బగ్గోణ పంచాంగానికి డిమాండ్‌!

పంచాంగం అనగానే మగవారే స్ఫురణకు వస్తారు. కానీ కర్ణాటకకు చెందిన జయశ్రీ పండిట్‌... కొన్ని దశాబ్దాలుగా పంచాంగం రాస్తున్నారు. ఈమె రాసిన దానికి కన్నడ నాట డిమాండ్‌ ఎక్కువ.

Updated : 09 Apr 2024 06:52 IST

పంచాంగం అనగానే మగవారే స్ఫురణకు వస్తారు. కానీ కర్ణాటకకు చెందిన జయశ్రీ పండిట్‌... కొన్ని దశాబ్దాలుగా పంచాంగం రాస్తున్నారు. ఈమె రాసిన దానికి కన్నడ నాట డిమాండ్‌ ఎక్కువ. ఇంతకీ ఈమెవరంటే...

గాదే కాదు ఆంగ్ల నూతన సంవత్సరాదినా కర్ణాటక ప్రజలు ‘బగ్గోణ పంచాంగం’ వెదికి మరీ కొంటారట. ఆ పంచాంగంలో రాశులు, తిథి, వారాలు, నక్షత్ర సమాచారం కచ్చితంగా ఉంటుందన్నది కన్నడిగుల విశ్వాసం. దీని కోసం ఆరు నెలల ముందే పబ్లిషర్లు ఆర్డర్లు ఇస్తుంటారు. ముఖ్యంగా ఉత్తరకన్నడ జిల్లా గోకర్ణకు చెందిన రామా వెంకటరమణ పండిట్‌ కుటుంబం రాసే పంచాంగానికి డిమాండ్‌ ఎక్కువ. ఇది 71ఏళ్ల జయశ్రీ పండిట్‌ నేతృత్వంలో సిద్ధం అవుతుంది. 300ఏళ్లుగా వీళ్ల కుటుంబం పంచాంగం రచిస్తుండగా ఐదో తరంలో ఆ బాధ్యతను జయశ్రీ తీసుకున్నారు. ‘మహిళగా ఈ బాధ్యత సవాలుతో కూడుకున్నదే. బగ్గోణ పంచాంగాన్ని మా తాత రామా వెంకటరమణ పండిట్‌ విస్తృతంగా ప్రచారం చేశారు. తరవాత నాన్న, చిన్నాన్న జ్యోతిషంతోపాటు పంచాంగ రచనపైనా దృష్టిసారించారు. నాకు ఆసక్తి కలగడానికి మాత్రం చిన్నాన్నే కారణం. 1980లో బీఏ పూర్తయ్యాక ఆరోగ్యశాఖలో జూనియర్‌ గుమాస్తాగా చేస్తూనే చిన్నాన్నకు పంచాంగ రచనలో సాయం చేసేదాన్ని. వీటిల్లోపడి పెళ్లి విషయాన్నే మరచిపోయా’నంటారు జయశ్రీ.

సూర్యమాన, చంద్రమాన పంచాంగాలపైనా అధ్యయనం చేశారీమె. గ్రహాలు, రాశులు, వారాలు, తిథులు, నక్షత్రాలు, లఘ్నాలను రాయడం, జ్యోతిషం, ముహూర్తాలు పెట్టడం వంటివీ నేర్చుకున్నారు. ఈమె గురించి తెలిసి ఆఫీసులో సలహాలు కోరేవారు. ఆమె మాటపై గురి కుదరడంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, కార్యాలయాల్లో ఆమె రాసిన పంచాంగం, క్యాలండర్లనే వాడుతున్నారు. దీంతో ఉత్తర, దక్షిణ కన్నడ సహా మరికొన్ని జిల్లాలకు ఈమె పంచాంగం విస్తరించింది. జయశ్రీ తమ్ముడు వెంకటరమణ పండిట్‌ ఈమె పంచాంగానికి డిజిటల్‌ రూపం ఇవ్వడం ప్రారంభించారు. పదేళ్ల క్రితం జయశ్రీ ఉద్యోగ విరమణ చేశాక పూర్తిగా పంచాంగ రచనపైనే దృష్టిపెట్టారు. ఆసక్తి ఉన్న మహిళలకు జ్యోతిషం, పంచాగ రచనలపై శిక్షణనీ ఇస్తున్నారు. ‘మహిళలూ ఈ సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లగలరు. అందుకే ఈ ప్రయత్నం’ అనే జయశ్రీ కృషికి గుర్తింపుగా కొన్ని విశ్వవిద్యాలయాలు డాక్టరేట్‌ ఇవ్వాలని వచ్చినా ఆవిడ తిరస్కరించారు. ‘శతాబ్దాల మా చరిత్రకి ప్రత్యేకంగా ప్రచారం అవసరమా’ అంటారామె.

 కె.ముకుంద, బెంగళూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్