బస్సు బడి!

‘రైలు బడి’ పుస్తకం చదివారా? ప్రముఖ జపాన్‌ రచయిత్రి టెట్సుకోకురియనాగి రాసిన ఈ పుస్తకం... పాత రైలుపెట్టె బడిగా మారిన వైనం, ఆ బడిని ఇష్టపడే చిన్నారుల చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడీ సంగతి ఎందుకంటారా? అక్కడ రైలు బడి ఉన్నట్టే ఇక్కడ ‘ఎల్లో బస్సు’ల్లోనూ అచ్చంగా అలాంటి ఆసక్తికరమైన బోధనే జరుగుతుంది కాబట్టి. ఎక్కడ... ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారా? బస్సులోనో, కారులోనో ప్రయాణించేటప్పుడు సిగ్నల్స్‌ దగ్గర పిల్లలు ఎవరైనా అడుక్కుంటూ కనిపిస్తే ఏమంటాం?

Published : 26 Feb 2024 02:21 IST

‘రైలు బడి’ పుస్తకం చదివారా? ప్రముఖ జపాన్‌ రచయిత్రి టెట్సుకోకురియనాగి రాసిన ఈ పుస్తకం... పాత రైలుపెట్టె బడిగా మారిన వైనం, ఆ బడిని ఇష్టపడే చిన్నారుల చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడీ సంగతి ఎందుకంటారా? అక్కడ రైలు బడి ఉన్నట్టే ఇక్కడ ‘ఎల్లో బస్సు’ల్లోనూ అచ్చంగా అలాంటి ఆసక్తికరమైన బోధనే జరుగుతుంది కాబట్టి. ఎక్కడ... ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారా? బస్సులోనో, కారులోనో ప్రయాణించేటప్పుడు సిగ్నల్స్‌ దగ్గర పిల్లలు ఎవరైనా అడుక్కుంటూ కనిపిస్తే ఏమంటాం? ‘ఈ వయసులో చక్కగా చదువుకోవచ్చుగా.. అలా డబ్బులు అడక్కూడదు’ అని మందలిస్తాం కదా! అలా మనం అన్నంత మాత్రాన వాళ్లు వెళ్లి చదువుకుంటారా? కష్టమే! కానీ ఆ బాధ్యతని స్వయంగా తీసుకుని మురికివాడల పిల్లలని చదువులబాట పట్టిస్తున్నాయి అహ్మదాబాద్‌లోని ‘సిగ్నల్‌ స్కూల్స్‌’. స్థానిక మున్సిపల్‌ కార్పొరేషన్‌, గుజరాత్‌ స్టేట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీలు కలిసి 2022లో ఆ ఆలోచనకి శ్రీకారం చుట్టాయి. ఈ బస్సులు... మురికివాడల్లో చదువుకోకుండా తిరిగే పేదపిల్లల్నీ, చిన్నవయసులో చదువుమానేసిన వాళ్లని గుర్తించి చదువు బోధిస్తాయి.

ఉదయం ఈ బస్సుల్లోనే విద్యా, బుద్ధులు నేర్పి... తిరిగి వాళ్లని ఇళ్ల దగ్గర అప్పగిస్తాయి. ఈ బస్సుల్లో ఎల్‌సీడీ టీవీలు, వైఫై కనెక్షన్‌, ఎడ్యుకేషనల్‌ టాయ్స్‌ వంటి ఆధునిక సదుపాయాలూ అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ చదువుమీద ఆసక్తిని పెంచేలా ఉంటాయి. ఆరు నుంచి పద్నాలుగేళ్ల పిల్లలకు... పదినెలలపాటు విద్యా బోధన చేస్తారు. తర్వాత దగ్గర్లోని ప్రభుత్వ స్కూళ్లలో చేరుస్తారు. బ్యాచ్‌లో టాపర్‌గా నిలిచిన పిల్లలను కేంబ్రిడ్జ్‌ స్కూల్లో చేరుస్తారు. ‘ఈ పిల్లలకు చదువుచెప్పే క్రమంలో మొదటి ఆటంకం వాళ్ల తల్లిదండ్రుల నుంచే ఎదురవుతుంది. దాంతో వాళ్లకీ కౌన్సెలింగ్‌ చేయాల్సి ఉంటుంది’ అంటున్నారు ఈ బోధనా బాధ్యతలు చూస్తున్న అహ్మదాబాద్‌ మున్సిపల్‌ స్కూల్‌ బోర్డ్‌ అధికారిణి డా. లాగ్దిన్‌ దేశాయ్‌. ఇప్పటివరకూ 3 బ్యాచులు నిర్వహిస్తే 413 మంది పిల్లలను చదువుల బాట పట్టించారు. ఈ సిగ్నల్‌ స్కూళ్ల కోసం ప్రభుత్వం రూ. 3 కోట్ల రూపాయల్ని వెచ్చించింది. త్వరలో మరికొన్ని నగరాల్లోనూ ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని గుజరాత్‌ ప్రభుత్వం యోచిస్తోందట.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్