సోనియా... ఏనుగుల నేస్తం!

వారసత్వం కొనసాగించడం అంత తేలికేమీ కాదు. వారసుల ప్రతి అడుగునూ నిశితంగా గమనిస్తారు. సవాళ్లకు తోడు తీసుకునే ప్రతి నిర్ణయంపైనా విమర్శలూ ఎదురవుతుంటాయి. వీటన్నింటినీ దాటి ‘నక్సల్‌బరి’ని సోనియా విజయపథంలో ఎలా నడిపారు?తనకీ ఏనుగులకూ సంబంధమేంటో తెలియాలంటే ఆవిడ ప్రయాణాన్ని చదివేయాల్సిందే!

Published : 08 Apr 2024 06:07 IST

వారసత్వం కొనసాగించడం అంత తేలికేమీ కాదు. వారసుల ప్రతి అడుగునూ నిశితంగా గమనిస్తారు. సవాళ్లకు తోడు తీసుకునే ప్రతి నిర్ణయంపైనా విమర్శలూ ఎదురవుతుంటాయి. వీటన్నింటినీ దాటి ‘నక్సల్‌బరి’ని సోనియా విజయపథంలో ఎలా నడిపారు?తనకీ ఏనుగులకూ సంబంధమేంటో తెలియాలంటే ఆవిడ ప్రయాణాన్ని చదివేయాల్సిందే!

రోజంతా మొక్కలు నాటించి అప్పుడే ఇంటికి చేరారు సోనియా జబ్బర్‌. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి ‘మన టీ ఎస్టేట్‌లో ఏనుగులు పడ్డాయి’ అని చెప్పాడు. ఒకటీ రెండూ కాదు... 35 ఎకరాల్లో మొక్కలు నాటించారామె. ఆ శ్రమంతా వృథానేనా అన్న భయం పట్టుకుంది. ఆ వచ్చిన వ్యక్తేమో ఆమె నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాడు. సోనియాకి ఏం చేయాలో పాలు పోలేదు. ‘మామూలుగా ఇలాంటప్పుడు ఏం చేస్తా’మని అతన్నే అడిగారామె. ‘కాగడాలు, డప్పులు, టపాకాయలతో వాటిని భయపెట్టడమే’నని సమాధానం ఇచ్చాడతను. ఆ మూగజీవులను బెదరగొట్టడమేమో ఆమెకు ఇష్టం లేదు. ‘తెల్లారాక ఏం జరుగుతుందో చూద్దాం. అప్పుడే నిర్ణయం తీసుకోవచ్చ’ని చెప్పి అతన్ని పంపేసినా... నిద్రలేని రాత్రినే గడిపారామె.

ఈమెది డార్జిలింగ్‌. చదువు పూర్తయ్యాక గ్రాఫిక్‌ డిజైనర్‌, ఫొటోగ్రాఫర్‌, జర్నలిస్ట్‌, ట్రావెల్‌ రైటర్‌... ఇలా నచ్చింది చేసుకుంటూ వచ్చారామె. 2011లో అమ్మ డాలీ ఉన్నంతవరకూ స్వేచ్ఛా జీవే! ఆమె చనిపోయాక వారసురాలిగా ‘నక్సల్‌బరి టీ ఎస్టేట్‌’ బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. 1200 ఎకరాల ఎస్టేట్‌ అది. గతంలో అమ్మ, బామ్మ విజయవంతంగా నడిపారు. నష్టాల్లో ఉన్నదాన్ని అంతర్జాతీయ వ్యాపారంగా తీర్చిదిద్దారు. వాళ్లలా నడిపించగలనా అని ఆమె కాస్త భయపడ్డారు కూడా. కానీ తమను నమ్ముకున్న పనివాళ్ల కోసం ధైర్యం చేస్తే... కొద్దిరోజుల్లోనే ఏనుగులు ఆమెకో పరీక్ష పెట్టాయి. అయితే తన సంయమనం లాభాన్నే చేకూర్చింది. ఏనుగులను తరమకపోవడంతో కొన్ని మొక్కలే పాడయ్యాయి. కానీ.. ఏటా ఏనుగుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. దీంతో ఆలోచనలో పడ్డారామె.

అడవిని సృష్టించి..

అసోం, నేపాల్‌ సరిహద్దుల్లో ఏనుగులు వలస వెళ్లే మార్గాన్ని మూసేయడంతో అవి తమ ఎస్టేట్‌కు దారి మార్చుకున్నాయని తెలుసుకున్నారు సోనియా. ఇది ఇలాగే కొనసాగితే మానవ- జంతు సంఘర్షణలకు దారితీస్తుంది అనుకున్నారామె. అందుకే అవి వెళ్లేందుకు ఎస్టేట్‌లో ప్రత్యేకంగా మార్గం చేశారు. గున్న ఏనుగులకు ప్రమాదమని గుంతలనీ మూసేయించారు. ఆపై కిలోమీటర్ల ప్రయాణం. ఏనుగులు అలసిపోతాయి, ఆహారమూ అందదని ఆలోచించిన సోనియా వాటి కోసం వంద ఎకరాల్లో భిన్న మొక్కలు నాటించి, చిన్నపాటి అడవినే సృష్టించారు. ‘హాతీ సాతీ నేచర్‌ క్లబ్‌’ ప్రారంభించి, జీవవైవిధ్యం, ఏనుగుల సంరక్షణ వంటి అంశాల్లో పిల్లలకు తర్ఫీదునిస్తున్నారు. ‘వాళ్లు పెద్దయ్యాక పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములవుతారు. భూమికి రక్షకులుగా మారతారు’ అంటారామె.

మూగజీవుల ఆరోగ్యం కోసం సేంద్రియ సాగును ప్రారంభించారు. ఈక్రమంలో ‘అది అసాధ్యం. నీకు పిచ్చి పట్టింది. సంస్థను నష్టాల బాట పట్టిస్తావ’ని విమర్శలొచ్చినా ముందుకే సాగారు. ఫలితం... దిగుబడి పెరగడమే కాదు, అమెరికా యూనివర్సిటీ నుంచి ‘ఎలిఫెంట్‌ ఫ్రెండ్లీ టీ’గా సర్టిఫికేషన్‌నీ పొందారు. ఏనుగుల రక్షకురాలిగా పేరు తెచ్చుకున్న సోనియా స్థానిక మహిళల జీవితాల్నీ మార్చారు. తన ఎస్టేట్‌లో పనిచేసేవారిలో 90 శాతం మహిళలే. వాళ్లు రోజంతా కష్టపడి సంపాదిస్తే, మగవాళ్లు తాగుడు, మత్తు పదార్థాలకు ధారపోసేవారు. దాన్ని మార్చడానికి ఓ ఎన్‌జీవోతో కలిసి మత్తుపదార్థాలకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. విద్య, ఆరోగ్యం, పొదుపు అంశాలపై మహిళల్లో చైతన్యం తీసుకొచ్చారు.

పర్యటక ప్రాంతంగా..

‘ఎస్టేట్‌ ఇక నడపలేం అనుకున్న సమయంలో బామ్మ బాధ్యతలు తీసుకుంది. పరదా పద్ధతిని వ్యతిరేకించి, ఈ మహిళల సాయంతోనే తిరిగి లాభాల బాట పట్టించింది. ఆ వారసత్వాన్ని అమ్మ సమర్థంగా ముందుకు తీసుకెళ్లింది. వాళ్లలా నడిపించగలనా అని సందేహించినా ధైర్యంగా ప్రయత్నించా. దానికి నేనేంతో ఇష్టపడే జంతు సంరక్షణనీ జోడించడం, ఇక్కడి మహిళల జీవితాల్లో మార్పునకు కారణమవ్వడం ఆనందాన్నిస్తోంద’ంటారు సోనియా. తన సేవలకు గుర్తింపుగా గ్రీన్‌ కారిడార్‌ ఛాంపియన్‌ ఆఫ్‌ నార్త్‌ బంగాల్‌తోపాటు నారీశక్తి పురస్కారాన్నీ అందుకున్నారు. టీ ఎస్టేట్‌లో టూర్‌, పోలో క్లబ్‌, ఆర్గానిక్‌ ఫార్మింగ్‌లో శిక్షణ వంటివెన్నో ప్రవేశపెట్టి, పర్యటకులనూ ఆకర్షిస్తున్నారు.


ఇట్టే పసిగట్టేస్తాం...

ఆడవాళ్లు ఊరికే భయపడుతుంటారనీ, శబ్దాలకు ఉలిక్కిపడుతుంటారనీ కొందరు మగవారు ఆటపట్టిస్తుంటారు. మరీ అంత సున్నితత్వం ఏంటని ఎగతాళి చేస్తుంటారు కూడా. నిజానికి మనం అలా ఉండడానికి కారణం మనలోని బయోలాజికల్‌ సెన్సిటివిటీనే. అందుకే ఆడవాళ్లు నిద్రపోయేటప్పుడు కూడా తమ పిల్లల ఏడుపూ, అరుపులను ఇట్టే పసిగట్టగలుగుతున్నారట. మరి ఇప్పుడేమంటారు?


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్