సమానత్వంతో... సంపద సృష్టిద్దాం!

పది లక్షల కోట్ల రూపాయలు... ఇంత సంపదని మనందరం పంచుకోవచ్చు. అసలు ఇదేంటి... ఇంతకంటే వేల రెట్ల సంపదే ఉంది. దీనికోసం 2030 వరకూ ఆగితే చాలు.

Updated : 16 Mar 2024 15:33 IST

పది లక్షల కోట్ల రూపాయలు... ఇంత సంపదని మనందరం పంచుకోవచ్చు. అసలు ఇదేంటి... ఇంతకంటే వేల రెట్ల సంపదే ఉంది. దీనికోసం 2030 వరకూ ఆగితే చాలు. అయితే ‘ఒక షరతు’! అంత డబ్బు తీసుకోవాలంటే ముందుగా మీరు కొంత పెట్టుబడి పెట్టాలి. ఇదేం తిరకాసు అనుకోవద్దు. మీరు పెట్టగలిగిందే.. మీ చేతుల్లో ఉన్నదే! చేయాల్సిందల్లా... ‘ఆడపిల్లల విషయంలో సమానత్వం చూపిస్తూ... అవకాశాలు అందుకొనేలా చేస్తే చాలు’. సంపదకీ, అమ్మాయిల అవకాశాలకీ సంబంధం ఏంటీ అనేగా అనుమానం. అదెలాగో తెలుసుకోవాలంటే మహిళా దినోత్సవం సందర్భంగా ఐరాస ఈ ఏడాది ప్రకటించిన థీమ్‌ ‘ఇన్వెస్ట్‌ ఇన్‌ విమెన్‌- యాక్సిలరేట్‌ ప్రోగ్రెస్‌’ గురించి తెలుసుకుందాం... 

టా రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడేవాళ్ల లెక్కతీస్తే 47 శాతం మంది ఆడవాళ్లే ఉంటారు. ఎందుకో తెలుసా? కార్లలోని సీట్‌ బెల్టులని పరీక్షించేటప్పుడు సగటు మగవాళ్ల డమ్మీని పెట్టి దానిపైనే ప్రయోగాలు చేస్తారు కాబట్టి. అంతెందుకు సెల్‌ఫోన్లు... మగవాళ్ల చేతుల్లో అమరినట్టు మనకు అమరవు. ఎందుకంటే... ఇవేమీ మహిళల్ని దృష్టిలో పెట్టుకుని డిజైన్‌ చేయలేదు కాబట్టి. జనాభాలో సగం ఉన్నా...  మగవాళ్ల కోసం మాత్రమే డిజైన్‌ చేసిన ప్రపంచం ఇది అంటారు ‘ఇన్‌విజిబుల్‌’ విమెన్‌ పుస్తకాన్ని రాసిన కరోలిన్‌ క్రియాడో. కానీ ఈ పరిస్థితుల్లో మార్పు వస్తే? కుటీర పరిశ్రమల్లో ఆడవాళ్లకు అవకాశాలు పెంచినా చాలు... 2030 నాటికి రూ.పదిలక్షల కోట్ల సంపదని సృష్టించవచ్చని గేట్స్‌ ఫౌండేషన్‌ అధ్యయనం చెబుతోంది. ఇక చదువు, ఉద్యోగాలు, వ్యవసాయం, ఆరోగ్యం.. వీటిల్లోనూ సమాన అవకాశాలు, ప్రోత్సాహం దొరికితే ఆ సంపదని ఊహించను కూడా ఊహించలేం. కావాలంటే మీరే చూడండి..   

హైస్కూల్‌ చదివినా... 10శాతం జీడీపీ

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో... ప్రతి ఐదుగురు ఆడపిల్లల్లో ఒకరు ఐదో తరగతి కూడా పూర్తిచేయకుండానే చదువు మానేస్తున్నారు. ఏడుగురిలో ఒకరు 15 ఏళ్లు నిండకుండానే పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. దీనికితోడు కొవిడ్‌, యుద్ధం, పర్యావరణ ప్రతికూలతలు ఈ పరిస్థితిని ఇంకా దిగజారుస్తూ, రానున్న కాలంలో 34 కోట్లమంది ఆడపిల్లల్ని కఠిన పేదరికంలోకి నెట్టేస్తున్నాయి. అలా కాకుండా వాళ్లు హైస్కూల్‌ చదువుని పూర్తిచేస్తే, ఆయా దేశాల జీడీపీ 2030నాటికి 10శాతం పెరుగుతుందని యూనిసెఫ్‌ చెబుతోంది. ఆరో తరగతి తర్వాత చదువు కొనసాగించే ప్రతి ఏడాదికీ అమ్మాయిల ఆర్థిక ప్రగతి 20 శాతం పెరుగుతుందని యూఎన్‌ విమెన్‌ సంస్థ చెబుతోంది. అంటే దేశ సంపద ఆడపిల్ల చదువుపై ఆధారపడ్డట్టేగా!

వ్యవసాయంలో...

మన దేశం ఉత్పత్తి చేస్తున్న ఆహారంలో 80 శాతానికి కారకులు మహిళలే. 43 శాతం మహిళలు వ్యవసాయంలో కీలక పాత్ర వహిస్తున్నారు. కానీ ఆ భూమిపై కనీసం13 శాతం మందికి కూడా హక్కులేదు. ఆడవాళ్లకు భూమిపై హక్కు, అగ్రి టెక్నాలజీ వంటి నూతన సాంకేతికతపై పట్టు, పెట్టుబడులు అందిస్తే చాలు. మగవాళ్ల కంటే 30 శాతం అధిక దిగుబడులు వస్తాయనీ, ఆహార భద్రత 20 శాతం పెరుగుతుందనీ ఐరాస ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ సంస్థ నివేదికలు చెబుతున్నాయి.

ఆరోగ్యంపై పెట్టుబడి పెడదాం..

99శాతం మాతృత్వ మరణాలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉండటం బాధాకరమైన విషయం. గర్భ నిరోధక మాత్రలు, అత్యవసర వైద్య సేవలు అందుబాటులో లేక ఏటా 7.3కోట్లమంది అవాంఛిత గర్భాల బారిన పడుతున్నారు. వాళ్లలో అత్యధికశాతం అసురక్షిత గర్భస్రావాలు చేయించుకుంటున్నారు. అదే ఆర్థికంగా వెనకబడిన దేశాల్లో కాంట్రాసెప్టివ్‌ విధానాలు అందుబాటులోకి తీసుకొస్తే 68 శాతం అవాంఛిత గర్భాలు తగ్గుతాయట. అలాగే శానిటరీ నాప్కిన్లు అందుబాటులోకి వస్తే ఆడపిల్లల్లో అక్షరాస్యత శాతం పెరుగుతుంది. అవి అందుబాటులో లేకనే ప్రతి ఐదుగురిలో ఒక ఆడపిల్ల చదువు మానేస్తోంది. ఇలా ఆడవాళ్ల ఆరోగ్యంపై పెట్టిన ప్రతి రూపాయీ... 2040 నాటికి 1300 కోట్ల రూపాయల సంపద రూపంలో వెనక్కి వస్తుందట.

పనికి విలువ కడదాం...

‘ఇన్‌విజిబుల్‌ లేబర్‌’ అంటే కంటికి కనిపించని శ్రమ మన ఆడవాళ్లది. ముఖ్యంగా ఇంటి పని. ఎంత చేసినా ఈ శ్రమకి గుర్తింపు ఉండదు.  కానీ ప్రపంచ ఎకానమీలో తొమ్మిది శాతం వాటా ఈ కేర్‌ ఎకానమీది. అంతర్జాతీయ లేబర్‌ ఆర్గనైజేషన్‌ అభిప్రాయం ప్రకారం ఈ కేర్‌ ఎకానమీ విలువని గుర్తించగలిగితే... 2030 నాటికి 29.9 కోట్ల ఉద్యోగాలు వస్తాయట. అందులో 78 శాతం ఆడవాళ్లకే చెందుతాయి.


అలా మొదలైంది!

దే పని... అదే శ్రమ... అయినా మహిళలకు గుర్తింపు లేదు. అడుగడుగునా అసమానత, వివక్ష. దీన్ని వ్యతిరేకిస్తూ 1908లో పెద్ద ఎత్తున ఉద్యమించారు మహిళలు. నూయ్యార్క్‌ నగరంలో 15 వేలమంది మహిళలు బయటకు వచ్చి... పని వేళలు తగ్గించాలనీ, సమాన వేతనాలు ఇవ్వాలనీ, ఓటు హక్కు కావాలనీ ఉద్యమించారు. ఫలితంగా ఆ తరవాతి ఏడాది నుంచీ కొపెన్‌హేగన్‌లో అంతర్జాతీయ మహిళా సమావేశం జరిగింది. జర్మనీకి చెందిన క్లారా జెట్కిన్‌ ఆధ్వర్యంలో... ఈ మహిళాహక్కుల ఉద్యమం మరింత ముందుకు సాగింది. ఆ తర్వాత ఆస్ట్రియా, జర్మనీ, డెన్మార్క్‌, రష్యాల్లోనూ మహిళల హక్కులపై చర్చ జరిగి చివరికి మార్చి 8ని ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవంగా జరుపుకొంటున్నాం.


ఐరాస ఈ ఏడాది క్యాంపెయిన్‌ థీమ్‌ని ‘ఇన్‌స్పైర్‌ ఇన్‌క్లూజన్‌’గా ప్రకటించింది. అభివృద్ధి పథంలోకి మహిళలనీ కలుపుకొని వెళ్లడం, అలాగే వారు ఆయా రంగాల్లోకి అడుగుపెట్టేలా ప్రోత్సహించాలనేది దీనర్థం. అంటే- వాళ్లకి చదువునీ, ఆరోగ్యాన్నీ, నైపుణ్యాల్నీ అందించడంతోపాటు... వ్యవసాయంలో, క్రీడల్లో, కళల్లో వాళ్ల ప్రతిభను గుర్తించి అవకాశం కల్పించాలి. అలాగే మహిళలు తమకు తాముగా స్ఫూర్తి పొందుతూ ఒకరికొకరు సహకరించుకోవాలంటూ నిర్వచించింది. అందుకోసం ఇన్‌స్పైర్‌ ఇన్‌క్లూజన్‌ పేరుతో హ్యాష్‌ట్యాగ్‌ చేసి రెండు చేతులనూ హృదయాకారపు గుర్తువచ్చేట్టుగా పెట్టి పోజ్‌ ఇవ్వడం ద్వారా ఈ థీమ్‌ని అందరూ ప్రచారం చేయాలని చెబుతోంది.


కలల్ని నిజం చేసుకునే మార్గం తప్పక ఉంటుంది. అయితే ఆ మార్గాన్ని వెతకాల్సింది మనమే. అందులో ప్రయాణించే ధైర్యం, పట్టుదల మనకు ఉంటే విజయం తప్పక వరిస్తుంది.

 కల్పనా చావ్లా, అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి భారత సంతతి వ్యోమగామి


సమాన వేతన హక్కు

ఒకే విధమైన పనికి స్త్రీ, పురుష కార్మికులందరికీ సమాన వేతనాలు చెల్లించేలా చేస్తోంది సమాన పారితోషిక చట్టం- 1976. బదిలీలు, శిక్షణ, పదోన్నతులు...వంటి విషయాల్లో ఉద్యోగినుల పట్ల వివక్ష చూపించకుండా ఈ చట్టం తోడుంటుంది. కెరియర్‌లో దూసుకుపోవాలనుకునే మహిళలెవరైనా పనిలో లింగ వివక్ష ఎదుర్కొంటుంటే కచ్చితంగా ప్రశ్నించొచ్చు. మీ హక్కుని సాధించుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్