ఆమె లేకపోతే... మెసేజ్‌ల్లేవ్‌!

లాక్‌డౌన్‌లో... ఇంటి నుంచి పని చేసే వీలు లేకపోయి ఉంటే? పిల్లలకు ఆన్‌లైన్‌ చదువులకు ఆస్కారమే లేకపోతే! ఎంత వెనకబడే వాళ్లమో కదా? జూమ్‌ కనిపెట్టి, స్కైప్‌, గూగుల్‌ మీట్‌ వంటివాటికీ కారణమై ఇవన్నీ సాధ్యమయ్యేలా చేసిందో మహిళ అని తెలుసా? ఆవిడే మరియన్‌ క్రూక్‌.

Published : 07 Apr 2024 01:47 IST

లాక్‌డౌన్‌లో... ఇంటి నుంచి పని చేసే వీలు లేకపోయి ఉంటే? పిల్లలకు ఆన్‌లైన్‌ చదువులకు ఆస్కారమే లేకపోతే! ఎంత వెనకబడే వాళ్లమో కదా? జూమ్‌ కనిపెట్టి, స్కైప్‌, గూగుల్‌ మీట్‌ వంటివాటికీ కారణమై ఇవన్నీ సాధ్యమయ్యేలా చేసిందో మహిళ అని తెలుసా? ఆవిడే మరియన్‌ క్రూక్‌. అంతెందుకు, దూరంగా ఉన్న స్నేహితులతోనైనా, ఆత్మీయులతోనైనా ఒక మెసేజ్‌, వీడియో కాల్‌, గ్రూప్‌ కాల్‌ వగైరాలతో దగ్గరైపోతున్నాం. ఈ సేవలన్నీ మనం అలవోకగా ఉపయోగించుకుంటున్నాం. కానీ... అసలు ఇదొకటి సాధ్యం చేయొచ్చని కలలో కూడా ఊహించని సమయంలో వీటి సృష్టికి తపించారు మరియన్‌.

ఈవిడది న్యూయార్క్‌. సైన్స్‌పై కూతురికి ఆసక్తి కలిగించాలని ఆమె నాన్న తన కోసం ప్రత్యేకంగా ఓ కెమిస్ట్రీ సెట్‌ని రూపొందించి ఇచ్చారట. అదే ఆవిడను స్టెమ్‌ రంగంవైపు నడిపింది. క్వాంటిటేటివ్‌ అనాలిసిస్‌ అండ్‌ సైకాలజీలో పీహెచ్‌డీ చేశారు. సాంకేతికత మానవ జీవితాలపై ఎలా సానుకూల ప్రభావం చూపగలదో తెలుసుకోవడానికని ‘బెల్‌’ హ్యూమన్‌ ఫ్యాక్టర్స్‌ డివిజన్‌లో చేరారు. అక్కడామె ఇప్పుడు మనం ఒకరికొకరం పంపించుకుంటున్నామే... టెక్స్ట్‌ మెసేజ్‌లు వాటిపై పనిచేశారు. అప్పట్లో టెక్స్ట్‌ రూపంలో డేటాని పంపడం పెద్ద సవాలే. దాన్ని సులభతరం చేయాలనుకున్నారు. డిజిటల్‌ కమ్యూనికేషన్‌... వాయిస్‌, టెక్స్ట్‌, వీడియో ద్వారా సమాచారాన్ని చేరవేసే మార్గాల కోసం ప్రయత్నించారు. నల్లజాతి, పైగా మహిళ... తోటివారు ఆమెపై నమ్మకం చూపకపోగా ‘ఇదేమైనా బొమ్మలాట అనుకుంటున్నావా’ అని హేళన చేశారు. ‘నా చుట్టూ ఉన్న ప్రపంచంలో సానుకూల మార్పు తీసుకురావాలి’ అనే ఆలోచించేవారట మరియన్‌. అదే ఆమెకు సాధించి తీరాలన్న ప్రేరణనిచ్చేది. దానికితోడు ఆమె పట్టుదలను చూసి ఏటీ అండ్‌ టీ (బెల్‌ అనుబంధ సంస్థ) తోడుగా నిలిచింది. దీంతో ఐపీ, వాయిస్‌ నెట్‌వర్క్‌ బృందాలను కలిపి 2000 మందికి పైగా ఇంజినీర్లతో కలిసి ప్రయోగాలు చేశారామె. దాని ఫలితమే వీఓఐపీ (వాయిస్‌ ఓవర్‌ ఇంటర్నెట్‌ ప్రొటోకాల్‌). ఎస్‌ఎంఎస్‌, ఎంఎంఎస్‌, ఫ్యాక్స్‌, వాట్సప్‌, స్కైప్‌, మెసెంజర్‌, బీపీఓ సేవలు, ఆన్‌లైన్‌ మెసేజ్‌ ట్రాన్సాక్షన్లు... ఇలా చెప్పుకొంటూ పోతే ఇప్పుడు మన పనుల్ని సులభతరం చేస్తున్న ఎన్నో సేవలు ఆమె చలవే. తర్వాత గూగుల్‌కి మారిన మరియన్‌ భారత్‌లో రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై, ఆఫ్రికాలో బ్రాడ్‌బాండ్‌ సేవలు వంటివాటికీ కారణమయ్యారు. గూగుల్‌ వైస్‌ప్రెసిడెంట్‌ హోదాకి ఎదిగారు. ఈక్రమంలో ఆమె అందుకున్న పురస్కారాలూ ఎన్నో. విమెన్‌ ఇన్‌ టెక్నాలజీ ఇంటర్నేషనల్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌, అమెరికా నేషనల్‌ ఇన్వెంటర్స్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ల్లో స్థానం సంపాదించారు. ఆ ఘనత సాధించిన రెండో నల్లజాతీయురాలీమె. అన్నట్టూ ఈవిడ పేరిట 200 పేటెంట్‌లు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్