ధారా... విధిని జయించింది!

మంచం దిగాలంటే కాళ్లు తొడుక్కోవాలి. అలాగని రెండు చేతులూ ఉన్నాయా అంటే అవీ లేవు. ఒక్కచేయి సగమే మిగిలింది. మరో చేతికి వేళ్లూ లేవు. అయితేనేం... ఆమె ముఖంలో నవ్వు మాత్రం చెరగదు. తన పనులన్నీ తనే చేసుకుంటుంది... ఇంటిపనీ వంటపనీ చేస్తుంది... వీటన్నింటినీ మించి సోషల్‌మీడియా వేదికగా తన జీవితాన్నే చూపిస్తూ నిరాశానిస్పృహలతో ఉన్నవాళ్లలో స్ఫూర్తి నింపుతోంది.

Updated : 03 Apr 2024 07:56 IST

మంచం దిగాలంటే కాళ్లు తొడుక్కోవాలి. అలాగని రెండు చేతులూ ఉన్నాయా అంటే అవీ లేవు. ఒక్కచేయి సగమే మిగిలింది. మరో చేతికి వేళ్లూ లేవు. అయితేనేం... ఆమె ముఖంలో నవ్వు మాత్రం చెరగదు. తన పనులన్నీ తనే చేసుకుంటుంది... ఇంటిపనీ వంటపనీ చేస్తుంది... వీటన్నింటినీ మించి సోషల్‌మీడియా వేదికగా తన జీవితాన్నే చూపిస్తూ నిరాశానిస్పృహలతో ఉన్నవాళ్లలో స్ఫూర్తి నింపుతోంది... పేరు ధారా షా. విధి చేతిలో కీలుబొమ్మగా మారి... కన్నబిడ్డనీ అవయవాల్నీ కోల్పోయినా అంతులేని ఆత్మవిశ్వాసంతో అడుగులేస్తోన్న ధారా జీవిత కథ ఆమె మాటల్లోనే..!

మాది గుజరాత్‌లోని సావర్‌కుండ్లా. 2013లో సిద్ధార్థ్‌తో పెళ్లై అమెరికా వెళ్లా. అయిదేళ్లు సంతోషంగా గడిచాయి. నేను గర్భం దాల్చానని తెలిసినప్పటి నుంచి మా ఆనందానికి అంతులేదు. పుట్టబోయే బాబుకోసం ఊలుతో దుస్తులు అల్లా. వాడి కోసం ఇల్లంతా బొమ్మలతో నింపా.

ఆ సమయం రానే వచ్చింది... 2019 ఫిబ్రవరి... ఎలాంటి ఆరోగ్య సమస్యల్లేవు... ప్రసవానికి ఆనందంగా ఆసుపత్రికెళ్లాను. బాబు గురించిన ఎన్నో ఊహలతో లేబర్‌రూమ్‌లో అడుగుపెట్టాను. రోజంతా పురిటి నొప్పులు... పుట్టబోయే బాబును తలచుకుంటూ ఆ నొప్పుల్ని ఇష్టంగా భరించాను. బేబీ తల ఎంతకీ బయటకి రావడం లేదు... ఆపరేషన్‌ చేసి తీయాలన్నారు వైద్యులు. ఆ సమయంలో థియేటర్‌ ఖాళీ లేకపోవడంతో అర్ధరాత్రి తర్వాత బాబును బయటకు తీశారు. అప్పటివరకూ పడ్డ ప్రసవవేదన మర్చిపోయి... నా కొడుకు మాహిర్‌ను చూసుకున్నా. ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. తీవ్ర రక్తస్రావం కావడంతో స్పృహ కోల్పోయాను.

కోమాలో ఉన్నా...

ఎంతకీ రక్తస్రావం తగ్గకపోయేసరికి రెండు ఓవరీలూ గర్భాశయంలో కొంత భాగాన్నీ తొలగించాల్సి వచ్చింది. ఈలోపు గుండె కూడా ఆగిపోతే సీపీఆర్‌తో తిరిగి పనిచేసేలా చేశారట. నెమ్మదిగా కోమాలోకి వెళ్లిపోయా. ఊపిరితిత్తుల్లో నీరు చేరిందనీ, కిడ్నీలు ఫెయిల్‌ అయ్యాయనీ బతికే అవకాశం అయిదు శాతమే అని చెప్పారు వైద్యులు. మందులు ఆగకుండా ఎక్కిస్తుండటంతో ముందు కుడి చెయ్యి బిగుసుకుపోయింది. ‘ఫేషియాటమీ’ చేసి చేతివద్ద కొంత కణజాలం కట్‌ చేసి ప్రెషర్‌ను తగ్గించి, తిరిగి మందులెక్కించారు. ఆ మందుల ప్రభావంతో రక్తప్రసరణ సరిగ్గా జరగక... కాళ్లు, చేతుల్లో ఇన్ఫెక్షన్‌ మొదలైంది. అది శరీరమంతా పాకకుండా ఉండటానికి నా రెండు మోకాళ్ల కింది భాగాన్నీ తీసేశారు. కుడిచేయిని మోచేయి వరకే ఉంచారు. ఇక, ఎడమచేతి వేళ్లనీ అరచేతినీ తొలగించారు. కోమా నుంచి వారం రోజుల తర్వాత బయటకొచ్చా. నన్ను నేను చూసుకుని బిగుసుకుపోయా. ఏడుపు కూడా రాలేదు. అంత బాధలోనూ నా కొడుకు మాహిర్‌ను చూసుకుని ఆనందించా. వాడిని చేతుల్లోకి తీసుకోలేక, ఆకలి తీర్చలేక బాధతో విలవిల్లాడేదాన్ని. కానీ నా బాబు కోసం ఎలాగైనా బతకాలనుకున్నా. అందుకోసం శక్తినంతా కూడదీసుకుని ధైర్యం తెచ్చుకునేదాన్ని.

మళ్లీ నడవడం నేర్చుకున్నా!

అయితే ఆ ధైర్యం ఎంతోకాలం లేదు. మాహిర్‌కు జెనిటిక్‌ డిజార్డర్‌ ఉందన్నారు. అప్పటికీ వాడిమీద ఆశ చావలేదు. ఈలోగా మరో పిడుగుపాటు... వాడెంతో కాలం బతకడని చెప్పారు.

షాక్‌ మీద షాక్‌...  నాకే ఎందుకీ కష్టాలని ఆ దేవుణ్ణి నిందిస్తూ వెక్కివెక్కి ఏడ్చా. మావారు ఎంతో అండగా నిలిచారు. ఇంటికి వచ్చాక ఆయనిచ్చిన ధైర్యంతో పట్టుదలగా ఎంత కష్టమైనా ఫిజియోథెరపీ చేసేదాన్ని. బాబుతో వీలైనంత ఎక్కువ సమయాన్ని గడిపేదాన్ని. ఏడాదిలోపే మాహిర్‌ మాకు దూరమయ్యాడు. ఆ దుఃఖం నుంచి ఓ పట్టాన బయటపడలేకపోయా. ఈలోగా కృత్రిమ కాళ్ల ఏర్పాటుతో తిరిగి నడవడం, మావారి సాయంతో నా పనులు నేను చేసుకోవడం నేర్చుకున్నా. అందరూ చిన్నప్పుడు ఒక్కసారి నేర్చుకునే నడవడం, రాయడం వంటివన్నీ నా జీవితంలో రెండుసార్లు చేశా. అక్కడితో ఆగలేదు. మారథాన్‌లో పాల్గొన్నా. అందుకోసం నెలలపాటు సాధనచేశా.

చాలామంది చిన్న సమస్యలనే తీరని కష్టాలనుకుంటారు. భవిష్యత్తు శూన్యమనుకుంటారు. భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. అటువంటివారికి నా గురించి చెప్పాలనిపించి 2022లో ‘ధారాస్‌వండర్‌లైఫ్‌’ యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించా. సమస్య ఎంత పెద్దదైనా దాంతో పోరాడి జీవించాలే కానీ కుంగిపోకూడదు’ అంటూ అందరిలో స్ఫూర్తిని కలిగించే ప్రయత్నం చేస్తున్నా... ఆ వీడియోలు చూసి నా గురించి తెలుసుకున్న నీతా అంబానీ తను నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ మ్యాగజీన్‌ ‘హర్‌ సర్కిల్‌’ తరఫున నన్ను ముంబయికి ఆహ్వానించారు. అందులో ‘ఎవ్రీబడీ ప్రాజెక్టు’కు పనిచేసే అవకాశాన్నివ్వడం సంతోషంగా అనిపించింది. జీవితంలో ఎన్నో కష్టాలు దాటుకుని నిలబడిన వారిని కలుసుకునే గొప్ప అవకాశం నాకిలా దక్కింది. ఇదీ క్లుప్తంగా నా కథ!


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్