ఏఐకే పాఠాలు చెబుతున్నా!

కొన్నిరోజుల క్రితం అమెజాన్‌ ఉద్యోగుల ఎంపిక కోసం ఏఐ (కృత్రిమమేధ)తో పనిచేసే ఒక హైరింగ్‌ టూల్‌ని వాడింది. పనులు చకచకా అయ్యాయి కానీ... ఆ ప్రాజెక్ట్‌లో అర్హత ఉన్నా అమ్మాయిలకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వలేదు. మరో సందర్భంలో అమెరికాలోని ఓ బీమా కంపెనీ ఏఐ సేవల్ని వినియోగించుకున్నప్పుడు... అక్కడి ఆఫ్రికన్‌- అమెరికన్‌ మహిళలకు ఎక్కువ ప్రీమియం ఛార్జీలు వేసింది.

Updated : 01 Apr 2024 04:31 IST

కొన్నిరోజుల క్రితం అమెజాన్‌ ఉద్యోగుల ఎంపిక కోసం ఏఐ (కృత్రిమమేధ)తో పనిచేసే ఒక హైరింగ్‌ టూల్‌ని వాడింది. పనులు చకచకా అయ్యాయి కానీ... ఆ ప్రాజెక్ట్‌లో అర్హత ఉన్నా అమ్మాయిలకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వలేదు. మరో సందర్భంలో అమెరికాలోని ఓ బీమా కంపెనీ ఏఐ సేవల్ని వినియోగించుకున్నప్పుడు... అక్కడి ఆఫ్రికన్‌- అమెరికన్‌ మహిళలకు ఎక్కువ ప్రీమియం ఛార్జీలు వేసింది. ఇదేం అన్యాయం? ఓ వైపు ప్రపంచమంతా ఏఐ వైపు అడుగులు వేస్తోంటే... దానికి మనమంటే చిన్నచూపెందుకు? సరిగ్గా ఇక్కడే... ‘రెస్పాన్స్‌బుల్‌ ఏఐ’ అవసరం ఉందని అంటున్నారు నీలిమా ఓబుగారి. ప్రపంచ దేశాలకు ఈ రకమైన సేవలందిస్తున్న ఆమె వసుంధరతో మాట్లాడారు...  

ప్రతిరోజూ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) వాడకం గురించి ఏదో ఒక వార్త వింటూనే ఉన్నాం. సంస్థలు కృత్రిమ మేధని వినియోగించుకోవడం మొదలుపెడితే మన ఉద్యోగాల సంగతేంటి అనే మీమాంస కూడా మొదలయ్యింది. కాసేపు మన ఉద్యోగాల సంగతి పక్కన పెడదాం. మీరు ఏదైనా సమాచారం కోసం చాట్‌ జీపీటీని వాడారా? అలా వాడినప్పుడు అది క్రోడీకరించి ఇచ్చే సమాధానం పూర్తిగా నిజం అనుకుంటున్నారా? లేదు.. కొన్ని లోపాలు ఉన్నాయి. ఏఐ మనిషిని అనుకరిస్తుంది కానీ మనిషిలా ఆలోచించదు. డేటా, అల్గారిథమ్‌ ఆధారంగా పనిచేసే ఏఐకి మనమిచ్చిన సమాచారమే ప్రాణం. మన సమాజంలో ముందు నుంచీ మగవాళ్లు ఎక్కువ చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, సంపాదిస్తున్నారు. ఆ డేటానే మనం ఏఐకి ఇస్తే అది మగవాళ్లకి మాత్రమే ఉద్యోగాలు కావాలి అనుకోవచ్చు. అమ్మాయిలు, అబ్బాయిలు సమానం అని దానికి తెలియదు. మరి భవిష్యత్తులోనూ ఏఐ ఆడవాళ్ల పట్ల ఇలాంటి చిన్నచూపే చూస్తే కష్టం కదా? దాన్ని సరిదిద్దే ప్రక్రియనే ‘రెస్పాన్స్‌బుల్‌ ఏఐ’ అంటారు. బెంగళూరు కేంద్రంగా ‘ఏఐ ఎన్స్యూర్డ్‌’ అనే సంస్థను స్థాపించి ఏఐ సేవల్లో లోపాలు లేకుండా చేస్తున్నాం. మనదేశంలోనే ఈ తరహా సంస్థ మొదటిది. ప్రస్తుతం మేం ఇన్ఫోసిస్‌, హెక్సావేర్‌ సంస్థలతో పాటు... యూఎస్‌, యూరప్‌, నార్వే, స్వీడన్‌, జర్మనీల్లోని మరికొన్ని సంస్థలతో కలిసి పనిచేస్తున్నాం. ఈ రంగంవైపు నా అడుగులు పడటానికి కారణం ఒక మహిళగా నేను ఎదుర్కొన్న సమస్యలే!

అమ్మగా ఆ కష్టం తెలుసు...  

నేను పుట్టి పెరిగింది మహబూబ్‌నగర్‌లో. అమ్మ సతీసులోచన, నాన్న శ్రీనివాసయ్య ఇద్దరూ ప్రొఫెసర్లు. జేఎన్‌టీయూలో బీటెక్‌ చేశా. ఆ తర్వాత పెళ్లైంది. మావారు శ్రీనివాస్‌ పద్మనాభుని ఇన్ఫోసిస్‌లో అసోసియేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌. నేను అప్పటికి ఐబీఎమ్‌లో పనిచేస్తున్నా. ప్రెగ్నెన్సీ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. నా ఆరోగ్య సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని అప్పట్లోనే ఐబీఎమ్‌ కొన్ని రోజులు ఇంటి నుంచి పనిచేసే అవకాశం ఇచ్చింది. కొన్ని నెలల తర్వాత తిరిగి సంస్థలో చేరితే... ఇంట్లో పాప ఏం చేస్తోందో అన్న బెంగ. ఇంట్లో ఉంటే ఇంతా చదివి ఖాళీగా ఉంటున్నానా అన్న ఆలోచన. ఇల్లూ, ఆఫీసూ సమన్వయం చేయలేక ఉద్యోగానికి సెలవు పెట్టేశా. రెండోపాప పుట్టిన కొన్ని రోజులకి తారాహ్‌ టెక్నాలజీస్‌ అనే సంస్థను స్థాపించి ఐటీ సేవలు అందించేదాన్ని. వర్క్‌ఫ్రమ్‌హోమ్‌ అనే మాట వాడుకలో రాకముందే మా ఉద్యోగులకు ఆ సదుపాయం కల్పించా. అప్పట్లో ఏ సెమినార్‌కి వెళ్లినా వర్క్‌ ఫ్రమ్‌ హోమా? అని విచిత్రంగా చూసేవారు. ఇప్పుడు అదెంత సహజంగా మారింది. జాన్‌హాప్కిన్స్‌ యూనివర్సిటీ నుంచి డేటా సైన్స్‌ స్పెషలైజేషన్‌ చేశాక నా జీవితం మలుపు తిరిగింది. అప్పుడే బిగ్‌ డేటా అనలిటిక్స్‌పై పనిచేశా.. అంటే పెద్ద పెద్ద సంస్థలు, ప్రాజెక్టులకు సంబంధించిన డేటాపై లోతుగా పనిచేయడం. అందులో భాగంగా ఉజ్జయిని కుంభమేళాలో భక్తుల రాకపోకల తీరుతెన్నులపై డ్రోన్స్‌ వంటి అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీని వాడి డేటాని తయారుచేసిచ్చా. ప్రస్తుతం మావారితో కలిసి ఏఐ ఎన్స్యూర్డ్‌ సంస్థని స్థాపించి.. ఏఐ ప్రొడక్ట్స్‌ని టెస్ట్‌ చేస్తున్నాం. చాలామంది ఏఐ వస్తే ఉద్యోగాలు పోతాయి కదా అంటున్నారు. కానీ టైప్‌ రైటర్లు పోయాక ఉద్యోగాలు తగ్గాయా... పెరిగాయా? కంప్యూటర్ల రాకతో ఉద్యోగాలు పెరిగాయి కదా? డ్రైవర్‌ లెస్‌ కార్లు వస్తే... డ్రైవర్‌ ఉద్యోగం ఉండకపోవచ్చు. కానీ... కారు రోడ్లపై పరుగులు పెట్టడానికి ఎంత డేటా కావాలి? అదంతా మనుషులే అందించాలి కదా! ఒక రకం ఉద్యోగాలు పోయినా మరొకరకం వస్తాయి. డేటా టాగింగ్‌ జాబ్స్‌లాంటివి పెరుగుతాయి. అందులో పారదర్శకతే మేం చేస్తున్న పని. ఇక  అవార్డులంటారా? హైసియా, సీఐఐ, ఎఫ్‌కేసీసీఐ వంటి సంస్థల నుంచి పురస్కారాలు అందుకున్నా. ఆసక్తి ఉన్నవారికి నా లింక్డిన్‌ వేదికగా ఏఐ పాఠాలు చెబుతున్నా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్