పెళ్లయింది... కొలువు పోయింది..!

నర్స్‌గా రోగులకు సేవలందించాలనే ఆమె కల నెరవేరింది. మనసుకు నచ్చినవాడిని మనువాడింది. అయితే ఆ ఆనందం ఎన్ని రోజులో లేదు. పెళ్లైందనే కారణాన్ని చూపించి కొలువు నుంచి ఆమెను గెంటేశారు. న్యాయంకోసం కోర్టునాశ్రయించింది. మహిళలకూ సమాన హక్కులున్నాయంటూనే... లింగవివక్ష ప్రదర్శించిన కేంద్రంపై కేసు వేసింది. ధైర్యంగా పోరాడి విజేతగా నిలిచింది.

Published : 01 Mar 2024 02:04 IST

నర్స్‌గా రోగులకు సేవలందించాలనే ఆమె కల నెరవేరింది. మనసుకు నచ్చినవాడిని మనువాడింది. అయితే ఆ ఆనందం ఎన్ని రోజులో లేదు. పెళ్లైందనే కారణాన్ని చూపించి కొలువు నుంచి ఆమెను గెంటేశారు. న్యాయంకోసం కోర్టునాశ్రయించింది. మహిళలకూ సమాన హక్కులున్నాయంటూనే... లింగవివక్ష ప్రదర్శించిన కేంద్రంపై కేసు వేసింది. ధైర్యంగా పోరాడి విజేతగా నిలిచింది. భవిష్యత్తులో
తనలాంటి మరెందరికో మార్గదర్శకురాలైన సెలీనాజాన్‌ పోరాటం ఇది.

కేరళ, ఎర్నాకుళంలోని పిరవ ప్రాంతంలో సెలీనాజాన్‌ పుట్టింది. తండ్రి పీసీ యోహన్నన్‌కు నూనెమర ఉంది. తల్లి అన్నమ్మ గృహిణి. ఎనిమిదిమంది పిల్లల్లో సెలీనా పెద్దది. చిన్నప్పటి నుంచి నర్సుగా రోగులకు సేవలందించాలని కలలు కనేది. డిగ్రీ తరవాత నర్సింగ్‌లో డిప్లొమా చేసింది. తనెదురు చూసినట్లుగానే మిలిటరీ నర్సింగ్‌ సర్వీస్‌ నోటిఫికేషన్‌ పడితే దరఖాస్తు చేసుకుంది. అందులో ఎంపికై 1982లో సర్వీస్‌లో చేరి దిల్లీ ఆర్మీ ఆసుపత్రిలో నాలుగేళ్లపాటు శిక్షణ పొందింది. ఆ తర్వాత సికింద్రాబాద్‌ మిలిటరీ హాస్పిటల్‌లో నర్సుగా చేరింది.

‘కేంద్రప్రభుత్వ ఉద్యోగం రావడంతో ఇంటిల్లిపాదీ ఎంతగానో సంతోషించారు. ఉద్యోగంలో చేరి ఇంటికి సంపాదన తెచ్చిన మొదటి వ్యక్తిని నేనే. అమ్మ నన్ను చూసి గర్వపడింది. సికింద్రాబాద్‌ నుంచి బిహార్‌లోని దానాపుర్‌కు బదిలీ అయ్యా. కొచ్చికు చెందిన లెఫ్టినెంట్‌ కల్నల్‌ డాక్టర్‌ వినోద్‌ రాఘవన్‌తో పరిచయం ప్రేమగా మారి, కేరళలో పెళ్లి చేసుకున్నాం. జీవితమెంతో అందంగా కనిపించింది. మావారూ నేనూ ఎన్నో కలలు కన్నాం. పెళ్లి తరవాత సెలవులు పూర్తికావడంతో తిరిగి దానాపుర్‌కు చేరుకున్నా. అయితే అక్కడ నా కోసం ఒక చేదు కబురు కాచుకుని ఉందని తెలీదు.

ఉద్యోగం నుంచి నన్ను తొలగిస్తున్నామంటూ వచ్చిన ఉత్తరం చూసి షాక్‌కు గురయ్యా. నాకు వివాహం కావడమే దీనికి కారణమంటూ పంపిన ఆ లెటర్‌ చదివి ఏం చేయాలో అర్థంకాలేదు. జీవితంలో తొలి అడుగులేస్తున్న సమయంలో ఆ ఉద్యోగం పోవడాన్ని తట్టుకోలేకపోయా. కేసు వేయాలనుకున్నాగానీ, పిల్లలు పుట్టడంతో వాళ్ల ఆలనాపాలనా చూసుకోవడంలో మునిగిపోయా. కానీ అప్పుడప్పుడూ మనసులో మాత్రం నాకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలనే ఆలోచన స్థిమితంగా కూర్చోనిచ్చేది కాదు. ఆ విషయాన్ని ఇంట్లో చెబితే కుటుంబమంతా ప్రోత్సహించింది. లెఫ్టినెంట్‌ హోదాలో ఉన్న నన్ను అర్ధాంతరంగా తొలగించారు. కాబట్టి న్యాయం కోసం అలహాబాద్‌ హైకోర్టుని ఆశ్రయిస్తే, ట్రైబ్యునల్‌కు వెళ్లమని సూచించింది. దాంతో 2012లో సాయుధ దళాల ట్రైబ్యునల్‌కి వెళ్తే, విచారించి, నన్ను విధుల్లోకి తిరిగి తీసుకోవాలని ఆదేశించింది. అయితే కేంద్రం దీనికి ఒప్పుకోకుండా ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో 2019లో సవాలు చేసింది. ఇరు వాదనలు విన్న ధర్మాసనం నాకు అనుకూలంగా తీర్పిచ్చింది. 2012లో ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్థించింది. 1977లో ప్రవేశపెట్టిన చట్టం ప్రకారం పెళ్లి కారణంతో మిలిటరీ నర్సింగ్‌ సర్వీస్‌ నుంచి తొలగించేందుకు అనుమతించే నిబంధనని 1995లో ఉపసంహరించుకున్న విషయాన్ని కూడా ప్రస్తావించింది. లింగవివక్ష చూపే ఏ చట్టాన్నీ రాజ్యాంగం అనుమతించదని, రూ.60 లక్షలు నాకు నష్టపరిహారాన్ని ఇవ్వాలంటూ కేంద్రాన్ని న్యాయస్థానం ఆదేశించింది. మహిళలపై వివక్ష తగదని మరోసారి చెప్పకనే చెప్పిన నా కేసు అందరికీ మార్గదర్శకం కావాలని కోరుకుంటున్నా’నంటోంది సెలీనా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్