ఈ అడవి అమ్మకానికి కాదు!

మగవాళ్లు యుద్ధానికి వెళ్తే... ఆడవాళ్లు ఇంటికి కావలి కాస్తారు. అలాంటప్పుడు ఎంతటి త్యాగానికైనా వెనుకాడరు. ఇది వారోనీ తెగ వంశాచారం. ఇప్పుడు మగవాళ్లు బడా కార్పొరేట్‌ సంస్థలతో యుద్ధం చేయలేక చతికిలబడితే... ఆ తెగ ఆడబిడ్డ నీమోంటే నెన్‌క్విమో వాళ్లుంటున్న అమెజాన్‌ అడవిని కాపాడుకొనే బాధ్యత తీసుకుంది.

Updated : 04 Apr 2024 02:19 IST

మగవాళ్లు యుద్ధానికి వెళ్తే... ఆడవాళ్లు ఇంటికి కావలి కాస్తారు. అలాంటప్పుడు ఎంతటి త్యాగానికైనా వెనుకాడరు. ఇది వారోనీ తెగ వంశాచారం. ఇప్పుడు మగవాళ్లు బడా కార్పొరేట్‌ సంస్థలతో యుద్ధం చేయలేక చతికిలబడితే... ఆ తెగ ఆడబిడ్డ నీమోంటే నెన్‌క్విమో వాళ్లుంటున్న అమెజాన్‌ అడవిని కాపాడుకొనే బాధ్యత తీసుకుంది. సోషల్‌మీడియాలోనూ ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్న ఈ అడవిబిడ్డ ప్రపంచానికే ఆదర్శం ఎలా అయ్యిందంటే... 

వారోనీలు ఆదివాసీలు. అమెజాన్‌లోని ఈక్వెడార్‌ ప్రాంతం వీరి ఆవాసం. ఐదువేలమంది మాత్రమే ఉండే ఈ తెగ గురించి బయట ప్రపంచానికి కొన్నేళ్ల క్రితం వరకూ తెలియదు. కానీ మూడేళ్ల క్రితం నీమోంటే ఆధ్వర్యంలో జరిగిన ఓ న్యాయపోరాటం వీళ్ల సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసేలా చేసింది. జీవవైవిధ్యం అధికంగా ఉండే ఈక్వెడార్‌ అడవిలోకి కార్పొరేట్‌ కంపెనీలు అడుగుపెట్టి, ఆయిల్‌ని తోడితీస్తూ... ఆ వ్యర్థాలను నదుల్లో కలిపేయడం, స్థానిక యాసూనీ పార్క్‌ని నాశనం చెయ్యడం నీమోంటే భరించలేకపోయింది. దాన్ని వ్యతిరేకిస్తూ... స్థానిక ఆదివాసీ జాతులని కలుపుకొని అమెజాన్‌ ఫ్రంట్‌లైన్స్‌ అండ్‌ సిబో అలయెన్స్‌ పేరుతో పర్యావరణ పరిరక్షణ సంస్థని స్థాపించింది. ఆ ఆయిల్‌ కంపెనీపై కోర్టులో కేస్‌ వేసి ఐదు లక్షల ఎకరాల అడవిప్రాంతాన్ని తిరిగి సాధించుకుంది. ‘ఈ భూమిని ఎన్నో ఏళ్లుగా ఆదిమజాతులే కాపాడుకుంటున్నాయి. అలాంటిది మా అనుమతి లేకుండా ఏ కంపెనీ అయినా ఎలా ఆక్రమిస్తుంది? ‘అవర్‌ రెయిన్‌ ఫారెస్ట్‌ ఈజ్‌ నాట్‌ ఫర్‌ సేల్‌’ అంటూ పెద్ద ఎత్తున డిజిటల్‌ క్యాంపెయిన్‌ మొదలుపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా 3,78,000 సంతకాలని సేకరించి ప్రజల మద్దతు కూడదీసుకుంది. ‘చాలామంది ఆ ఆకులు, అలములు ఉండే అడవికోసం ఎందుకింత ఆరాటం అంటారు. నాదో ప్రశ్న. మీ ఇల్లు అంటుకుపోతే చూస్తూ ఊరుకుంటారా? గబుక్కున వెళ్లి నీళ్లు పోస్తారు కదా! నాదీ అటువంటి ప్రయత్నమే. 1950 ముందు యూరోపియన్‌ మిషనరీలు ప్రవేశించనంత వరకూ మా జీవితాలు బాగానే ఉండేవి. మా తాతయ్య ఈ తెగ నాయకుడు. ఆయనిచ్చిన వారసత్వమే ఈ పోరాటం. మీకు మీ వీధుల్లోంచి వెళ్తుంటే ఎక్కడ ఏ దుకాణం ఉందో తెలుసు. అలాగే మాకీ అడవిలో ఎక్కడ ఏ మొక్క ఉందో తెలుసు. ఎలాంటి జబ్బునైనా నయం చేసే ఔషధ చెట్లు ఉంటాయి. అవే మాకు ఫార్మసీ దుకాణాలు. సరకుల్ని అందించే కిరాణాకొట్లు. ఆకలి తీర్చే రెస్టరంట్లు. జోలపాడి నిద్రపుచ్చేదీ ఆ చెట్లే. అవేమాకు జిమ్‌లు, పార్క్‌లు, బ్యూటీపార్లర్లు. ఏ సమయానికి ఏ చెట్టు పూతకొస్తుందో, అది మా అందాన్ని ఎలా పెంచుతుందో మాకంటే ఎవరికి బాగా తెలుసు. అవసరార్థం ఒక చెట్టుని కొట్టాలన్నా.. ఆ చెట్టు ముందో పాట పాడతాం. దానికి  క్షమాపణ చెప్పిన తర్వాతే కొడతాం. అంతలా మాకు అడవితో అనుబంధం ఉంది. ఈ నేల అడుగున ప్రవహిస్తున్న చమురుని మా పూర్వికుల రక్తంలా భావిస్తాం. సమాధులు తవ్వుకుని ఆ రక్తాన్ని వాడుకొనే అవసరం మాకెప్పటికీ ఈ అడవి తల్లి రానివ్వదు. అందుకే మా ఈ పోరాటం’ అనే నీమోంటే 2020లో గోల్డ్‌మెన్‌ ప్రైజ్‌ని గెల్చుకుంది. అదే ఏడాది ‘టైమ్‌’ మ్యాగజీన్‌ ముఖచిత్రమైంది. ఇప్పుడు ఇన్‌స్టా వేదికగా కొన్ని లక్షలమంది అభిమానాన్ని చూరగొని గ్రీన్‌ వారియర్‌గా పచ్చదనాన్ని కాపాడుకొనే స్ఫూర్తిని రగిలిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్