99ఏళ్ల... ఛాంపియన్‌!

నేర్చుకోవాలనే కుతూహలం, తపన ఉండాలేగానీ వయసు, మరే ఇతర ప్రతికూల పరిస్థితులూ అడ్డుకావని నిరూపిస్తోంది ఓ బామ్మ. ఆమే కెనడాకు చెందిన స్విమ్మర్‌ బెట్టీ బ్రసెల్‌. 99ఏళ్ల ఈ బామ్మ ఒకేరోజు ఈత పోటీల్లో మూడు రికార్డులు బద్దలు కొట్టి చరిత్ర సృష్టించింది.

Published : 08 Apr 2024 06:07 IST

నేర్చుకోవాలనే కుతూహలం, తపన ఉండాలేగానీ వయసు, మరే ఇతర ప్రతికూల పరిస్థితులూ అడ్డుకావని నిరూపిస్తోంది ఓ బామ్మ. ఆమే కెనడాకు చెందిన స్విమ్మర్‌ బెట్టీ బ్రసెల్‌. 99ఏళ్ల ఈ బామ్మ ఒకేరోజు ఈత పోటీల్లో మూడు రికార్డులు బద్దలు కొట్టి చరిత్ర సృష్టించింది. కెనడాలో జరిగిన 100-104ఏళ్ల కేటగిరీ స్విమ్మింగ్‌ పోటీల్లో 400మీటర్ల ఫ్రీస్టైల్‌, 50మీటర్ల బ్యాక్‌ స్ట్రోక్‌, 50మీటర్ల బ్రెస్ట్‌ స్ట్రోక్‌ విభాగాల్లో ఈ రికార్డులు నెలకొల్పారీమె. 1924లో హోలాండ్‌లో జన్మించిన బ్రసెల్‌కు 11మంది తోబుట్టువులు. వాళ్లను చూసుకోవడం కోసం 14ఏళ్లకే ఆమె స్కూల్‌ మానేయాల్సి వచ్చింది. పెళ్లయిన తర్వాత భర్తతో కలిసి కెనడాకు మారింది. వారికి ముగ్గురు సంతానం. మొదట్లో బతుకుదెరువు కోసం కొంతకాలం ఇళ్లలో పనిచేసిన ఆమె తర్వాత కుట్టుపనిలో స్థిరపడింది. రెండో ప్రపంచ యుద్ధ ప్రభావం, కుటుంబ పరిస్థితులు చిన్నతనంలో ఆటపాటలు ఏవీ నేర్చుకునే వీలు లేకుండా చేశాయి. అందుకే ఆ లోటు తీర్చుకోవడానికి రిటైర్‌ అయ్యాక, ఆరుపదుల వయసులో ఈత నేర్చుకుందట. వారానికి కనీసం రెండు రోజులైనా సాధన కోసం కేటాయించేది. క్రమంగా ఈతపై ఇష్టం పెరిగింది. కాలక్షేపంగా మొదలుపెట్టినా దాన్నే పాషన్‌గా మార్చుకుని స్విమ్మింగ్‌ పోటీల్లో పాల్గొనటం ప్రారంభించింది. ‘ఈత కొట్టడమంటే నాకు చాలా ఇష్టం. స్విమ్మింగ్‌ పూల్‌లో నా బాధలన్నీ మర్చిపోతా. పోటీలో దిగానంటే దృష్టంతా ఆటపైనే. మరి దేని గురించీ ఆలోచించను’ అంటోన్న ఈ బామ్మ ప్రయాణం స్ఫూర్తిదాయకమే కదా! అన్నట్టూ ఈ జులైకి ఈమె వందో పుట్టిన రోజు చేసుకోబోతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్