విద్యార్థుల కోసం వేల కోట్లు దానం...!

పేద విద్యార్థులను వైద్యవిద్యకు దగ్గర చేయాలనుకున్నారామె. వారిపై రుణభారం పడకూడదనుకున్నారు. వారి కలలు సాకారం కావాలని కోట్ల రూపాయల దానంతో తన దాతృత్వాన్ని చాటుకున్నారు అమెరికాకు చెందిన రూత్‌ గోట్స్‌మన్‌.

Updated : 01 Mar 2024 02:49 IST

పేద విద్యార్థులను వైద్యవిద్యకు దగ్గర చేయాలనుకున్నారామె. వారిపై రుణభారం పడకూడదనుకున్నారు. వారి కలలు సాకారం కావాలని కోట్ల రూపాయల దానంతో తన దాతృత్వాన్ని చాటుకున్నారు అమెరికాకు చెందిన రూత్‌ గోట్స్‌మన్‌.

న్యూయార్క్‌లోని ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌  మెడికల్‌ కాలేజ్‌లో 1968లో పిల్లల వైద్య విభాగంలో ప్రొఫెసర్‌గా చేరారు రూత్‌ గోట్స్‌మన్‌. అప్పటి నుంచే లెర్నింగ్‌ డిజేబిలిటీస్‌ ఉన్న విద్యార్థులకు అంకితభావంతో సేవలందించడం ప్రారంభించారీమె. పాఠ్యాంశాలను అర్థం చేసుకోవడంలో సమస్యలున్నవారికి కావాల్సిన వైద్య పరీక్షలు, చికిత్సలు చేయించేవారు. వీరికోసం ప్రత్యేకంగా ప్రోగ్రామ్స్‌ రూపొందించిన రూత్‌, లెర్నింగ్‌ డిజేబిలిటీస్‌ చికిత్స అందించే సెంటర్‌ ఏర్పాటులోనూ ప్రముఖ పాత్ర పోషించారు. కళాశాలలో బోధనావృత్తితోపాటు సామాజికసేవా కార్యక్రమాల నిర్వహణకు నాయకత్వం వహించడంలో రూత్‌ చురుకుగా ఉండేవారు.

సేవాభావంతో..

వ్యాపారవేత్త డేవిడ్‌ గోట్స్‌మన్‌తో 1950లో ఈమెకు వివాహమైంది. ఏడు దశాబ్దాలపాటు ఈ దంపతులు వ్యక్తిగతంగానే కాకుండా, కెరియర్‌ పరంగానూ ఒకరికొకరు చేయూతగా ఉన్నారు. రూత్‌ విద్య, వైద్యరంగాలకు తనవంతు సేవలందించడానికే ఎక్కువ మక్కువ చూపేవారు. ఈమె భర్త 2022లో మృతి చెందారు. ఆ సమయానికి వీరి ఆస్తి విలువ మూడు బిలియన్ల డాలర్లు. తన భర్త దూరమైన తరవాత ఆయన చెప్పిన మార్గంలోనే అడుగులేస్తున్నానంటారీమె. ‘నాకు ఏది సరైనదనిపిస్తే అదే చేయాలని తను కోరుకునేవారు. నా మనసుకు నచ్చింది చేయాలని చెప్పేవారు. విల్లులోనూ నాకు ఆయనిచ్చిన సలహా కూడా ఇదే. విద్యార్థులందరికీ సమాన విద్యను అందుబాటులోకి తేవాలనేది మొదట్నుంచీ నా లక్ష్యం. వైద్యవిద్యలో చేరాలని ఉన్నా.. ఆర్థికభారాన్ని భరించలేక వెనకడుగేసి తమ కలలను సాకారం చేసుకోలేనివారికందరికీ చేయూతగా నిలబడాలనుకున్నా. అందుకే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ మెడికల్‌ కాలేజీకి రూ.8,290 కోట్లు దానంగా ఇచ్చాను. ఈ సాయం ఇప్పటికే కాదు,  భవిష్యత్తులోనూ మరెందరికో ఉపయోగపడుతుంది. విద్యార్థులపై రుణభారం పడకుండా ఉంటే, అది వారు నిశ్చింతగా చదువుకోవచ్చు. అర్హులైనవారికీ వైద్య విద్య దరి చేరాలి. అప్పుడే పేద విద్యార్థులు సైతం తమ కలను నెరవేర్చుకుంటారు. వారి జీవితంలో వెలుగులు నిండాలని కోరుకుంటున్నా.

ఐన్‌స్టీన్‌ కాలేజ్‌ వైద్య విద్యార్థులందరికీ భవిష్యత్తులో ట్యూషన్‌ఫీజు ఉండకూడదం’టోన్న 93 ఏళ్ల ఈ మాజీ ప్రొఫెసర్‌ రూత్‌ గోట్స్‌మన్‌ సాయం చేయడంతో విద్యార్థులంతా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. విద్యా ప్రముఖులు... ప్రశంసలతో రూత్‌ను ముంచెత్తుతున్నారు. ఇటువంటి వారు మరికొందరు ఉంటే పేద విద్యార్థులే ఉండరు కదూ...

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్