ఆ పర్యటనలు... పిల్లల కోసం..!

అదో కీకారణ్యం... గుబురుగా ఉన్న చెట్ల మధ్యలో ఓ మంచె మీద పదిమంది చిన్నారులు... ఊపిరి బిగపట్టి మరీ చుట్టూ చూస్తున్నారు. అప్పుడు కనిపించిందో పులి. దాన్ని చూసి వాళ్లేమీ ఎగిరి గంతులేయలేదు. నిశ్శబ్దంగా చూస్తూ ఆనందిస్తున్నారు.

Published : 07 Apr 2024 01:48 IST

అదో కీకారణ్యం... గుబురుగా ఉన్న చెట్ల మధ్యలో ఓ మంచె మీద పదిమంది చిన్నారులు... ఊపిరి బిగపట్టి మరీ చుట్టూ చూస్తున్నారు. అప్పుడు కనిపించిందో పులి. దాన్ని చూసి వాళ్లేమీ ఎగిరి గంతులేయలేదు. నిశ్శబ్దంగా చూస్తూ ఆనందిస్తున్నారు.

ఆ అడవిలోనే గలగలపారే ఓ సెలయేరు... అందులోని చిన్న చిన్న చేపల్ని చూస్తూ కేరింతలు కొడుతున్నారు కొందరు చిన్నారులు. ఇందాక మంచెపై ఉన్నదీ వీళ్లే... అయినా ఎంత తేడా. దీనంతటికీ కారణం దిశ. ఎక్కడ మౌనంగా ఉండాలో ఎక్కడ ఆడాలో వాళ్లకు తెలియచెప్పడమే కాదు. ‘అడ్వెంచర్స్‌ ఆఫ్‌ ఏ2డీ2’ పర్యటనలతో పిల్లలకి ప్రకృతిపట్ల ప్రేమనీ అవగాహననీ కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అదెలానో చూద్దామా..!

ఎత్తైన మంచుపర్వతాలు, అడవులు, వన్యప్రాణులను పుస్తకాల్లో చూపిస్తే సరిపోదంటారు దిల్లీకి చెందిన దిశాచోప్రా. మైదానాలు, పార్కులకు వారిని పరిమితం చేయకుండా ప్రకృతిలోని అందాలను, ప్రాణులను పరిచయం చేయాలంటారీమె. ఈ ఆలోచనే టూరిజంలో కొత్త కోణాన్ని స్పృశించేలా చేసింది. చిన్నప్పటి నుంచి సాహసాలంటే ఇష్టం. జర్నలిస్టుగా పనిచేసిన అనుభవం ఉందీమెకు. పెళ్లై పిల్లలు పుట్టిన తరవాత కూడా పర్యటనలు, సాహసాలపై ఆసక్తి తగ్గలేదు సరికదా.. మరింత పెరిగింది. ‘నా అభిరుచిని మా పిల్లలకూ అందించాలనిపించి సాహసయాత్రకు బయలుదేరాం. నాకన్నా ఎక్కువగా పిల్లలు ప్రయాణాన్ని ఎంజాయ్‌ చేయడం చూసి ఆశ్చర్యపోయా. వాళ్ల ఉత్సాహాన్ని చూసినప్పుడు వారిలాంటి చిన్నారులకూ ఈ అనుభూతిని దగ్గర చేయాలనిపించింది. ఓ బ్లాగు ప్రారంభించి టూర్స్‌ అనుభవాలను పొందుపరిచేదాన్ని. అలా కొందరికైనా దీనిపై ఆసక్తి కలుగుతుందని...’ అంటారీమె.

అది చూశాకే...

అటవీప్రాంతంలో ప్రకృతితో కలిసి జీవించే ఓ కుటుంబంపై తీసిన ‘కెప్టెన్‌ ఫెంటాస్టిక్‌’ సినిమా దిశనెంతో ఆకట్టుకుంది. ముఖ్యంగా వారి జీవనశైలి తనని బాగా ఆకర్షించింది. ‘ఆ ప్రభావంతో 2019లో ఓ అడ్వెంచర్‌ పేజీని తెరిచా. మావారు అరుష్‌, నాపేరు దిశా- అలాగే మా పిల్లలు అమర్‌, దినైరా పేర్లలోని మొదటి అక్షరాలతో ఇద్దరు-ఇద్దరు అనే అర్థం వచ్చేలా మా పేజీకి ‘అడ్వెంచర్స్‌ ఆఫ్‌ ఏ2డీ2’ అని నామకరణం చేశా. పర్యటకంపై ప్రతి ఒక్కరికీ ఆసక్తి కలిగించే ప్రయత్నమే ఈ పేజీ. అంతేకాదు, పర్యావరణ పరిరక్షణపై అవగాహన రావాలంటే అందరూ పర్యటించాల్సిందే. అప్పుడే ప్రకృతికి మనం కూడా ఏదైనా తిరిగి ఇవ్వగలం. అందుకే నావంతుగా మా పిల్లలతో కలిసి అటవీప్రాంతాల్లో చేసిన సఫారీ, ట్రెక్కింగ్‌, మంచుపర్వతాలపై సాహసాలు వంటివన్నీ పేజీలో పొందుపరిచేదాన్ని. వీటి ద్వారా కుటుంబసమేతంగా అడవుల్లో సఫారీలకెళ్లడం కష్టమైన విషయం కాదని అందరికీ తెలియాలని, ఈ విశేషాలు కొందరికైనా స్ఫూర్తి కలిగించాలని భావించా’ అంటోంది దిశ.

ఆ ఆలోచనే...

విదేశీ టూర్లకు తరచూ వెళ్లేవారు ఆమె పేజీకి స్పందించి, మన దేశంలో పర్యటకప్రాంతాల గురించి సమాచారమివ్వాలని అడిగేవారట. అప్పుడు ఆమెకొచ్చిన ఆలోచనే... పిల్లల కోసం పర్యటనలు. ‘అవును, పేజీకే సమాచారాన్ని ఎందుకు పరిమితం చేయాలి, ఆసక్తి ఉన్నవారిని మనతోపాటు టూర్స్‌కు తీసుకెళ్లొచ్చు కదా అనిపించింది. అదే విషయం మావారితో చెబితే మంచి ఆలోచన అన్నారు. పేజీలో ఆయా ప్రాంతాల వివరాలు అందించి టూర్‌ గురించి సమాచారం ఇవ్వడం, ఆసక్తి ఉన్నవారిని పర్యటకానికి తీసుకెళ్లడం ప్రారంభించాం. మా బృందాలతోపాటు ప్రకృతి పరిరక్షకులూ ఉంటారు. వన్యప్రాణుల వల్ల మనకు కలిగే ప్రయోజనాలను వారి నుంచి పిల్లలు తెలుసుకుంటారు. వృక్షజాతిపై అవగాహన పెంచుకుంటారు. అలాగే అడవుల్లోని గిరిజన ప్రాంతాల్లోని పాఠశాల చిన్నారులను కలిసే అవకాశాన్ని అందుకుంటున్నారు. అడవిలో పులి, లాంగూర్‌ వంటివాటిని చూసినప్పుడు పిల్లలెంతో అనుభూతికి లోనవుతుంటారు. తోటి చిన్నారులతో కలిసి మంచులో నడిచేటప్పుడు, ట్రెక్కింగ్‌ చేసేటప్పుడు, మంచెపై నుంచి వన్యప్రాణులను చూస్తున్నప్పుడు ఎనర్జిటిక్‌గా కనిపిస్తారు. ఉత్తరాఖండ్‌లోని జిమ్‌ కార్బెట్‌ నేషనల్‌పార్కులో వన్యప్రాణుల సందర్శన, బిన్సార్‌ పర్వత శిఖరానికి ట్రెక్కింగ్‌, నీలి నీటి అందాల అండమాన్‌ తీరప్రాంతం వంటివన్నీ చుట్టి రావడంతో పదేళ్లు దాటేసరికే మా ఇద్దరు పిల్లలకెంతో అనుభవం వచ్చింది. పిల్లల పర్యటక బృందాలను పర్యవేక్షిస్తూ వారికి ప్రతి విషయంపై అవగాహన కలిగించే స్థాయికి వారు చేరుకున్నారు. చిన్నారులకు అనుకూలమైన పర్యటక ప్రాంతాలేంటని చాలామంది అడుగుతారు. వారికన్నీ అనుకూలమే. టూర్స్‌లో సఫారీలతోపాటు పొలంలో కూరగాయలు కోయడం, ఆయా ప్రాంతాల గురించి కథలు వినడం... వంటివన్నీ పిల్లలు ఇష్టపడతా’రని చెబుతున్న దిశ ఇప్పటివరకు రాజస్థాన్‌ కోటలు, యూపీలోని దుధ్వా నేషనల్‌ పార్కు, మధ్యప్రదేశ్‌లోని జమ్‌తారా క్యాంపు, వన్యప్రాణుల సఫారీలు, అంటూ... 100కుపైగా టూర్లకు పిల్లలను తీసుకెళ్లారు.


దానికీ ఓ లెక్కుంది...

ఆడవాళ్లు ఏదైనా సలహా ఇస్తే కొంతమంది మగవారు కొట్టిపారేస్తుంటారు. వీళ్లకేం తెలుసులే అన్నట్లు మాట్లాడుతుంటారు. అయితే నిజానికి ఆడవాళ్లు మగవారికంటే ఎక్కువ హేతుబద్ధంగా ఆలోచించగలరట. ఎందుకంటే మగవారితో పోలిస్తే వారి మెదడులో ఎక్కువ మందమైన సెరిబ్రల్‌ కార్టెక్స్‌ ఉండడమే అందుకు కారణమట. అంటే మనం చెబుతున్నామంటే దానికో అర్థం, కారణం ఉన్నట్లే అన్నమాట. మగవారూ ఆలోచించండి మరి!


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్