సోషల్‌ మీడియా సర్పంచమ్మ!

ఊరంతా మద్యం మత్తులో జోగుతోంటే చూడలేకపోయారామె. మద్యం అమ్మకాలు ఆపించమని అధికారులకు మొర పెట్టుకున్నా వినలేదు. ఇలా కాదని మహిళలను వెంటబెట్టుకుని వాటిని బలవంతంగా మూసేయించారు.

Updated : 10 Apr 2024 06:54 IST

ఊరంతా మద్యం మత్తులో జోగుతోంటే చూడలేకపోయారామె. మద్యం అమ్మకాలు ఆపించమని అధికారులకు మొర పెట్టుకున్నా వినలేదు. ఇలా కాదని మహిళలను వెంటబెట్టుకుని వాటిని బలవంతంగా మూసేయించారు. అది చూసి కోపగించుకున్న మగవాళ్లంతా ఆయుధాలతో వెంబడిస్తే... తప్పించుకుని వాళ్లంతా గ్రామపంచాయతీ కార్యాలయంలో దాక్కున్నారు. దాదాపు 12 గంటల నిరీక్షణ తరవాత టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రంగంలోకి దిగాక బయటపడ్డారు. ఇంకొకరైతే ధైర్యం చేయలేకపోయేవారేమో! సరోజ్‌ దేవి మాత్రం ప్రజాసేవలో ఇవన్నీ మామూలే అంటూ మరో సమస్యపై దృష్టిపెట్టారు. ఇంతకీ ఈమెవరంటే...

లపై తలపాగా, నెరిసిన జుట్టు, చేతిలో  కర్ర... గంభీరమైన గొంతుతో ఆజ్ఞలు జారీచేసే సర్పంచ్‌లనే చూసిన బాలేశ్వర్‌ ప్రజలకు ఒక మహిళను ఆ హోదాలో చూడటం ఆశ్చర్యమే. అవును మరి... పాలన ఆడవాళ్లకేం తెలుసన్న మాటల్ని పక్కకు నెట్టి, ధైర్యంగా ఎన్నికల్లో నిల్చున్నారు సరోజ్‌ దేవి అగర్వాల్‌. స్వతంత్ర అభ్యర్థిగా అక్కడి వాళ్ల నమ్మకాన్ని పొంది, గెలిచారు. పుట్టిపెరిగింది ఒడిశాలోని రవుర్కెలా. పెళ్లి తరవాత భర్త వెంట బాలేశ్వర్‌ గ్రామపంచాయతీలోని అమోధికి వెళ్లాలంటే దుఃఖం తన్నుకొచ్చిందామెకు. రోడ్డు సౌకర్యం లేదు, అంతంత మాత్రం విద్యుత్‌ సరఫరా. చీకటిపడితే ఇంటికే పరిమితం అవ్వాలి. సిటీలో పెరిగిన అమ్మాయి కనీస సౌకర్యాలు లేని ఊళ్లో ఉండాలంటే కష్టమే మరి. బయట పడటం కంటే ఆ పరిస్థితుల్ని ఏమైనా మార్చొచ్చా అనే ఆలోచించారామె. పంచాయతీ సభ్యురాలిగా, డిప్యూటీ సర్పంచ్‌గా మార్పు తీసుకురావడానికి చాలానే ప్రయత్నించారు. ‘గ్రామసభల్లో పాల్గొనేదాన్ని. అక్కడంతా మాటలే... చేతలకొచ్చేసరికి ఏమీ జరిగేవి కాదు. సౌకర్యాలు లేవు. ముందు ప్రజలే మార్పును స్వాగతించేవారు కాదు. ఇవన్నీ మారాలంటే నేరుగా రంగంలోకి దిగడమే మేలనుకున్నా’ అంటారీమె.

బెదిరింపులెన్నో...

2022లో బాలేశ్వర్‌ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఈ పంచాయతీ పరిధిలో 9 గ్రామాలుంటాయి. అందులో భుక్తపడా అనే గిరిజన గ్రామం ఒకటి. అక్కడికి వెళ్లడమే కష్టం. దానికీ ప్రపంచంతో సంబంధాలు తక్కువ. ఇక పెన్షన్లు, ఆరోగ్య సౌకర్యాలు వంటివెలా అందుతాయి? సిబ్బందితో అక్కడికి వెళ్లి, కావాల్సిన మందులు అందించి, పెన్షన్లకు దరఖాస్తులు చేయించారు. తరచూ వెళ్లడం సిబ్బందికి అసాధ్యం. వాళ్లే వద్దామంటే దివ్యాంగులకు ఆ మార్గంలో రావడం నరకమే. పరిష్కారం ఆలోచించి డ్రోన్‌ కొన్నారు సరోజ్‌. దానితో పంపిణీ మొదలుపెట్టారు. దీన్ని ఫొటోలతో ‘ఎక్స్‌’లో పెట్టి, సంబంధిత అధికారులకు ట్యాగ్‌ చేశారు. మీడియా కూడా పెద్ద ఎత్తున కవర్‌ చేయడంతో ఆ గ్రామానికి రోడ్డు, నీటి సౌకర్యం ఏర్పడి వంద కుటుంబాలకు మేలు జరిగింది. ఇతర గ్రామాల్లో ఇంకో ఇబ్బంది. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి నెలనెలా గ్రామసభలు నిర్వహిస్తే... ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. ఎలాగూ పరిష్కారం దొరకదులే అని వాళ్ల అభిప్రాయం మరి. ఇది గ్రహించి, ‘మీ గుమ్మం ముందే సర్పంచ్‌’ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ప్రతి 20 కుటుంబాలతో కలిపి మీటింగ్‌ పెట్టి సమస్యలు తీరుస్తున్నారు. గర్భిణులు, పిల్లలకు అంగన్‌వాడీల ద్వారా పోషకాహారం అందేలా చూసుకుంటున్నారు. అక్కడి పెద్ద కుటుంబాలతో మరో సమస్య. తమ బావుల నుంచి నిమ్న జాతుల వారిని నీరు తోడుకోనిచ్చేవారు కాదు. దానికోసం క్యాంపెయిన్‌, అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. గ్రామంలో మద్యం అమ్మకాలపైనా పోరాడారు. ఈ క్రమంలో ఆమె ఎదుర్కొన్న బెదిరింపులెన్నో. అయినా ధైర్యంగా వాళ్లలో మార్పు తెచ్చారామె. ఆడపిల్లల చదువును ప్రోత్సహించి, ఇంటర్‌ వరకూ విద్య, బ్యాంకు సౌకర్యం వంటివెన్నో అందుబాటులోకి తెచ్చారు. ఇందుకు ఆమె ఆయుధం ‘ఎక్స్‌’. అందుకే సోషల్‌మీడియా సర్పంచ్‌గానూ ఆమెకు పేరు. ఆడపిల్లపై వివక్షను పోగొట్టడానికి ప్రతి అమ్మాయి పేర 50 పండ్ల మొక్కలను నాటుతున్నారు. వితంతువులకు పెన్షన్‌, చిన్న ఉద్యోగాలు వంటివీ చూపిస్తున్నారు.

పర్యావరణం కోసం...

వాళ్ల గ్రామంలో ఓసారి ఆవు చనిపోయింది. దాని కడుపులో ఏకంగా రెండు కేజీల ప్లాస్టిక్‌ ఉందని తెలిసి ఆశ్చర్యపోయారు సరోజ్‌. వేడుకలప్పుడు ఉపయోగించే ప్లాస్టిక్‌ కవర్లు, ప్లేట్లు, కప్పులతో మూగజీవులకే కాదు మనకీ హానే అని అర్థం చేసుకున్నారామె. దీంతో ‘బర్తన్‌ బ్యాంక్‌’ ప్రారంభించి స్టీలు సామగ్రిని అద్దెకివ్వడం ఆరంభించారు. కొంత మొత్తం చెల్లించి, ఎవరైనా వాటిని తీసుకోవచ్చు. అంతేకాదు పంచాయతీ అవసరాలకు, చెత్తకీ ‘ఈ-వాహనాలు’ అందుబాటులోకి తెచ్చారు. దివ్యాంగులు, వృద్ధులకూ ఈ-రిక్షాలు అందించారు. ఇలా చెప్పుకొంటూ పోతే ఆమె అనుసరిస్తున్న విధానాలు, ప్రణాళికలు ఇంకెన్నో. ‘ప్రతి కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు ఇది జరిగేపనేనా అన్నమాట వినపడేది. లోకులన్నాక మాట్లాడకుండా ఉంటారా... పట్టించుకోకపోవడమే నా వంతు. సేవ చేయాలనుకున్నా... చేస్తున్నా అంతే’ అనే 53ఏళ్ల సరోజ్‌... కేంద్రప్రభుత్వం నుంచి ఛేంజ్‌ మేకర్‌ ఆఫ్‌ ద ఇయర్‌, ఉత్తమ సర్పంచ్‌ పురస్కారాలనూ అందుకున్నారు.


ఎన్ని అబద్ధాలు ఆడారో...!

సాధారణంగా మగవారితో పోలిస్తే ఆడవారికే నిజాయతీ ఎక్కువుంటుందట. ఎందుకంటారా... బ్రిటన్‌లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం... స్త్రీల కంటే పురుషులు అబద్ధాలు ఎక్కువ చెబుతారట. సంవత్సరానికి మగవారు 1092 అబద్ధాలు చెబితే స్త్రీలు చెప్పేది 728 మాత్రమేనట. అంతేకాదు, వాట్సప్‌, ఇన్‌స్టా వంటి సోషల్‌మీడియాలతో పోలిస్తే ముఖాముఖిగా కలిసినప్పుడే ఎక్కువ చెబుతారట. దీన్నిబట్టి మీ ఇంట్లో మగవాళ్లు ఎన్ని అబద్ధాలు ఆడారో లెక్కేసుకోండి మరి...

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్