అవధానంలో... ఆమె!

అవధానం అంటే మాటలు కాదు! క్లిష్టమైన సాహితీ సమస్యలను అలవోకగా పరిష్కరిస్తూ... అసందర్భ ప్రశ్నలను సమర్థంగా ఎదుర్కొనే అరుదైన సాహితీ విన్యాసమిది.

Updated : 09 Apr 2024 02:33 IST

అవధానం అంటే మాటలు కాదు! క్లిష్టమైన సాహితీ సమస్యలను అలవోకగా పరిష్కరిస్తూ... అసందర్భ ప్రశ్నలను సమర్థంగా ఎదుర్కొనే అరుదైన సాహితీ విన్యాసమిది. అవధానం చేసేవాళ్లకు... సూపర్‌ కంప్యూటర్‌కి ఉండే శక్తి సామర్థ్యాలు ఉండాలంటారు. అటువంటి అవధాన ప్రక్రియలో ఆణిముత్యాల్లాంటి అమ్మాయిలను అందిస్తోంది రాజమహేంద్రవరంలోని ఆంధ్ర యువతి సంస్కృత కళాశాల....

గోదారమ్మ ఒడిలో అందంగా ఒదిగిన ఈ ఆంధ్ర యువతి సంస్కృత కళాశాల 93 ఏళ్లుగా తెలుగు వారికి సేవలందిస్తోంది. ఆధునిక ప్రపంచానికి అవసరమైన కంప్యూటర్‌ విద్యతో పాటు  క్లిష్టమైన అవధాన ప్రక్రియ పట్లా ఆసక్తిని పెంచుతోంది. ఇక్కడ బీఏలో... తెలుగుతోపాటు సంస్కృతం, కంప్యూటర్‌, ఇంగ్లిష్‌ బోధనా ఉంటుంది. ఈ కాలేజీ నుంచి అష్టావధానం, శతావధానంలో అమ్మాయిలు రాణించేలా చేసిన గొప్పతనం గురువు ధూళిపాళ మహాదేవమణిదే. ఆయనే ఆసక్తి ఉన్న యువతులను గుర్తించి అవధానవిద్యలో కీలకమైన పద్యరచనతోపాటు ధారణ శక్తిలోనూ శిక్షణ ఇచ్చేవారు. అలా ఈ కళాశాల నుంచి బులుసు అపర్ణ, పుల్లాభట్ల శాంతిస్వరూప, కొంపెల్ల లక్ష్మీకామేశ్వరి, తంగిరాల ఉదయ చంద్రిక వంటివారు అష్టావధానాలు, శతావధానాలు చేసి పండితుల ప్రశంసలు అందుకున్నారు. అపర్ణ ఒక్కరే 280 అష్టావధానాలు, ఏడు శతావధానాలు చేశారు. ఇక్కడి విద్యార్థినులు నగరంలో జరిగే అవధాన కార్యక్రమాల్లో పృచ్ఛకులుగా వ్యవహరిస్తూ కళాశాల పేరును కొనసాగిస్తున్నారు. గోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థినులు ఇక్కడ హాస్టల్లో ఉంటూ ఈ విద్య అభ్యసిస్తున్నారు. వీళ్లలో చాలామంది వివాహాలు అయి వేర్వేరు చోట్ల స్థిరపడినా ఈ సంస్కృతి గొప్పతనం అందరికీ తెలియాలని తపిస్తున్నారు. అపర్ణ తన కుమార్తెకు పద్య రచనలో శిక్షణ ఇస్తూనే ‘సాహితీ కౌముది’ పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహిస్తున్నారు. తక్కిన వారూ వీలుచిక్కినప్పుడల్లా అవధాన గొప్పతనాన్ని పిల్లలకు చెబుతూ కొత్తతరానికీ విద్య గొప్పతనం తెలియచేస్తున్నారు.


అవధాన విద్యలో... పృచ్ఛకులు అంటే ప్రశ్నలు అడిగేవారు అడుగుతూ ఉంటే సమాధానాన్ని అసువుగా పద్యం అల్లి చెప్పాలి. భాషపై ఎంతో పట్టు, ఆసక్తి ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. పాండిత్యంలో ఆరితేరిన కవులు, సాహితీవేత్తలు పృచ్ఛకులుగా వ్యవహరిస్తూ క్లిష్టమైన ప్రశ్నలు సంధిస్తుంటే తడబాటు లేకుండా సునాయాసంగా పద్యపూరణ చేస్తూ అవధానం చేసేవారు.

  సూర్యకుమారి, రాజమహేంద్రవరం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్