నష్టాలు దాటడానికి నాలుగేళ్లు పట్టింది!

తండ్రికి సాగు అంటే ప్రాణం... పెరుగుతోన్న రసాయన ఎరువుల వాడకం... ఆయన్ని కలవరపెట్టింది.  దాంతో ముప్పై ఐదేళ్లుగా సేంద్రియ పద్ధతులతో భూసారాన్ని పెంచడానికి ప్రయోగాలెన్నో చేశారు. ఆ ప్రయత్నాల్ని శాస్త్రీయంగా నిరూపించి, మరెంతో మంది రైతులకు అండగా నిలవాలనుకుంది కూతురు.

Updated : 28 Feb 2024 05:23 IST

తండ్రికి సాగు అంటే ప్రాణం... పెరుగుతోన్న రసాయన ఎరువుల వాడకం... ఆయన్ని కలవరపెట్టింది.  దాంతో ముప్పై ఐదేళ్లుగా సేంద్రియ పద్ధతులతో భూసారాన్ని పెంచడానికి ప్రయోగాలెన్నో చేశారు. ఆ ప్రయత్నాల్ని శాస్త్రీయంగా నిరూపించి, మరెంతో మంది రైతులకు అండగా నిలవాలనుకుంది కూతురు. అందుకోసం చేస్తున్న ఉద్యోగం మానేసి ఆయనతో కలిసి ‘శాన్‌రా ఆర్గానిక్స్‌’ పేరుతో జీవ ఎరువుల తయారు చేస్తోంది  సంస్థ సీఈవో సంధ్య కొడాలి.

మార్పుని అందరం కోరుకుంటాం. కానీ, అది మొదట మన దగ్గరే మొదలవ్వాలని మాత్రం ఆలోచించం. కానీ, నాన్న బోసుబాబు అలాకాదు. మాటలు మాత్రమే చెప్పలేదు. దాన్ని ఆచరణలో పెట్టారు. మాది ఇంకొల్లు. నాన్న ఇరవై ఏళ్లపాటు వివిధ ఎరువుల కంపెనీల్లో పనిచేశారు. వ్యవసాయాధారిత కుటుంబం కావడంతో సాగుపై ఆసక్తీ ఎక్కువ. పెరిగిన రసాయనిక ఎరువుల వాడకం, ఖర్చులు-నష్టాలు, అన్నింటికీ మించి హానికరమైన కెమికల్స్‌తో పండించిన ఆ ఆహారాన్ని తినడం వల్ల వచ్చే వ్యాధుల ముప్పు వంటివన్నీ ఆయన్ని ఆలోచింపజేశాయి. అది మొదలు భూసారాన్ని పెంచే ప్రయోగాలెన్నో చేశారు. సేంద్రియ ఉత్పత్తులను తయారుచేసి రైతులకు అందించడం మొదలుపెట్టారు. అయితే, అవి మరింత మందికి చేరాలంటే... శాస్త్రీయంగా నిరూపించాలి కదా! నేనూ అదే ఆలోచించా. అప్పటికే శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో ఎంఎస్సీ కెమిస్ట్రీ పూర్తిచేసి ఓ మల్టీనేషనల్‌ కంపెనీలో చేరా. అక్కడ సర్ఫేక్టన్స్‌పై పరిశోధనలు చేశా. జీవ ఎరువుల తయారీపై దృష్టిపెట్టాలన్న ఆలోచన రాగానే ఉద్యోగం వదిలి వచ్చేశా.

వంద శాతం పర్యావరణహితంగా...

అలా 2011లో శాన్‌రా ఆర్గానిక్స్‌ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాం. 100 శాతం పర్యావరణహిత, సేంద్రియ ఎరువుల్ని తయారు చేయాలన్నదే ఆలోచన. మొదట ఎడిబుల్‌ ఆయిల్‌ కేక్స్‌, వెజిçబుల్‌ ప్రొటీన్‌, సీవీడ్‌ ఎక్స్‌ట్రాక్ట్‌తో ద్రవ, పొడిరూప ఎరువుల్ని తయారు చేశాం. వీటిని గాల్లో చల్లడం వల్ల ఎక్కువ మోతాదులో వాడాల్సి రావడం, ట్రాన్స్‌పోర్ట్‌ కష్టం కావడం వంటి ఇబ్బందులు తలెత్తడంతో ప్రత్యామ్నాయం ఆలోచించా. దేశంలోనే మొదటిసారి గుళికల రూపంలో ఎరువుల్ని తీసుకొచ్చాం. ఇవి మంచి ఫలితాల్నివ్వడంతో... పేటెంట్‌కి దరఖాస్తు చేసుకున్నాం. రైతుల్లో మంచి ఆదరణ లభించడంతో... ఓ బహుళజాతి కంపెనీ మాతో కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చింది. మార్కెట్లో వచ్చిన మంచి స్పందనతో ఆర్డర్లూ పెరిగాయి. అప్పటి మార్కెటింగ్‌ అవసరాలకు అనుగుణంగా పెద్ద ఎత్తున రుణాలు తెచ్చి పెట్టుబడి పెట్టి ఫ్యాక్టరీని విస్తరించాం.

అందుకే సొంత బ్రాండ్‌...

మా ప్రయాణం బాగా సాగిపోతుందనుకున్న తరుణంలోనే... ఆ సంస్థ మా ఉత్పత్తుల ధరలు తగ్గించమని కోరింది. ఇది నాణ్యతను దెబ్బతీసే విధానం కావడంతో పాటు మా లక్ష్యం నెరవేరదని భావించి మేం అందుకు ఒప్పుకోలేదు. దాంతో వారు ఒప్పందం నుంచి వెనక్కి వెళ్లడంతో కాస్త తడబడ్డాం. కానీ, నిరాశపడలేదు. మా ఉత్పత్తులకు బ్రాండ్‌ క్రియేట్‌చేసి మార్కెట్లోకి వెళ్లాం. అయితే, ఈ సారి డీలర్స్‌ రూపంలో ఇబ్బంది ఎదురైంది. ఎరువుల వ్యాపారం అంతా క్రెడిట్‌ బేస్డ్‌ మార్కెట్‌ అని తెలుసు కానీ, అసలు కొందరు డబ్బులు తిరిగివ్వరని మాత్రం అనుకోలేదు. పురుషాధిపత్య రంగం కావడంతో తీసుకున్న అరువు డబ్బుల్ని వసూలు చేయడం మహిళగా నాకు కాస్త కష్టమైంది. ఈ నష్టాల నుంచి బయటపడటానికి నాలుగైదేళ్లు పట్టింది. ప్రస్తుతం రైతులకు నేరుగా అందించడంతో పాటు బీ2బీ మార్కెట్‌నీ విస్తరించుకున్నాం. వాటిని ఆయా సంస్థలు తమ బ్రాండ్‌ పేరు మీద అమ్ముకుంటాయి. ఎన్ని సవాళ్లెదురైనా రైతులు... ఈ ఉత్పత్తులతో తాము నష్టాలనుంచి గట్టెక్కామని చెబుతుంటే భలే సంతోషంగా ఉంటోంది. ప్రస్తుతం మా దగ్గర ఇరవైమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మిద్దెతోటలూ, బాల్కనీ గార్డెనింగ్‌లపై మాకున్న ప్రత్యేక ఆసక్తితో... వారికోసం మాత్రం రిటైల్‌ పద్ధతిలో అమ్మాలనుకున్నాం. ఇందుకోసం ‘మై ఉద్యాన్‌’ పేరుతో మరో సంస్థనూ ఏర్పాటు చేశాం. మా ఉత్పత్తులను వాట్సప్‌, నా పంట యాప్‌తో పాటు పలు చోట్ల రిటైల్‌ చైన్ల ద్వారా విక్రయిస్తున్నాం. ఇప్పుడిప్పుడే ఇబ్బందులను దాటి లాభాల బాట పట్టాం. భయపడే కొద్దీ పరిస్థితులు మనల్ని మరింత భయపెడతాయి. ఏ సవాల్‌నైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడే... కొత్త అవకాశాలు మన వెంట పడతాయి. ఈ విషయాన్ని అనుభవంలో అర్థం చేసుకుని ముందుకు వెళ్తున్నా. ప్రస్తుతం పదినెలల పాపను చూసుకుంటూ నా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా.


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు,  సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్