లైంది. మావారు రైల్వే ఉద్యోగి కావడంతో చాలా ప్రాంతాలు తిరిగి 1999లో వైజాగ్‌ చేరుకున్నాం. అక్కడే ఎంబీఏ చేసి పలు రంగాల్లో అడుగుపెట్టా. పిల్లల కోసం ఏదైనా చేయాలనిపించి, 2017 నుంచి ప్రభుత్వ పాఠశాల చిన్నారులకు ఉచితంగా ఆంగ్లం నేర్పడం మొదలుపెట్టా. ఓసారి జూనియర్‌ లిటరరీ ఫెస్టివల్‌కు హాజరయ్యే అవకాశమొచ్చింది. ఎన్నో ప్రాంతాల నుంచి స్టోరీ టెల్లర్స్‌ రావడం ఆశ్చర్యమేసింది.

చందమామ కథ

చిన్నప్పటి నుంచి కథతో ప్రయాణించిన నాకు, కథలు చెప్పడమనే ఒక కెరియర్‌ కూడా ఉందని ఆ ఫెస్టివల్స్‌కు వెళ్లేవరకూ తెలీదు. దాంతో స్టోరీ టెల్లింగ్‌పై ఆసక్తితో  కోర్సు చేశా. జాతీయ, అంతర్జాతీయ స్థాయి స్టోరీ టెల్లర్స్‌ను కలుసుకొని కథ చెప్పడంలో నైపుణ్యాలనూ పెంచుకున్నా. కొవిడ్‌ సమయంలో ఆన్‌లైన్‌లో కథ చెప్పాలనిపించింది. అలా ‘అమరావతి’ నా మొదటి కథ. ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లో నా కథకు ప్రశంసలు అందాయి. దాంతో దీన్నే కెరియర్‌గా మార్చుకోవాలనిపించింది. చిన్నప్పటి నుంచి వెన్నెలంటే చాలా ఇష్టం. దాంతో ‘చందమామ కథ’ పేరుతో వెంచర్‌ ప్రారంభించా. ఆ తర్వాత నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ఎన్జీవోలు, పబ్లిక్‌ లైబ్రరీలు.. ఇలా పిల్లలెక్కడ ఉంటే అక్కడ నా కథ వినిపించాల్సిందే. అలాగే ‘ఇన్‌ ద మూన్‌లైట్‌ ఆఫ్‌ స్టోరీస్‌’ పేరుతో స్టోరీ టెల్లర్స్‌ అందరం ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో కథలు చెబుతున్నాం. దీనిపై వర్క్‌షాపులూ నిర్వహిస్తున్నా. కథలు పిల్లల్లో భావోద్వేగాలు నింపుతాయి. వారికి సాంత్వన కలిగిస్తాయి. జీవిత  విలువలను నేర్పుతాయి.

హారర్‌ కథలు అడుగుతారు...

తల్లిదండ్రులు బిజీ కావడంతో పిల్లలు కథలకు దూరమవుతున్నారు. ఇరువురి మధ్యా సాన్నిహిత్యం కూడా పలచబడుతోంది. పిల్లలకు కథలు చెబుతూ.. వాటిద్వారా ఎన్నో విషయాలను నేర్పొచ్చు. చాలామంది చిన్నారులిప్పుడు హారర్‌ కథలు కావాలని అడుగుతుంటే బాధగా అనిపిస్తుంది. ప్రశాంతమైన మనసుతో ఉండాల్సిన వయసులో భయానక చిత్రాలు చూస్తూ వారి తీరు మారుతోంది. పిల్లల్లో సృజనాత్మకతను కాపాడాలంటే అది కథవల్లే అవుతుంది. నేనెప్పుడైనా స్కూల్‌కెళ్లకపోతే ‘ఎందుకు టీచర్‌ రాలేదు?’ అని పిల్లలు అడిగినప్పుడు సంతోషంగా ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్