డ్రైవర్‌ బామ్మ!

వాహనాలు నడిపే మహిళలు ఇప్పుడు కొత్తేమీ కాదు... కానీ 71 ఏళ్ల ఈ బామ్మ మాత్రం ప్రత్యేకం. బండి, బస్సు, లారీ ఇలా దేన్నైనా చకాచకా నడిపేయగలరు. అంతేనా 11 లైసెన్సులు సంపాదించి, గుర్తింపునూ తెచ్చుకున్నారు.

Published : 24 Feb 2024 02:11 IST

వాహనాలు నడిపే మహిళలు ఇప్పుడు కొత్తేమీ కాదు... కానీ 71 ఏళ్ల ఈ బామ్మ మాత్రం ప్రత్యేకం. బండి, బస్సు, లారీ ఇలా దేన్నైనా చకాచకా నడిపేయగలరు. అంతేనా 11 లైసెన్సులు సంపాదించి, గుర్తింపునూ తెచ్చుకున్నారు. మణి అమ్మగా పేరొందిన రాధామణి బామ్మ గురించే ఇదంతా...

రాధామణిది కేరళలోని తోప్పుంపాడి గ్రామం. టూవీలర్ల నుంచి బస్సు, లారీ, జేసీబీ, ట్రాక్టర్‌, రోడ్‌ రోలర్‌... ఇలా ఎన్నింటినో చాకచక్యంగా నడిపేయగలరీమె. ఇది ఇప్పటికిప్పుడు వచ్చిన ఆసక్తి కాదు. నలభై ఏళ్ల క్రితం... ఆడవాళ్లు సైకిల్‌ తొక్కడమే వింతగా భావించే సమయంలోనే ఈ ఆసక్తిపై దృష్టిపెట్టిందీ బామ్మ. ‘ఇందుకు కారణం మావారు టీవీలాల్‌. ఆయన వృత్తిరీత్యా డ్రైవర్‌. పదో తరగతి పూర్తికాగానే పెళ్లి, ఇద్దరు పిల్లలు. చిన్న వయసే కదా... ఏదైనా నేర్చుకోవాలని ఉండేది. అప్పుడు మావారు డ్రైవింగ్‌ వైపు ప్రోత్సహించారు. చీర కట్టులోనే సైకిల్‌, టూవీలర్‌ నడిపేదాన్ని. తర్వాత కారు ఇలా ఒక్కోటీ నేర్చుకున్నా. అప్పట్లో నేను వాహనాలు నడుపుతోంటే అంతా ఆశ్చర్యంగా చూసేవారు. నేను మాత్రం వాటిని పట్టించుకునేదాన్ని కాదు. ఒకదాని తర్వాత ఒకటి ఆసక్తి పెరగడంతో భారీవాహనాలు నడపడాన్నీ నేర్చుకున్నా. నడపడమైతే నడపగలను కానీ, లైసెన్సు తీసుకోలేదు. ఇంతలో మావారు కొచ్చిలో ‘ఏ టు జెడ్‌’ డ్రైవింగ్‌ స్కూల్‌ ప్రారంభించారు. నన్ను చూసి చాలామంది మహిళలు చేరడం కొత్త అనుభూతి’ అంటారీ బామ్మ.

అయితే జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదుగా! 2004లో టీవీలాల్‌ మరణంతో కుటుంబ భాధ్యత రాధామణి మీద పడింది. అప్పుడు డ్రైవింగ్‌నే కుటుంబ పోషణకు ఆధారంగా మార్చుకున్నారీమె. డ్రైవింగ్‌ స్కూలు భాధ్యతలనీ తీసుకున్నారు. కానీ విద్యార్థులకి నేర్పాలంటే లైసెన్సు ఉండాలి కదా! అప్పుడు పరీక్షకు హాజరయ్యారు. ఒకదాని తరువాత ఒకటి ఏకంగా 11 రకాల డ్రైవింగ్‌ లైసెన్సులు పొందారు. అంతేకాదు హెవీవెహికల్‌ నడిపేందుకు అర్హత పొందిన తొలి మహిళగా తన రాష్ట్రంలో గుర్తింపు పొందారు. తమ కాళ్లపై తాము నిలబడతారని పేద పిల్లలకి ఉచితంగా శిక్షణ ఇస్తుంటారు కూడా. ఆమె పట్టుదల, మంచి మనసు తెలిసిన వారంతా రాధామణిని ప్రేమగా ‘మణి అమ్మ’ అని పిలుచుకుంటారు. ‘డ్రైవింగ్‌ బ్రహ్మ విద్యేమీ కాదు... అమ్మాయిలూ చక్కగా నేర్చుకోవచ్చు. పైగా ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది’ అంటూ హితవునీ పలుకుతున్నారీ బామ్మ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్