ఒకే జీవితం... జీవించాలిగా మరి!

పెళ్లయ్యాక భర్త ఇష్టాలే నీ ఇష్టాలుగా మలుచుకోవాలి... అమ్మయ్యాక త్యాగాలు చేయక తప్పదు... ఎవరు చూడూ అజీషాకి ఇలాంటి సలహాలే ఇచ్చేవారు.

Updated : 29 Feb 2024 13:30 IST

పెళ్లయ్యాక భర్త ఇష్టాలే నీ ఇష్టాలుగా మలుచుకోవాలి... అమ్మయ్యాక త్యాగాలు చేయక తప్పదు... ఎవరు చూడూ అజీషాకి ఇలాంటి సలహాలే ఇచ్చేవారు. ఉన్నది ఒక్కటే జీవితం... ఇతరుల కోసం బతుకుతూ పోతే నా కోసం నేనెప్పుడు జీవించాలి? ఇలా ఆలోచించిన ఆమె... మనకీ ఎన్నో పాఠాలు చెబుతోంది.

దువైపోగానే కానిస్టేబుల్‌ ఉద్యోగమొచ్చింది అజీషాకి. ఓరోజు ఉన్నట్టుండి రాజీనామా చేస్తే ‘నీకేమైనా పిచ్చా’ అన్నారంతా. కొద్దిరోజుల్లోనే ‘స్పెషల్‌ గ్రేడ్‌ అసిస్టెంట్‌’గా ప్రభుత్వ కొలువు సంపాదించింది. అది చూసి ఆశ్చర్యపడ్డారంతా. తర్వాత ఆమె ఇంకేం చేసినా మిగతావారి ముఖాల్లో ఆశ్చర్యం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ ఉద్యోగి, మంచి జీతం... చాలనుకోలేదామె. ఓరోజు డుగ్గు డుగ్గు మంటూ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మీద షికారు కెళితే, మరోరోజు పర్వతాలెక్కి ఛాంపియన్‌ ట్రోఫీతో తిరిగొస్తుంది. ఇంకోరోజు ఆల్‌ ఇండియా రేడియోలో అనౌన్స్‌మెంట్లు చేస్తోంది. సినిమాలకు డబ్బింగ్‌, నటన... ఆమె ప్రయత్నించనిది అంటూ లేదు మరి.

అజీషాది కేరళలోని త్రిశూర్‌. చదువు ఒక్కటే చాలదన్న ఆమె ఆటపాటలు, నృత్యం అంటూ ఎన్నో ప్రయత్నించేది. పెళ్లి కాకముందు సరే! పెళ్లయ్యాక వీటన్నింటినీ పక్కన పడేయాలన్న సూచనలొచ్చాయి. ఆమె మాత్రం నచ్చినవి చేస్తూనే వెళ్లింది. ముగ్గురు పిల్లలు. 32 ఏళ్ల వయసులో బండి నేర్చుకుంది. ఈత నేర్చుకొని పిల్లలకు ఉచిత పాఠాలు చెబుతోంది. పర్వతాలు ఎక్కడం నేర్పుతోంది. ఓవైపు ఉద్యోగం చేస్తూనే ఖాళీ సమయాల్లో ఇవన్నీ చేస్తుంది. ముగ్గురు పిల్లల బాధ్యత అదనం. అందుకే చాలామంది నుంచి ‘ఇవన్నీ ఎలా సాధ్యం’ అనే ప్రశ్న ఎదురవుతుందామెకు. అజీషానేమో ‘ఒకే ఒక జీవితం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు జీవిస్తాం. అయినా ఏదైనా సాధించడానికి అమ్మాయి అబ్బాయి అన్న తేడా లేదు. వయసుతో ఏమాత్రం సంబంధం లేదని నమ్ముతా. నా ఆసక్తికి మావారు హరిదాస్‌ ప్రోత్సాహం ఎలానూ ఉంది. ఇంకేం నచ్చింది చేసుకుంటూ వెళుతున్నా. నాతోటివారికీ నచ్చింది చేయడానికి వయసు, పెళ్లి అనేవి అడ్డు కాదని చెబుతా. మాకు ముగ్గురబ్బాయిలు. అమ్మాయిలూ ఏదైనా సాధించగలరు, దీనికి లింగభేదం ఉండదని చెప్పడమే నా ఉద్దేశం’ అంటుంది 38 ఏళ్ల అజీషా. ఆమె సలహా మనమూ ప్రయత్నిద్దామా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్