మిణుకు తారల గుట్టువిప్పినా... గుర్తింపు లేదు!

జీవితమంతా పరిశోధనలకోసం ధారబోసినా... మహిళ అన్న కారణంగా గుర్తింపుకి నోచుకోని కథ సిసీలియా పేన్‌ది. 100 ఏళ్ల క్రితం ఆమె చేసిన పరిశోధనలే ఈ రోజుకీ ఆస్ట్రోఫిజిక్స్‌లో మనకి దారి చూపుతున్నాయంటే ఆశ్చర్యంగా ఉంది కదూ!

Published : 01 Apr 2024 01:35 IST

తొలి మహిళ

జీవితమంతా పరిశోధనలకోసం ధారబోసినా... మహిళ అన్న కారణంగా గుర్తింపుకి నోచుకోని కథ సిసీలియా పేన్‌ది. 100 ఏళ్ల క్రితం ఆమె చేసిన పరిశోధనలే ఈ రోజుకీ ఆస్ట్రోఫిజిక్స్‌లో మనకి దారి చూపుతున్నాయంటే ఆశ్చర్యంగా ఉంది కదూ!

నక్షత్రాలు... హైడ్రోజన్‌, హీలియం వాయువులతో నిండిన మండే అగ్నిగోళాలు అని మొదటిసారి నిరూపించిన శాస్త్రవేత్త సిసీలియా పేన్‌. కానీ అప్పటివరకూ శాస్త్రవేత్తలు నమ్మిన విషయం ఇందుకు పూర్తి విరుద్దంగా ఉంది. మన భూమిలానే నక్షత్రాలు కూడా మట్టి, ఆక్సిజన్‌తో నిండి ఉంటాయి అనుకున్నారు. దాంతో సిసీలియా పరిశోధనలకు కనీస గుర్తింపునివ్వలేదు. ఇంగ్లాండ్‌లో పుట్టిన ఈమె నాలుగేళ్లకే తండ్రిని పోగొట్టుకుంది. తల్లి పెంపకంలో కష్టపడి చదివింది. సైన్స్‌ అంటే మహా ఇష్టం. టీచర్లు మాత్రం ఆమెని సంగీతం, చిత్రలేఖనంవైపు ప్రోత్సహించారు. కారణం అప్పట్లో అమ్మాయిలూ సైన్స్‌ చదవొచ్చు అంటే నమ్మశక్యం కాని పరిస్థితి. అయినా సరే కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలో పట్టుదలగా క్వాంటమ్‌ ఫిజిక్స్‌ చదివింది. క్లాసంతా అబ్బాయిలే. ఒకే ఒక్క అమ్మాయి సిసీలియా. క్లాసు మొదలయ్యేటప్పుడు అలవాటుగా ప్రొఫెసర్‌గారు ‘డియర్‌ లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌’ అనడం, క్లాసులో ఉన్న అబ్బాయిలంతా పగలబడి నవ్వడం ఒక అలవాటుగా మారిపోయిందామెకు. ఎంత కష్టపడి చదివినా మహిళ అన్న వివక్ష కారణంగా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా మాత్రం ఇవ్వలేదు. దాంతో చదివిన చదువు వృథా పోకూడదని టీచర్‌గా పాఠాలు చెప్పేది సిసీలియా. ఇంతలో హార్వర్డ్‌ కాలేజీ అబ్జర్వేటరీని నడుపుతున్న హార్లో షాప్లీ అనే శాస్త్రవేత్త నుంచి ఆహ్వానం అందుకుని అమెరికా వెళ్లిపోయింది. అక్కడయినా ఆడవాళ్ల పరిశోధనలకు ఒక గుర్తింపు దక్కుతుందని ఆమె ఆశ. అక్కడ నక్షత్రాలు విడుదల చేసే కిరణాలను విశ్లేషించి వాటి స్వభావం తెలుసుకొనే అవకాశం వచ్చింది. ఆ సమయంలోనే అవి హైడ్రోజన్‌, హీలియంతో నిండి ఉన్నాయని గ్రహించి దానిపై పీహెచ్‌డీ చేసింది. కానీ ఇక్కడా తనకి గుర్తింపు రాలేదు.

అంత గొప్ప పరిశోధన చేసినా ఆమెని అక్కడ టెక్నికల్‌ అసిస్టెంట్‌ అని మాత్రమే పిలిచేవారు. తక్కువ జీతం ఇచ్చేవారు. కారణం అక్కడ తను ‘హార్వర్డ్‌ కంప్యూటర్స్‌’ అనే హోదాలో పనికి కుదిరింది మరి. కంప్యూటర్లు లేని ఆ కాలంలో నక్షత్ర దూరాలని లెక్కించడం అంత తేలికేం కాదు. ఆ లెక్కలు వేసి, అంత డేటాని భద్రపరచాలంటే చాలా ఓపిక కావాలి. మగవాళ్లకి అంత సహనం ఉండదు. పైగా ఆడవాళ్లకు తక్కువ జీతం ఇచ్చి ఎంత పని చేయమన్నా చేస్తారన్న కారణం చేతనే సిసీలియాకి ఉద్యోగం ఇచ్చాడు షాప్లీ. పోనీ పీహెచ్‌డీ పట్టా అయినా ఇచ్చారా అంటే హార్వర్డ్‌ నుంచి టెక్నికల్‌గా ఆమె ఈ పట్టానూ అందుకోలేకపోయింది. 56 ఏళ్ల వయసులో ప్రొఫెసర్‌ అని పిలిపించుకోగలిగింది. ఈ విషయాలన్నీ తన ఆత్మకథ ‘ది డయర్స్‌ హ్యాండ్‌’లో చెప్పుకొచ్చారామె. ఆరోజు మగ శాస్త్రవేత్తలు నిరాకరించిన ఆమె నక్షత్ర పరిశోధనల ఆధారంగానే మనం ఆధునిక ఆస్ట్రోఫిజిక్స్‌ పరిశోధనలు చేశాం. అందుకే సిసీలియా పేన్‌ని ఎప్పటికీ మరిచిపోలేం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్