నన్నూ ఆ మంటల్లోకి నెట్టబోయారు

గల్ఫ్‌ దేశాల్లో కార్మికుల జీవితాన్ని కళ్లకు కట్టిన ‘గోట్‌లైఫ్‌’ సినిమా సూపర్‌హిట్‌ కదా! పద్మ కథలోనూ అంతకు మించే ఎడారి కష్టాలున్నాయి. పొడవాటి జడను కత్తించారు.

Updated : 12 Apr 2024 04:45 IST

గల్ఫ్‌ దేశాల్లో కార్మికుల జీవితాన్ని కళ్లకు కట్టిన ‘గోట్‌లైఫ్‌’ సినిమా సూపర్‌హిట్‌ కదా! పద్మ కథలోనూ అంతకు మించే ఎడారి కష్టాలున్నాయి. పొడవాటి జడను కత్తించారు.  చేతినిండా కత్తి గాట్లు. వీపుమీద ఇస్త్రీ పెట్టెతో కాల్చిన పెద్ద మచ్చ...  గల్ఫ్‌లో యజమానులు పెట్టే ఈ హింస నుంచి బయటపడి ఇండియా వచ్చేద్దామంటే పాస్‌పోర్ట్‌ దాచిపెట్టారు. అలాంటి సమయంలో ఆమెకు అండగా నిలిచి, స్వదేశానికి తీసుకొచ్చింది  ‘నేషనల్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌’. ఆమె ఒక్కదానికోసమే కాదు హైదరాబాద్‌  కేంద్రంగా లక్షలమంది డొమెస్టిక్‌ వర్కర్స్‌ హక్కుల కోసం పోరాడుతున్నారు డాక్టర్‌ సిస్టర్‌ లిస్సీ జోసెఫ్‌.. ఈ హక్కుల బాట పట్టడానికి గల కారణాలని వసుంధరతో ముచ్చటించారామె... 

రోజు ఐదు లక్షలమంది కార్మికులతో పనిచేస్తున్న నేను పదహారేళ్లప్పుడు సిస్టర్‌గా మారాలని హైదరాబాద్‌ వచ్చా. కేరళలోని కొట్టాయం నా స్వస్థలం. నాన్న రబ్బరు వ్యాపారి. ఇంటర్‌ తర్వాత సిస్టర్‌గా శిక్షణ తీసుకుంటూనే, సోషల్‌వర్క్‌ చదివా. ఆపై ముంబయిలో ‘ప్రగతి కేంద్ర సంస్థ’కు కోఆర్డినేటర్‌గా వెళ్లా. అక్కడ బస్తీలో పిల్లలకి చదువు చెప్పేదాన్ని. సాయంత్రం పూట ఆడవాళ్లకి వంట, ఎంబ్రాయిడరీ వంటి ఉపాధినిచ్చే పనులు నేర్పించేదాన్ని. సరిగ్గా అదే సమయంలో... బాబ్రీ మసీదు సంఘటన జరిగింది. ఆ ప్రభావం నేను పనిచేస్తున్న బస్తీపైనా పడింది. ఒక వర్గం వాళ్లు, మరొక వర్గం వాళ్ల ఇళ్లకు నేను చూస్తుండగానే నిప్పంటించారు. దాంతో పరుగున వెళ్లి స్థానికులని హెచ్చరించి మంటలార్పాను. అక్కడివాళ్లను మా సంస్థలో ఉంచి రక్షణ కల్పించాం. ఆ సమయంలో ముగ్గురికి ప్రసవం చేశా. ఉద్రిక్తతలను తగ్గించేందుకు ‘అందరం మనుషులమే కదా’ అని నచ్చచెప్పబోతే... నన్నూ ఆ మంటల్లోకి నెట్టబోయారు. కొన్ని రోజుల వరకూ షాక్‌ నుంచి తేరుకోలేకపోయాను. పరిస్థితులు సర్దుకున్నాక... అక్కడివారికి పక్కాఇళ్లు కావాలని ప్రభుత్వంతో పోరాడితే వాళ్లకు స్థలాలు వచ్చాయి. అప్పుడు రతన్‌టాటా రూ. 25 లక్షలు సాయం చేశారు. ఆ డబ్బుతో ఆ ఇళ్లను దగ్గరుండి కట్టించాను. ఆ సమయంలో ఒక న్యాయవాది దగ్గర పనిచేసి, హక్కులపై అవగాహన తెచ్చుకున్నా.

మూసీనది ఒడ్డున...

హైదరాబాద్‌ వచ్చి... బ్రదర్‌ వర్గీస్‌ ప్రారంభించిన పీపుల్స్‌ ఇనీషియేటివ్‌ నెట్‌వర్క్‌లో చేరి, మూసీనది ఒడ్డున బస్తీల్లో ఉండే పిల్లలకు చదువు చెప్పేదాన్ని. తల్లులు పాచి పనికి వెళ్తే, పిల్లలు ఇంట్లో ఉండేవాళ్లు. అలాంటి వాళ్లకోసం 16 స్కూళ్లు ప్రారంభించాం. సోషల్‌వర్క్‌లో పీజీ చేస్తూ, స్కూళ్ల బాధ్యత చూసుకుంటూ సాయంత్రం మహిళలకోసం పనిచేసేదాన్ని. పీజీ పూర్తయ్యాక లెక్చరర్‌ ఉద్యోగం వచ్చినా నా మనసంతా బడుగు జీవితాలపైనే ఉండేది. ఆ సమయంలో కృష్ణానగర్‌లో ఒక సంఘటన చూశా. ఐదేళ్లపాప... చెల్లికి స్నానం చేయిస్తోంది. నెలల తమ్ముడు ఉయ్యాలలో ఉన్నాడు. అమ్మ ఏదని అడిగితే... ‘పనికి వెళ్లింది’ అంది. అంత చిన్న పిల్లలను ఇంట్లో వదిలేసి వెళ్లడం చూసి బాధేసింది. అదే బస్తీలో లక్ష్మి అనే అమ్మాయిని యజమాని ఇంట్లో సొమ్ము దొంగతనం చేసిందన్న అనుమానంపై పోలీసులు తీసుకెళ్లారు. అప్పుడామె గర్భవతి. పోలీస్‌ దెబ్బలకు అబార్షన్‌ అయ్యింది. డీఎస్‌పీని కలిసి ఆ అమ్మాయిని విడిపించాను. ‘నేడు ఆమె.. రేపు మీరు కావొచ్చు’ అంటూ బస్తీవాసులని ఏకం చేశా. మీలానే చాలామంది వచ్చిపోతారు. మిమ్మల్ని ఎలా నమ్మాలన్నారు. అప్పుడే స్నేహితురాలు వైశాలి లోన్‌కర్‌తో కలిసి 1998లో ‘నేషనల్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌’ ప్రారంభించి ఇళ్లలో పనిచేసే వారి హక్కుల కోసం పోరాటం మొదలుపెట్టా. చాంద్రాయణ గుట్ట దగ్గర ఒక కుటుంబం... ఇచ్చిన అప్పునకు బదులుగా ఏడేళ్ల పాపని పనికి కుదుర్చుకుంది. ఆ పాప ఏదో చిన్న పొరపాటు చేసిందని కొడితే ఆమె చనిపోయింది. మరో సందర్భంలో పనికి కుదిరిన పిల్లని ఇంటి వాస్తు బాగాలేదని బలి ఇచ్చారు. ఇలా ఎన్నో కేసులు. వాటిని వాదించడం కోసం నేనే లా చదివి స్వయంగా వాదించాను. మరికొన్నింటిని హక్కుల కార్యకర్త బాలగోపాల్‌ వాదించారు. పనిచేసే వారి పిల్లల కోసం 35 పాఠశాలలు స్థాపించాం. మరోవైపు వలసకార్మికుల సమస్యలూ పెరిగాయి. తెలుగురాష్ట్రాల్లోని రాయచోటి, తూర్పుగోదావరి, జగిత్యాల, నిజామాబాద్‌ ఇలా పలు ప్రాంతాల నుంచి గల్ఫ్‌దేశాలకు వెళ్తుంటారు. వాళ్లలో ఏజెంట్ల చేతిలో మోసపోయేవాళ్లూ, యజమానుల చేతిలో హింసకు గురయ్యేవాళ్లే ఎక్కువ. పద్మ అనే అమ్మాయి యజమాని హింస భరించలేక ఇంట్లోంచి పారిపోయి.. ఎడారిలో రోజుల తరబడి పరుగులు పెట్టింది. ఏ సమాచారం లేకపోవడంతో ఇంట్లో వాళ్లు కూడా ఆమె చనిపోయిందనే అనుకొన్నారు. పాస్‌పోర్టు లేదు. ఇలాంటి మహిళలు ఎందరో! ఒకావిడ 29 ఏళ్లు దుబాయ్‌లోనే ఉండిపోయింది వచ్చే అవకాశం లేక. ఇటువంటి వారిని ఎంబసీ అధికారులతో మాట్లాడి స్వదేశానికి తీసుకొస్తున్నాం. ఇందుకోసం 50కిపైగా దేశాలు తిరిగి, 5 వేలమందిని కాపాడాం. కొత్తగా విదేశాలకు వెళ్లేవారు మోసపోకుండా అవగాహన తీసుకొస్తున్నాం. 26 ఏళ్లలో మా సంస్థలో 1.5 లక్షలమంది సభ్యులుగా చేరారు. వీళ్లకి హక్కులపై అవగాహనతోపాటు నైపుణ్యాల్లో శిక్షణా ఇస్తాం. 300 బస్తీల్లోని వర్కర్స్‌తో కలిసి పనిచేస్తున్నాం. వీరందరికీ ఈఎస్‌ఐ సదుపాయం కల్పించాలన్నది నా కల.

 మేడిశెట్టి నాగేంద్ర, భీమవరం


కళ్లు మూస్తే.. మర్చిపోం

నలో చాలామంది ఏదో ధ్యాసలో పడి కొన్ని విషయాలను మర్చిపోతుంటాం. తిరిగి ఎంత ప్రయత్నించినా గుర్తు రాదు. అయితే 15 నిమిషాలు కళ్లు మూసుకోండి. అదే గుర్తొస్తుంది. ఎలా అంటారా...లీగల్‌ అండ్‌ క్రిమినాలజీ సైకాలజీ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం... కొన్ని నేరాలు జరిగినప్పుడు దానికి సంబంధించిన ప్రత్యక్ష సాక్షులు ఏదైనా విషయం మర్చిపోతే దానిని గుర్తుచేసుకోవడానికి ఒకసారి కళ్లు మూసుకుంటారట. అప్పుడు మరింత సమాచారాన్ని గుర్తుతెచ్చుకుంటారని పరిశోధనల్లో  తేలింది. కాబట్టి, ఇకపై ఏదైనా మర్చిపోయినప్పుడు ప్రశాంతంగా కళ్లు మూసుకొని ఆలోచించండి చాలు. ఠక్కున గుర్తొచ్చేస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్