పులి పిలిచింది..!

దట్టమైన అడవిమధ్యలో అనుకోకుండా పులి ఎదురైతే... మన గుండె వేగం పెరగడం ఖాయం. ఆమె మాత్రం పులుల ఉనికిని వెతుక్కుంటూ... మైళ్ల దూరం వెళుతోంది.

Updated : 16 Mar 2024 07:19 IST

దట్టమైన అడవిమధ్యలో అనుకోకుండా పులి ఎదురైతే... మన గుండె వేగం పెరగడం ఖాయం. ఆమె మాత్రం పులుల ఉనికిని వెతుక్కుంటూ... మైళ్ల దూరం వెళుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న పులులపై ప్రాజెక్టు చేస్తూ.. ప్రజలకు పులుల సంరక్షణ కేంద్రాలపై అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తోంది. ఆమె తీసే వన్యప్రాణుల ఫొటోలు, వీడియోలకు సోషల్‌మీడియాలో 20 లక్షలమందికిపైగా అభిమానులున్నారు. బీబీసీ, డిస్కవరీ వంటి పలు జాతీయ, అంతర్జాతీయ మీడియా వేదికలపై సాహసోపేతమైన వైల్డ్‌ ఫొటోగ్రాఫర్‌గా ప్రశంసలు అందుకుంటోన్న ఆర్జూ ఖురానా గురించి ఆమె మాటల్లోనే...

మాది రాజస్థాన్‌. చిన్నప్పటి నుంచి ఫొటోగ్రఫీ అంటే ఇష్టంతో శిక్షణ తీసుకున్నా. మొదటిసారి మా సమీపంలోని అడవిలోకి వేకువజామునే, భుజాన బ్యాగు, లెన్స్‌, ట్రైపాడ్‌, చేతిలో కెమెరా బరువుతో పక్షుల ఫొటోలు తీయడానికి వెళ్లా. నాలుగు గంటలెదురుచూసినా ఒక్కటీ రాలేదు. చలికాలం కావడంతో మంచుకు చేతులన్నీ చల్లగా అయిపోయాయి. శక్తీ, సమయం వృథా అనిపించి, నిరాశగా తిరిగొచ్చేశా. ఆ తొలి ప్రయత్నమే చివరిది అనుకున్నా. కానీ మరోసారి చూద్దామనిపించింది. ఈసారి ఎంతో అందమైన పక్షుల ఫొటోలు తీయగలిగా. అలా అడవిపై ప్రేమ పెరిగింది. అరుదైన పక్షల నుంచి వన్యప్రాణులను కెమెరాలో బంధించడం నేర్చుకున్నా.

వీల్లేదన్నారు...

వైల్డ్‌ ఫొటోగ్రఫీ అనగానే అమ్మానాన్న ససేమిరా అన్నారు. ఇంట్లో ఒక్క అమ్మాయిని కావడంతో గారంగా పెరిగా. నాకేదైనా ప్రమాదం ఎదురవుతుందని భయపడ్డారు. న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నా. కానీ దానికన్నా అడవీ, అందులోని పులీ నన్ను ఆకర్షించాయి. పులుల సంరక్షణ కేంద్రాలపై అందరికీ అవగాహన కలిగించే ప్రాజెక్టు చేయాలనుకుంటున్నానని చెబితే, అమ్మానాన్న వద్దన్నారు. ఎట్టకేలకు ఒప్పించా. పులుల సంరక్షణ కేంద్రాలనగానే ప్రముఖ నగరాలకు సమీపంలో ఉన్నవి మాత్రమే పర్యాటకప్రాంతాలనుకుంటారంతా. మారుమూల ప్రాంతాల్లోనూ టైగర్‌ రిజర్వ్స్‌ ఉన్నాయనే సమాచారం అందరికీ చేర్చాలనుకున్నా. అదే ‘ఏటీఆర్‌’ డాక్యుమెంటేషన్‌ ప్రాజెక్టు. దేశవ్యాప్తంగా ఉన్న 55 పులుల సంరక్షణకేంద్రాల్లోని పులులన్నింటినీ డాక్యుమెంటరీ చేయడం సాహసోపేతమని తెలిసినా లక్ష్యంగా తీసుకున్నా. 6 నెలల్లో 24 రాష్ట్రాలను పర్యటించాలని ప్రణాళిక వేసుకున్నా. గతేడాది అక్టోబరు ఒకటిన రాజస్థాన్‌ సరిస్కా టైగర్‌ రిజర్వ్‌ నుంచి బృందంతో కలిసి ప్రయాణం మొదలుపెట్టా. ఇప్పటివరకు మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, పశ్చిమబెంగాల్‌, ఒడిశా, అసోం రాష్ట్రాల్లోని 43 టైగర్‌ రిజర్వ్స్‌ తిరిగాం. మరో 12 రిజర్వ్స్‌ చూడాల్సి ఉండగా ఉత్తరాఖండ్‌ పర్యటనతో ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది.

పక్కనే నిలబడింది...

ఈ ప్రాజెక్టులో ఛాలెంజ్‌లెన్నో ఎదురయ్యాయి. కొన్నిచోట్ల సరైన రోడ్డు మార్గం ఉండదు. కొన్ని ప్రాంతాల్లో బసకు సౌకర్యంలేక వెహికల్‌లోనే ఉండాలి. పగలూరాత్రీ తేడా లేకుండా పులుల కోసం ఎదురుచూడాలి. ఏమూల ఏ ప్రమాదం పొంచి ఉందోనని అనుకుంటూ అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. అయితే... కొన్ని అనుభవాలు వీటన్నింటినీ మరిచేలా చేస్తాయి. పిల్లలతో కలిసి సంచరిస్తున్న కత్రినా అనే పులిని చూసినప్పుడు చాలా ఎగ్జైట్‌ అయ్యా. కొన్నిచోట్ల పులి రాక కోసం గంటల తరబడి ఎదురుచూసేదాన్ని. నా సహనానికి ఫలితం దక్కేది కాదు. మరికొన్నిసార్లు ఉదయం నుంచి రాత్రి వరకూ పడిగాపులు కాచినా.. ఒక్క పులి కూడా సంచారానికి వచ్చేది కాదు. ఓసారి 8 గంటలపాటు సఫారీ చేసి, నిరాశగా వెనుదిరుగుతున్నప్పుడు అకస్మాత్తుగా రోడ్డుపై పులి ఎదురైంది. అంతలోనే మా జీపు పక్కగా వచ్చి నిల్చొంది. ఊపిరి ఆగినంత పనైంది. దూరంగా ఉన్న తన పిల్లలను పిలిచి, వాటితోపాటు అడవిలోకి వెళ్లింది. అంతవరకూ నా చేతిలో కెమెరా పని చేస్తూనే ఉంది. అలాగే పన్నా టైగర్‌ రిజర్వ్‌లో పిల్లలతో ఓ పులి నా లెన్స్‌కు చిక్కింది. భరత్‌పూర్‌లో ఒక చిన్నబ్బాయి నావద్దకొచ్చి ‘అక్కా.. నువ్వు తీసిన పక్షుల ఫొటోలు చూసిన తర్వాత నాకు అడవిలోకి వెళ్లి వాటిని నేరుగా చూడాలనిపిస్తోంద’ని చెప్పడం నాలో ఉత్సాహాన్ని నింపింది. నేను తీసే ఈ ఫొటోలు, వీడియోలు మరెందరికో టైగర్‌ రిజర్వ్స్‌ను సందర్శించాలనే ఆలోచన తెస్తుందన్న నమ్మకమే నన్ను కెమెరా పట్టుకునేలా చేసింది.


తొలి మహిళ

కార్నేలియా సొరాబ్జీ... భారతదేశంలో మొదటి మహిళా న్యాయవాది. మహారాష్ట్రలోని నాసిక్‌లో జన్మించారు. అప్పట్లో బాంబే యూనివర్సిటీ నుంచి పట్టభద్రురాలైన తొలి మహిళ కూడా ఈమె. అంతేకాదు, ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రం అభ్యసించిన మొదటి భారతీయురాలు. నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ విమెన్‌ ఇన్‌ ఇండియా, ఫెడరేషన్‌ ఆఫ్‌ యూనివర్సిటీ విమెన్‌, బెంగాల్‌ లీగ్‌ ఆఫ్‌ సోషల్‌ సర్వీస్‌ ఫర్‌ విమెన్‌ వంటి మహిళాభ్యున్నతి సంస్థలతో కలిసి పనిచేశారు. దేశానికి ఆమె చేసిన సేవలకుగానూ 1909లో కైసర్‌-ఎ- హింద్‌ అనే బంగారు పతకాన్ని కూడా అందుకున్నారు. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొంటూనే సతి, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్