ఆ గనిలో వెయ్యి మంది... అందులో నేనొక్కదాన్నే!

ఏసీ గదుల్లో కొలువులు, బ్రాండెడ్‌ దుస్తులూ, డిజిటల్‌ గ్యాడ్జెట్లూ, వారాంతాల్లో విహారయాత్రలు... ఇదే మా స్టైల్‌ అంటోంది ఈతరం. కానీ, హైదరాబాద్‌కి చెందిన బండి గాయత్రి... మాత్రం బిందాస్‌గా గడిపే ఉద్యోగాల్ని కాదనుకుని... మగవాళ్లు సైతం కష్టంగా భావించే భూగర్భ   గనిలో కొలువుని ఎంచుకుంది. 114 ఏళ్ల టాటా స్టీల్‌ చరిత్రలో ఈ అవకాశాన్ని దక్కించుకున్న మొదటి మహిళగా గుర్తింపు పొందింది.

Updated : 05 Apr 2024 14:33 IST

ఏసీ గదుల్లో కొలువులు, బ్రాండెడ్‌ దుస్తులూ, డిజిటల్‌ గ్యాడ్జెట్లూ, వారాంతాల్లో విహారయాత్రలు... ఇదే మా స్టైల్‌ అంటోంది ఈతరం. కానీ, హైదరాబాద్‌కి చెందిన బండి గాయత్రి... మాత్రం బిందాస్‌గా గడిపే ఉద్యోగాల్ని కాదనుకుని... మగవాళ్లు సైతం కష్టంగా భావించే భూగర్భ గనిలో కొలువుని ఎంచుకుంది. 114 ఏళ్ల టాటా స్టీల్‌ చరిత్రలో ఈ అవకాశాన్ని దక్కించుకున్న మొదటి మహిళగా గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా ఆమెతో వసుంధర ముచ్చటించింది.

ఏ పని చేసినా నాదైన ప్రత్యేకత ఉండాలనుకోవడం చిన్నప్పటి నుంచీ అలవాటు. అందుకే సంప్రదాయ చదువునీ, కొలువుల్నీ వద్దనుకున్నా. నాన్న కెప్టెన్‌ బండి వేణు సైన్యంలో పనిచేసి పదవీ విరమణ తీసుకున్నారు. అమ్మ తారక జేపీ మోర్గాన్‌ అండ్‌ ఛేజ్‌లో వైస్‌ ప్రెసిడెంట్‌. అక్క ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ రంగంలో స్థిరపడింది. ఫిజిక్స్‌, మ్యాథ్స్‌పై ఉన్న ఇష్టంతో నేను డేటా సైన్స్‌లో నైపుణ్యం సాధించా. పలు హ్యాక్‌థాన్‌లలో బహుమతులెన్నో అందుకున్నా. ఈ రంగంలో పలు ఉద్యోగావకాశాలు వచ్చాయి. కానీ, నా లక్ష్యం ఇది కాదు

కాలు విరిగినా పరీక్ష రాసి...

చిన్నప్పటి నుంచీ ఏది పాడైనా మరమ్మతులు చేసేదాన్ని. అది చూసి అమ్మ... నువ్వు పెద్దయ్యాక మెకానికల్‌ ఇంజినీర్‌వి అవుతావు అనేది. కానీ, అందరి అంచనాలకూ దూరంగా నేను మైనింగ్‌ ఇంజనీరింగ్‌లో కెరియర్‌ని వెతుక్కున్నా. హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్లో ప్లస్‌టూ వరకూ చదివా. దాంతో పాటు క్రీడలూ, సాంస్కృతిక విభాగాల్లోనూ నన్ను నేను నిరూపించుకోవాలని తపన పడేదాన్ని. లాన్‌టెన్నిస్‌తో పాటు కర్ణాటక సంగీతంలోనూ పట్టు సాధించా. పన్నెండు తరవాత ఉన్నత చదువులకోసం పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యే సమయంలో అనారోగ్యం వెంటాడింది. దాంతో ఇంట్లోనే ఉండి సొంతంగా ప్రిపేరయ్యా. తీరా జేఈఈ పరీక్ష రాసే సమయానికి కాలు విరిగింది. అయినా సరే, బాధని పంటిబిగువున భరిస్తూ పరీక్షకు హాజరవ్వాలని నిర్ణయించుకున్నా. నా కష్టం వృథాపోలేదు. మంచి ర్యాంకు సాధించి వారణాసిలోని ఐఐటీ బీహెచ్‌యూలో మైనింగ్‌ ఇంజినీరింగ్‌లో చేరా. అక్కడా అమ్మాయిల సంఖ్య తక్కువే.  తరచూ అక్కడి అధ్యాపకులు మీరీ చదువుతో భవిష్యత్తులో విదేశాలకు వెళ్లి జాబ్‌లు చేస్తారని అనేవారు. కానీ, నేనందుకు విరుద్ధమని చెప్పాలనుకునేదాన్ని. మాటలతో కంటే దాన్ని ఆచరణలో పెట్టి చూపించాలని నిర్ణయించుకున్నా. ఐఐటీ ఐఎస్‌ఎమ్‌ ధన్‌బాద్‌ నుంచి ప్రతిష్ఠాత్మక చాణక్య టెక్స్‌మిన్‌ ఫెలోషిప్‌ దక్కించుకున్నా. ఇది మైనింగ్‌లో హైపర్‌ స్ప్రెక్ట్రల్‌ ఇమేజెస్‌పై పరిశోధన చేసే దిశగా నన్ను నడిపించింది.

వింటారో లేదోనని భయపడ్డా...

ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో చదివిన వారంతా ఏసీగదుల్లో ఉద్యోగం చేస్తుంటే నువ్వెందుకు మైనింగ్‌ ఇంజినీరింగ్‌లోకి అడుగు పెట్టావని చాలామంది అడుగుతూ ఉంటారు. కష్టానికి భయపడితే... ఎదగలేం. దేశ భవిష్యత్తునీ ఊహించలేం. అమ్మాయిలు అరుదుగా ఉన్న రంగాల్లో ఇదీ ఒకటని తెలిసి ముందడుగు వేశా. బీటెక్‌ అయ్యాక టాటా స్టీల్‌లో ఉద్యోగంలో చేరా. మొదట ఆరు నెలలు నోవాముండీలోని ఓపెన్‌ కాస్ట్‌ మెటల్‌ మైన్స్‌లో పనిచేశా. తరవాత ఝరియాలోని అండర్‌గ్రౌండ్‌ కోల్‌ మైన్స్‌లో పనిచేసే అవకాశం లభించింది. అయితే, ఆడపిల్ల భూగర్భగనిలో పనిచేయడం కష్టమేమో అన్న మాటలు చెవిన పడినా నేను మాత్రం వెనక్కి తగ్గలేదు. గత 114 ఏళ్లలో ఒక్క మహిళా ఇంజినీరూ అక్కడ పనిచేయలేదనీ, నేనే మొదటి దాన్ననీ సంస్థ ప్రకటించడం భలే సంతోషంగా అనిపించింది. మొదట్లో అక్కడివారు ఆడపిల్లనైన నా మాట వింటారా? భద్రతా పరంగా ఏమైనా ఇబ్బందులొస్తాయా... లాంటివెన్నో సందేహాలు. కానీ ఉన్నతాధికారులు నన్నెంతగానో ప్రోత్సహించారు. మొదట నేను నా విధుల్ని మాత్రమే నిర్వర్తిస్తున్నా అనుకున్నా... నా తరవాత ఈ రంగంలో అడుగుపెట్టే మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నా అనే విషయం అర్థమైంది.

అంత సులువేం కాదు...

మైనింగ్‌లో ఉద్యోగం అంత సులువేం కాదు. భూగర్భగనిలో 500 మీటర్ల లోతులో పనిచేయాలి. చిమ్మ చీకటి. ఏ పైకప్పు ఎప్పుడు కూలుతుందో తెలియదు. పైగా ఝరియా మైన్స్‌లో గ్యాస్‌ ఆవరించి ఉండటం వల్ల లోనికి డిజిటల్‌ పరికరాలు కానీ, ఫోన్లూ, వాచ్‌లు వంటివేవీ తీసుకెళ్లడానికి లేదు. ఇక్కడ అత్యధిక ఉష్ణోగ్రతలతోపాటు 90-100 శాతం హ్యుమిడిటీ ఉంటుంది. ఇలాంటి చోట రోజంతా నడుస్తూనే విధులు నిర్వర్తించాలి. కొన్నిసార్లు బరువుల్నీ మోయాలి. దేనికీ వెనుకాడని తత్వమే నన్ను ధైర్యంగా ముందడుగు వేసేలా చేసింది. అయినా కొత్తల్లో ఆస్తమా, గాయాలు... మరెన్నో అనారోగ్యాలు ఇబ్బంది పెట్టాయి. వీటన్నింటినీ గుర్తించి శారీరకంగానూ దృఢత్వాన్ని పెంచుకుంటూ, అన్ని సమస్యలనూ సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నా. ఆరంభంలో 300 మందిలో ఒకరిగా పనిచేయడం మొదలుపెట్టిన నేను... ఇప్పుడు 1000 మంది పనిచేస్తోన్న కీలక విభాగంలో కొన్ని బాధ్యతలు తీసుకున్నా. ముఖ్యంగా గనిలోని వస్తువుల రవాణా, ట్రాక్‌లైన్‌, షాఫ్ట్‌ డ్రెస్సింగ్‌ వంటివాటిని చూసే కొద్దిమందిలో నేనొకదాన్ని. నా స్నేహితుల్లా నేను ఏసీ గదుల్లో పనిచేయకపోయినా... సామాజిక మాధ్యమాల్లో గడిపేయలేకపోయినా సంతృప్తిగా పనిచేయగలుగుతున్నా. అమ్మాయిలు చేయలేని పనులంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండవు. ఇష్టంగా చేసే పని ఏదైనా కష్టమనిపించదు. ఇందుకు నేనే ఉదాహరణ.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్