ఆంక్షల సంకెళ్లు దాటి... ఆర్థిక వృద్ధికి!

‘మహిళా సాధికారత లేకుండా దేశ శ్రేయస్సుని ఊహించలేం’ అది సాధించాలంటే...  విధానాల్లో మార్పులతో పాటు సామాజిక చైతన్యం, కుటుంబ ప్రోత్సాహం ఎంతో అవసరం.

Updated : 16 Mar 2024 15:22 IST

అంతర్జాతీయ మహిళా వారోత్సవాల సందర్భంగా...

‘మహిళా సాధికారత లేకుండా దేశ శ్రేయస్సుని ఊహించలేం’ అది సాధించాలంటే...  విధానాల్లో మార్పులతో పాటు సామాజిక చైతన్యం, కుటుంబ ప్రోత్సాహం ఎంతో అవసరం.

ప్రపంచ జనాభాలో సగం మంది మహిళలే. అదే మనదేశానికి వస్తే  ప్రతి 1000 మంది పురుషులకు 1020 మంది మహిళలు ఉన్నారంటోంది తాజా ఆర్థిక సర్వే. అందుకని దేశ జీడీపీలోనూ వీరి వాటా ఎక్కువే అనుకుంటే మాత్రం మీరు పొరపడినట్లే. ఎలాగంటారా? ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం స్వాతంత్య్రం వచ్చినప్పుడు 9 శాతంగా ఉన్న మహిళా అక్షరాస్యత ఇప్పుడు 77శాతానికి చేరింది. ఎంతోమంది ఆడపిల్లలు ఉన్నతంగా చదివినా... సంప్రదాయాలు, కట్టుబాట్లు... వంటి వాటి కారణంగా ఉపాధికోసం గడప దాటడం లేదు. దీనికి పని వాతావరణంలో సమస్యలు, వేతనాల్లో వ్యత్యాసాలు, లైంగిక వేధింపులు... వంటి మరెన్నో అంశాలు తోడై వారిని ఆర్థిక సాధికారత దిశగా అడుగు వేయనీయడం లేదు. అలాగని వారు ఏ పనీ చేయరనుకునేరు... ఇంటి పట్టునే ఉండి ఇల్లాళ్లు చేసే శ్రమకి లెక్క కట్టడం, విలువ చెప్పడం కష్టమే. దీంతో పడ్డ కష్టానికి ప్రతిఫలంగా ఆదాయం అందుకోలేకపోవడం, ఇతరత్రా మరెన్నో కారణాలు... దేశ జీడీపీలో మహిళల భాగస్వామ్యాన్ని తక్కువగా చూపిస్తున్నాయి. మరోపక్క అభివృద్ధి చెందిన దేశాల జీడీపీలో మగువల వాటా చాలా ఎక్కువగా ఉంది. 2015 నాటి లెక్కల్నే పోల్చి చూసుకుంటే చైనా, తూర్పు ఐరోపా, మధ్య ఆసియాలో అత్యధికంగా జీడీపీల్లో స్త్రీల వాటా 41 శాతం ఉంటే, ఉత్తర అమెరికాలో 40 శాతం వాటా వీరిదే. మొత్తంగా ప్రపంచ జీడీపీ సగటుని లెక్కించినా 37 శాతం మహిళల నుంచే వస్తోంది. కానీ, భారత్‌ విషయానికి వస్తే అది 17-18 శాతంగానే ఉంది.

అది సరిపోదు...

గతంతో పోలిస్తే కార్పొరేట్‌ బోర్డు రూముల్లో లింగ వైవిధ్యాన్ని సాధించగలిగాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్టప్‌ల పరంగా భారతదేశం మూడో అతిపెద్ద ఎకోసిస్టమ్‌ని కలిగి ఉంది. వీటిల్లో పదిశాతం స్టార్టప్‌లకు మహిళలే వ్యవస్థాపకులుగా ఉన్నారు. ప్రస్తుతం, భారతదేశంలో ఉత్పాదక శక్తి ఉన్న స్త్రీలు 43.2 కోట్లు ఉండగా, వీరిలో 34.3 కోట్లమంది అసంఘటిత రంగంలో ఉపాధి పొందుతున్నారు. వ్యవసాయేతర ప్రతి ఐదు వ్యాపారాల్లో ఒకటి ఆడవారే నడుపుతున్నారు. స్వయం ఉపాధికోసం తీసుకునే ముద్రా రుణ గ్రహీతల్లో 70 శాతం మంది మహిళలే. ఆ మధ్య 250 భారతీయ కంపెనీల్లో చేసిన అధ్యయనం ప్రకారం- చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ హోదాల్లో నిలదొక్కుకుంటోన్న మహిళల వాటా 55 శాతం పెరిగిందట. అయినప్పటికీ ఈ వాటా ఇంకా పెరగాలి. స్త్రీల ఆర్థిక భాగస్వామ్యం, అవకాశాలకు సంబంధించి వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం ఓ నివేదిక ఇచ్చింది. అందులో 146 దేశాలకు ర్యాంకులు ఇవ్వగా భారత్‌ది 142వ స్థానం. దీన్నిబట్టి మన దేశ మహిళలు ఆర్థిక పురోగతి సాధించడంలో ఇంకా వెనుకబడే ఉన్నారని తెలుస్తోంది.

ప్రోత్సాహమిస్తేనే...

మహిళలకు ఆర్థిక స్థిరత్వం చేకూరినప్పుడే వారు తమ హక్కులు, సౌకర్యాలను సాధించుకోగలరు. ఆరోగ్యం, పౌష్టికాహారం, మాతృత్వం, పిల్లల చదువు వంటి అంశాలపై ఎక్కువ పట్టు నిలుపుకోగలుగుతారు. మహిళలకు సమానావకాశాలు లభిస్తే 2025కల్లా భారత జీడీపీకి అదనంగా రూ.63.8లక్షల కోట్ల సంపద చేకూరుతుందంటోంది మెకిన్సే గ్లోబల్‌ ఇన్‌స్టిట్యూట్‌-2021 నివేదిక. మెంటార్‌షిప్‌, లీడర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లను నిర్వహించడం, నెట్‌వర్కింగ్‌, సపోర్టింగ్‌ గ్రూపుల ఏర్పాటు, ఫ్లెక్సిబుల్‌ వర్క్‌పాలసీలను అమలుచేయడం వంటివాటి ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో స్త్రీల భాగస్వామ్యాన్ని మరింతగా పెంచగలం.


మహారాణిలా ఆలోచించండి. ఆమె ఎప్పుడూ అపజయాలకు భయపడదు. ఓటమిని కూడా విజయానికి సోపానంగా చేసుకుంటుంది.

ఓప్రా విన్‌ఫ్రే,
సుప్రసిద్ధ అమెరికన్‌ టీవీ వ్యాఖ్యాత


రెస్ట్‌రూమ్‌ను వాడుకునే హక్కు

భారతీయ సరాయీల చట్టం- 1867లోని సెక్షన్‌ 7(3) అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ఎవరైనా సరే, ఏ స్థాయి హోటల్‌లోనైనా తాగునీరు, వాష్‌ రూం వసతులను ఉచితంగా ఉపయోగించుకోవచ్చని చెబుతోంది. నెలసరి సమయంలోనూ, ప్రయాణాల్లోనూ ఈ ఇబ్బంది ఆడవాళ్లకు కాస్త ఎక్కువే. ఇలాంటప్పుడు దాన్ని భరించాల్సిన అవసరం లేదు. మొహమాట పడకుండా, మీ ఆత్మగౌరవాన్ని తగ్గించుకోకుండానే మీ హక్కుని వినియోగించుకోవచ్చు.


ఒక్కమ్మాయి ధైర్యమే... విప్లవం!


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్