ఆమె చేతుల మీదుగా... సెలెబ్రిటీల పెళ్లి!

వెడ్డింగ్‌ ప్లానర్‌... ఈ మాట ఇప్పుడు కొత్తేం కాదు. కానీ మూడు దశాబ్దాల క్రితం కాదు. అలాంటిది ఓ మధ్యతరగతి అమ్మాయి ఎలా రాణించింది? బాలీవుడ్‌, వ్యాపార ప్రముఖులకు ‘భారీ పెళ్లిళ్లు’ ఎలా డిజైన్‌ చేసింది? తెలియాలంటే వందనా మోహన్‌ ప్రయాణాన్ని చదివేయాల్సిందే!

Published : 26 Mar 2024 02:09 IST

వెడ్డింగ్‌ ప్లానర్‌... ఈ మాట ఇప్పుడు కొత్తేం కాదు. కానీ మూడు దశాబ్దాల క్రితం కాదు. అలాంటిది ఓ మధ్యతరగతి అమ్మాయి ఎలా రాణించింది? బాలీవుడ్‌, వ్యాపార ప్రముఖులకు ‘భారీ పెళ్లిళ్లు’ ఎలా డిజైన్‌ చేసింది? తెలియాలంటే వందనా మోహన్‌ ప్రయాణాన్ని చదివేయాల్సిందే!

‘దీప్‌వీర్‌... అదేనండీ దీపిక పదుకోణ్‌, రణ్‌వీర్‌ సింగ్‌ పెళ్లి. సన్నిహితుల మధ్య గోప్యంగా జరగాలన్నది వాళ్ల కోరిక. అంటే ఇంట్లోవాళ్లకి కూడా ఫలానా వాళ్లది పెళ్లి అని చెప్పడానికి వీల్లేదు. పైగా పెళ్లి కొంకణి, ఆనంద్‌ కరాజ్‌ రెండు భిన్న సంప్రదాయాల్లో జరుగుతుంది. ఇటలీలో పూలు, డోలు, భోజనానికి అరటి ఆకుల కోసం వెతకడం ఎంత కష్టమో ఊహించండి. తొమ్మిది నెలల కష్టం... కానీ వధూవరులు కోరుకున్నట్లుగా అన్నీ అమర్చినపుడు కలిగే సంతృప్తే వేరు.

అంబానీల వారసుడు ఆకాష్‌ పెళ్లి. దేశవిదేశాల నుంచి అతిథులొస్తారు. సమయమేమో రెండు నెలలే. నీతా అంబానీ స్వయంగా ప్రతి చిన్న విషయాన్నీ అడిగి తెలుసుకునేవారు. సాయంత్రం మొదలైతే మీటింగ్‌ తెల్లవారుజాము 4గం. వరకూ సాగేది. పెళ్లిమండపం బృందావనాన్ని తలపించాలన్నది నీతా కోరిక. కొండలు, అందమైన తోటలు, జలపాతాలు వగైరా రూపొందించడానికి ఆర్కిటెక్ట్‌లు, స్థానిక కళాకారులతో కలిసి పనిచేశా. ఆ పెళ్లికి 12 వేలమంది సహాయకులు పనిచేశారు. వారందరితో సమన్వయం చేసుకుంటూ పూర్తిచేయడం ఇప్పటికీ ఆశ్చర్యమే!

రాఘవ్‌ చద్దా, పరిణీతి చోప్రా... ఒకరేమో రాజకీయ నాయకుడు మరొకరు బాలీవుడ్‌ స్టార్‌. వాళ్ల ఎంగేజ్‌మెంట్‌కి ఓవైపు సంప్రదాయానికి ప్రాధాన్యమిస్తూనే ఆధునికతా కనిపించాలని కోరుకున్నారు. ఐవరీ థీమ్‌ డెకార్‌కి లైట్లు, మొక్కలు, తెలుపు గులాబీలు జోడించి అందంగా తీర్చిదిద్దాం. ఆత్మీయులందరికీ సొంత ఇంటి భావన తేవాలన్నది వాళ్ల ఆశ. పూలు, సెంటెడ్‌ క్యాండిల్స్‌ పరిమళం, పారే నీటి శబ్దంతో అలా ప్రశాంత వాతావరణాన్ని సృష్టించగలిగా’... కదిలించాలేగానీ వందనా మోహన్‌కి ప్రతి పెళ్లీ ఓ జ్ఞాపకమే. ప్రపంచంలోని ఎన్నో ప్రాంతాల్లో ఆమె పెళ్లి వేదికలు డిజైన్‌ చేశారు. ఆ సంఖ్యా 500కు పైమాటే! కానీ అనుకోకుండా ఆమె ఈ రంగంలోకి వచ్చారంటే నమ్ముతారా?

ఈవెంట్ల నుంచీ...

దిల్లీలోని మధ్యతరగతి కుటుంబం వందనది. మోడలింగ్‌, యాంకరింగ్‌ అంటే ఆసక్తితో డాక్యుమెంటరీ మేకింగ్‌, స్క్రిప్ట్‌ రైటింగ్‌వైపు వెళ్లారు. తరవాత ఓ విదేశీ సంస్థలో కన్సల్టెంట్‌గా చేరిన ఆమె ప్రొడక్షన్‌ హెడ్‌గా ఎదిగారు. ఆ ఆత్మవిశ్వాసంతో సొంతంగా 1989లో ‘బ్యాక్‌స్టేజ్‌ ప్రొడక్షన్‌’ పేరుతో ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థను ప్రారంభించారు. కార్పొరేట్‌ సంస్థలకు పార్టీలు ప్లాన్‌ చేయడం వీరి పని. అప్పుడు ఓ ఆర్మీ ఆఫీసర్‌ తన కూతురి పెళ్లికోసం సంప్రదించారు. ఆమెకేమో దాని గురించే తెలియదు. ఆయన పట్టుబట్టడంతో కాదనలేకపోయారు. అప్పటివరకూ పెళ్లి మండపమంటే రెడీమేడ్‌గా దొరికినవాటినే అమర్చేవారు. కానీ వందన వధూవరుల అభిరుచులు తెలుసుకొని సొంతంగా డిజైన్‌ చేయించి మరీ దాన్ని పూర్తిచేశారు. అభినందనలు అందుకున్నారు. అలా ‘వెడ్డింగ్‌ డిజైన్‌ కంపెనీ’ రూపుదిద్దుకుంది. అలా మొదలైన ప్రయాణం... ప్రిన్స్‌ శివరాజ్‌ సింగ్‌, గాయత్రీదేవి, బాలీవుడ్‌, వ్యాపార, రాజకీయ ప్రముఖులతో సాగుతూనే ఉంది. దేశాన్ని దాటి డెస్టినేషన్‌ వెడ్డింగ్‌లనీ విజయవంతంగా పూర్తిచేస్తున్నారీమె.

సవాళ్లు దాటి...

పురుషాధిక్యరంగం... ఆమెకు వస్తువులు పంపడానికీ ఎవరూ ఇష్టపడలేదు. ఒక మహిళ కింద పనిచేయాలా అని పనివారూ వచ్చేవారు కాదు. అప్పుడు ప్రత్యేకంగా ‘ఆల్‌ విమెన్‌ టీమ్‌’ ఏర్పాటు చేసుకున్నారు వందన. ‘ఈవెంట్లు, పెళ్లిళ్లంటే అర్ధరాత్రి దాటుతుంది. అమ్మాయిల భద్రత మాటేంటని వాళ్ల తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి ఎదురయ్యేది. వారికి హామీ ఇవ్వడమే కాదు, స్వయంగా ఇంటి దగ్గర దింపే ఏర్పాట్లు చేసేదాన్ని. వీళ్లేం చేయగలరన్న టీమ్‌తోనే అంతర్జాతీయ బ్రాండ్లైన గుచి, ఫోర్డ్‌, ఛానెల్‌ వంటి సంస్థలు, రాజకుటుంబీకుల పెళ్లిళ్లు విజయవంతంగా నిర్వహించా’మని గర్వంగా చెబుతారీమె. 3డీ నమూనా, మాటపై నిలబడటం, ఒకసారి ఖర్చు అంచనా వేస్తే దాన్ని దాటకపోవడం వంటివాటి వల్లే రాణించడం సాధ్యమైందంటారు. దీనికోసం తొలిరోజుల్లో ఆర్కిటెక్చర్‌ గురించి ప్రత్యేకంగా తెలుసుకోవడం, సినిమాలు గమనించడం వంటివెన్నో చేశారట. ‘నేనెప్పుడూ ఫలానా వారికన్నా తక్కువ అని అనుకోలేదు. ఏ క్షణమైనా సమస్య ఎదురవుతుంది. దాన్ని పరిష్కరించడానికి సిద్ధంగా ఉండాలి అని మాత్రమే అనుకుంటా. కాబట్టే, ధైర్యంగా కొనసాగుతూ వచ్చా’ అంటారు. అన్నట్టూ దేశంలోనే తొలి మహిళా వెడ్డింగ్‌ ప్లానర్‌ ఈ వందనా మోహన్‌. ఆమె బాటలోనే కూతురు వేదిక కూడా సంస్థలో భాగమై పెళ్లిళ్లు నిర్వహిస్తోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్