రక్షణ కోసం అగ్నికవచ్‌

ఎండాకాలం వచ్చిందంటే ముందుగా గుర్తొచ్చేవి అగ్ని ప్రమాదాలే. మగవాళ్లతో పోలిస్తే ఆడవాళ్లే ఎక్కువగా ఈ ప్రమాదాల్లో చిక్కుకుంటారు. వీటి బారిన పడకుండా, మనల్ని సులభంగా బయటపడేసే అగ్నికవచ్‌ ఫైర్‌ ఎక్స్‌టింగ్విషర్‌ బాల్స్‌ని మనకు పరిచయం చేస్తున్నారు సరోజ గుగులోత్‌.

Published : 21 Mar 2024 02:08 IST

ఎండాకాలం వచ్చిందంటే ముందుగా గుర్తొచ్చేవి అగ్ని ప్రమాదాలే. మగవాళ్లతో పోలిస్తే ఆడవాళ్లే ఎక్కువగా ఈ ప్రమాదాల్లో చిక్కుకుంటారు. వీటి బారిన పడకుండా, మనల్ని సులభంగా బయటపడేసే అగ్నికవచ్‌ ఫైర్‌ ఎక్స్‌టింగ్విషర్‌ బాల్స్‌ని మనకు పరిచయం చేస్తున్నారు సరోజ గుగులోత్‌...

పండగకదాని దసరా రోజు ఇంట్లో దీపం పెట్టి గుడికి వెళ్లిందా ఇల్లాలు. వచ్చిచూసే సరికి ఇల్లంతా కాలిబుగ్గైంది. ఆ సంఘటన చూసిన తర్వాత అగ్ని ప్రమాదాల బారినుంచి రక్షించే పరికరాలపై దృష్టిపెట్టానంటారు సరోజ. ‘అగ్నికీలల్ని చూస్తేనే మనకి భయం వేస్తుంది. ఇక వాటికి దగ్గరగా వెళ్లి ఆర్పే ధైర్యం మనకెక్కడుంటుంది? కానీ వంటింట్లో ఎక్కువగా ప్రమాదాలని ఎదుర్కొనేది మనమే. అలాంటప్పుడు ఈ ఫైర్‌ ఎక్స్‌టింగ్విషర్‌ బాల్స్‌ మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. చూడ్డానికి ఇవి క్రికెట్‌ బంతుల్లా ఉంటాయి. వీటిని వంటింట్లో లేదా అగ్ని ప్రమాదం జరిగే ఆస్కారం ఉన్న చోట్ల తేలిగ్గా అమర్చుకోవచ్చు. ఇవి మంట తగిలిన మూడు నుంచి ఐదు సెకన్లకి వాటంతట అవి పేలి, మంటలని అదుపులోకి తెస్తాయి. ఎక్కడైనా మంటలు అదుపు తప్పుతున్నాయనుకుంటే మనమే చేత్తో బంతి విసిరినట్టుగా తేలిగ్గా విసిరేయొచ్చు. మంటలు ఆరిపోతాయి. కిలోవరకూ బరువు ఉంటాయి. వీటి లోపల ఎంఏపీ(మోనో అమ్మోనియం ఫాస్ఫేట్‌)అనే రసాయనం ఉంటుంది. ఇది శరీరంపై పడినా ఏం కాదు. మనం ఇంట్లో లేకపోయినా మంటలకు స్పందించి వాటంతట అవే పేలతాయి. మంటలున్న ప్రాంతంలో ఆక్సిజన్‌ స్థాయిని తగ్గించి, అవి వ్యాపించకుండా చూస్తాయి’ అనే సరోజ అగ్నికవచ్‌ బంతులని సూపర్‌స్టాకిస్ట్‌గా దక్షిణాది రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు.

అలా వచ్చిందీ ఆలోచన...

‘మాది ములుగు జిల్లా. మావారు లక్ష్మణ్‌ ఐటీ ఉద్యోగి ... ముగ్గురు పిల్లలు. ఉద్యోగరీత్యా అమెరికాలో పదకొండేళ్లు ఉండి... తిరిగి మనదేశానికి వచ్చేశాం. ఇంట్లో ఖాళీగా ఉండలేక ఏదైనా వ్యాపారం చేద్దాం అనుకున్నా. ఆ సమయంలో మహిళలు అగ్నిప్రమాదాలు బారిన పడటం పత్రికల్లో గమనించా. దాంతో ఏ వ్యాపారం చేసినా సామాజిక ప్రయోజనం ఉండాలని ఈ అగ్నికవచ్‌ని ప్రారంభించాం. మొదట్లో ఇవి పేలుతాయేమోనని చాలామంది సందేహపడేవారు. కానీ వీటి వినియోగం సులభంగా ఉండటంతో చక్కని ఫీడ్‌బ్యాక్‌ వచ్చింది. ఇప్పటివరకూ వేయికి పైగా అగ్నికవచ్‌ బంతులని అమ్మాం’ అంటూ వివరించారు సరోజ గుగులోత్‌.

అదపాక సాయి, హైదరాబాద్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్