ఖాళీగా ఉండొద్దనే... ఈ బిజీ బీ

సాధారణ విద్యార్థిని ఆమె... ఇలాగైతే ఏం సాధిస్తుందన్న అనుమానమే అందరిలో. కానీ ఆమెకు మాత్రం తనపై తనకు నమ్మకం. అది చాలు... ఏదైనా సాధించొచ్చని నమ్మడమే కాదు, అందరికీ నిరూపిస్తోంది హిమబిందు ఉడుతనేని.

Updated : 28 Mar 2024 03:10 IST

సాధారణ విద్యార్థిని ఆమె... ఇలాగైతే ఏం సాధిస్తుందన్న అనుమానమే అందరిలో. కానీ ఆమెకు మాత్రం తనపై తనకు నమ్మకం. అది చాలు... ఏదైనా సాధించొచ్చని నమ్మడమే కాదు, అందరికీ నిరూపిస్తోంది హిమబిందు ఉడుతనేని. ‘బిజీ బీ’ పేరుతో ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులను సంపాదించుకున్న ఆమె తన ప్రయాణాన్ని పంచుకుందిలా...

సొంతంగా ‘డే కేర్‌’ ప్రారంభించాలన్నది ఏళ్లనాటి కల. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట. నాన్న రైతు. పంటంతా అమ్మితేగానీ డబ్బు చేతికి రాదు. ఏడాది మధ్యలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందుల గురించి ప్రత్యేకంగా చెప్పాలా? దాంతో డిగ్రీ చాలా ఇబ్బందైంది. పైగా ఉండేది హైదరాబాద్‌లో హాస్టల్‌లో. అందుకే డేకేర్‌ సెంటర్‌లో పార్ట్‌టైమ్‌ ఉద్యోగంలో చేరా. ఆ వాతావరణం నన్ను ఆకర్షించింది. తరవాత మీడియాలో ప్రొడక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో చేసినా ఆ కల మాత్రం నా మనసులో నాటుకుపోయింది. కానీ డిగ్రీ పూర్తవడంతోనే పెళ్లైంది. మావారు గోపాలకృష్ణ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. వెంటనే బాబు పుట్టడంతో కెరియర్‌కి బ్రేక్‌ పడింది. వాడు కాస్త పెద్దయ్యాక వివిధ స్కూళ్లలో చేరి, వాటి పనితీరును గమనించా. ఇంతలో మావారికి అమెరికా వెళ్లే అవకాశమొచ్చింది. మళ్లీ ఖాళీ. మేమున్నచోట భారతీయులే ఎక్కువ. వాళ్ల పిల్లల్ని డేకేర్‌కి పంపిస్తోంటే అక్కడెలా ఉంటుందో తెలుసుకోవాలని అనిపించింది. పిల్లలతో ప్రవర్తన, ప్రత్యేక కరిక్యులమ్‌, తల్లిదండ్రులకు వారికి మధ్య అనుబంధం పెంచేతీరు వంటివన్నీ నచ్చాయి.

వద్దన్నారు..

భారత్‌కి తిరిగొచ్చాక ‘డేకేర్‌ ప్రారంభిస్తా’నంటే మావారు వద్దన్నారు. నేనప్పటికి ఏడో నెల గర్భిణిని మరి. నాకేమో ఇక ఆలస్యం చేయొద్దని! ఆలోచనని స్నేహితురాలు శిరీషతో పంచుకుంటే తనూ ముందుకొచ్చింది. అలా 2019లో హైదరాబాద్‌లో ‘బిజీ బీ’ ప్రారంభించాం. నెలలోపే విద్యార్థులొచ్చారు. ట్యూషన్‌, డ్యాన్స్‌, సంగీతాల్ని చేర్చాం. ఆదరణ ఎంత బాగా వచ్చిందంటే ఆరునెలల్లోనే మరో బ్రాంచినీ తెరవగలిగాం. అక్కడా తరగతులు ప్రారంభిద్దామనగా లాక్‌డౌన్‌. నిరాశగా సొంతూరుకి చేరుకున్నాం. బిజీ బీ ప్రారంభించిన కొత్తలో అమెరికాలో ఉండే స్నేహితురాలు వాళ్ల పాపకి ఆన్‌లైన్‌లో తరగతులు ఇప్పించమంది. తనే లాక్‌డౌన్‌లో మరికొందరు ఆన్‌లైన్‌ పాఠాలు అడుగుతున్నారు చెప్పగలవా అంది. ఆలోచన నచ్చి, సరేనన్నాం. అప్పటికే ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లెందరో. వాళ్లతో ఆన్‌లైన్‌ పాఠాలు మొదలుపెట్టాం. సంగీతం, పియానో, మ్యాథ్స్‌, హిందీతో ప్రారంభించాం. ఇప్పుడు అబాకస్‌, మెహెందీ, బేకింగ్‌, వీణ, వాయిస్‌ ఓవర్‌ ట్రైనింగ్‌... మొత్తం 40 అంశాలు నేర్పిస్తున్నాం. 60 మందికిపైగా టీచర్లున్నారు. పిల్లల కోసం కెరియర్‌లు పక్కన పెట్టిన మహిళలకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చా. ఉదయం 3.30 నుంచి రాత్రి 11 గం. వరకు బోధన సాగుతుంది. యూఎస్‌, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్‌, పారిస్‌, నెదర్లాండ్స్‌, సింగపూర్‌, మలేసియా, ఉగాండా, సౌదీ అరేబియా, స్టాక్‌హోమ్స్‌, యూకేల్లో స్థిరపడిన తెలుగు, తమిళం, కన్నడ వారికి బోధిస్తున్నాం. ఒక్కో విద్యార్థికి ప్రత్యేక తరగతులు... గూగుల్‌, జూమ్‌ మీట్‌ల్లో నిర్వహిస్తా. క్లాస్‌ పూర్తయ్యాక రివిజన్‌ కోసం ఆడియో రికార్డు, టెక్స్ట్‌ కూడా ఇస్తాం.

గర్వంగా ఉంటుంది.

నేర్చుకున్న దాన్ని ప్రదర్శిస్తేనేగా పిల్లలకీ ఉత్సాహం. అందుకని పండగలు, ప్రత్యేక దినాల్లో ఆన్‌లైన్‌లో పోటీలు నిర్వహిస్తుంటాం. నేను ఆన్‌లైన్‌ ఆర్‌జేని కూడా. వాటికి సెలబ్రెటీలని న్యాయనిర్ణేతలుగా పిలుస్తా. విజేతలకు బహుమతులు ఇస్తుంటాం. ఇప్పటికి కొన్ని వందల మంది విద్యార్థులకు బోధించాం. ప్రస్తుతం 300 మంది ఉన్నారు. మా ఇంట్లో బిట్స్‌ పిలానీ, ఐఐటీల్లో చదివినవారు, యూనివర్సిటీ టాపర్లున్నారు. నేనేమో డల్‌ స్టూడెంట్‌ని. అందుకని నేనేదైనా చెబుతున్నా అసలు పట్టించుకునేవారు కాదు. అప్పుడు నాన్న ‘గెలిచినవారి మాటే ప్రపంచం వింటుంది. నువ్వూ తక్కువ కాద’ని ప్రోత్సహించేవారు. అందుకే నేనేంటో నిరూపించాలని అనుకునేదాన్ని. ‘బిజీ బీ’తో ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులను సంపాదించుకోవడమే కాదు, ఎన్నో అవార్డులూ అందుకున్నా. అది చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. అందుకే చాలామందికి చదువొక్కటే మార్గం కాదు, ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రయత్నిస్తే ఎవరైనా రాణించొచ్చని సలహానిస్తుంటా.

 శనిగారపు సతీష్‌, భద్రాద్రి కొత్తగూడెం


అందుకే మరి..!

మ్మాయిలు గలగలా మాట్లాడేస్తూ ఉంటారు.. చెప్పేది పూర్తిగా వినరు... ఇవేగా మగవాళ్ల ఫిర్యాదులు. దీనికీ కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఫాక్స్‌పీ2 ప్రొటీన్‌ మహిళల్లో ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమట. అందువల్ల రోజులో స్త్రీ 20వేల పదాలు మాట్లాడితే, పురుషుడు 7వేల పదాలే పలుకుతాడట. అంటే- మగవారి కంటే స్త్రీ రోజులో 13వేల పదాలు ఎక్కువగా మాట్లాడగలదన్నమాట. అమ్మాయిలూ.. ఇంకెవరైనా మన మాటల గురించి ప్రశ్నిస్తే ఈ విషయం చెప్పేయండి మరి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్