మనసున్న నాయకురాళ్లు!

వ్యవస్థ సరిగా లేదు... సమాజంలో మార్పు రావాలి... ఇలా సమస్యలను వేలెత్తి చూపేవారే ఎక్కువ. కొందరు మాత్రమే... వాటి పరిష్కారానికి మనవంతుగా ఏం చేయొచ్చు అని ఆలోచిస్తారు. ఆ దిశగా అడుగులూ వేస్తుంటారు. వారినే ‘లీడర్‌’లు అంటాం. తమ తమ రంగాల్లో అలా కృషి చేస్తున్నవారిని వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ ఏటా ‘యంగ్‌ గ్లోబల్‌ లీడర్లు’గా ఎంపిక చేస్తోంది.

Updated : 13 Apr 2024 04:58 IST

వ్యవస్థ సరిగా లేదు... సమాజంలో మార్పు రావాలి... ఇలా సమస్యలను వేలెత్తి చూపేవారే ఎక్కువ. కొందరు మాత్రమే... వాటి పరిష్కారానికి మనవంతుగా ఏం చేయొచ్చు అని ఆలోచిస్తారు. ఆ దిశగా అడుగులూ వేస్తుంటారు. వారినే ‘లీడర్‌’లు అంటాం. తమ తమ రంగాల్లో అలా కృషి చేస్తున్నవారిని వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ ఏటా ‘యంగ్‌ గ్లోబల్‌ లీడర్లు’గా ఎంపిక చేస్తోంది. వారికి దిశానిర్దేశం కూడా చేస్తోంది. ఈ ఏడాది 80కిపైగా దేశాల నుంచి 90 మంది ఎంపికయ్యారు. వారిలో మనవాళ్లు ఆరుగురు ఉంటే... నలుగురు మహిళలు కావడం విశేషం!


కలలకు రెక్కలిస్తూ రిచా బాజ్‌పేయి

చదువు పూర్తవకముందే కలల వ్యాపారం గురించి ఊహల్లో తేలిపోయే విద్యార్థులెందరో. తీరా మార్కెట్‌లోకి అడుగుపెట్టాకే బోలెడు కష్టాలు. అలాంటివాళ్లకి సాయం చేస్తే గొప్ప వ్యాపారవేత్తలు వెలుగులోకి వస్తారని నమ్మింది రిచా. ఈమెది బెంగళూరు. పైగా 21 ఏళ్ల వయసులో విద్యార్థినిగా ‘గూడేరా’ మొదలు పెట్టినపుడు ఆ కష్టాలన్నీ తనకూ సుపరిచితమే. అందుకే తన స్టార్టప్‌ నిలదొక్కుకున్నాక వివిధ బ్యాంకులు, సంస్థలతో ఒప్పందం చేసుకుని మరీ ‘క్యాంపస్‌ ఫండ్‌’ ప్రారంభించింది. ఇది పెట్టుబడి, మెంటారింగ్‌ వంటి ఎన్నో అంశాల్లో స్టార్టప్‌లకు సాయం చేస్తుంది. ‘ప్రపంచంతో పోలిస్తే మన దేశంలోనే యువ జనాభా ఎక్కువ. దీంతో కొత్త సంస్థలు రావడమే కాదు, ఉద్యోగాలూ పెరుగుతా’యంటోన్న రిచా ఎన్నో భారతీయ స్టార్టప్‌లకు సాయం అందిస్తోంది. తన ఆలోచనతో ఫోర్బ్స్‌ ఇండియా, ఆసియా, ఎంఐటీ ఇన్నోవేటర్‌ సహా ఎన్నో జాబితాల్లో చోటు సంపాదించుకుంది.


కష్టమెరిగిన యువరాణి ప్రియా అగర్వాల్‌

మండు వేసవిలో రాజస్థాన్‌ ఎడారి ఇసుకలో చెప్పుల్లేకుండా నడుస్తుంది. మరోసారి ఫ్యాక్టరీలో కణకణలాడే లోహాలతో పనిచేస్తుంది. ఇంకా ఇలాంటివెన్నో. అలాగని ప్రియా అగర్వాల్‌ హెబ్బర్‌ సాధారణ యువతేం కాదు. ‘మెటల్‌ కింగ్‌’గా పేరొందిన వేదాంత గ్రూప్‌ ఛైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ గారాలపట్టి. మరి ఇవన్నీ ఏమిటంటే... కష్టం విలువ తెలియాలంటే ప్రయత్నించి చూడటమొక్కటే మార్గం అంటుంది. ముంబయి ప్రధాన కార్యాలయంగా పనిచేస్తోన్న వేదాంత... ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మైనింగ్‌ సంస్థ. ఈ పురుషాధిక్య రంగంలోకి చదువు పూర్తవడంతోనే అడుగుపెట్టింది ప్రియ. డైరెక్టర్‌గా చేస్తూనే... సీఈఓగా హిందుస్థాన్‌ జింక్‌ అనే సబ్సిడరీ సంస్థను అగ్రగామిగానూ నిలిపింది. ఒంటరి తల్లులకు ప్రత్యేక సాయం, మైనింగ్‌లో మహిళలకు అవకాశాల పెంపు, నాయకత్వ హోదాలివ్వడంతోపాటు పిల్లల కోసం చైల్డ్‌ కేర్‌ సెంటర్లు వంటివెన్నో ప్రారంభించి ఉద్యోగుల మనసు గెలుచుకుంది. సంస్థలో పర్యావరణ పరిరక్షణ, సస్టెయినబిలిటీకి ఆస్కారముండే విధానాలకు ప్రాధాన్యమిస్తోంది. ‘యోధ’ పేరుతో జంతు సంరక్షణ సంస్థనీ నిర్వహిస్తోంది. సమస్యలకు త్వరగా స్పందించడం, ప్రభావవంతమైన పరిష్కారాలు చూపడం ఈమె నైజం. ఆ తీరే ప్రియను మనసున్న నాయకురాలిగా నిలిపింది.


సమాజం కోసం... భూమి పెడ్నేకర్‌

ఒక సీన్‌ ఇచ్చి భూమి పెడ్నేకర్‌ని నటించమన్నారట. తీరా చేశాక ‘నువ్వే ఈ సినిమాకి హీరోయిన్‌’ అనేసరికి షాకయ్యింది. యష్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థలో తను అసిస్టెంట్‌ కాస్టింగ్‌ డైరెక్టర్‌. నటి కావాలన్న ఆలోచన అసలే లేదు. సీన్‌ చెప్పి చేయమంటే రిఫరెన్స్‌ కోసం అనుకుంది. అది ఆడిషన్‌ అని కానీ... తనకు హీరోయిన్‌ అవకాశం వస్తుందనికానీ భూమి ఊహించలేదు మరి. అలా బాలీవుడ్‌ సినిమాల్లోకి అడుగుపెట్టినా, ఆరేళ్లలో 26 అవార్డులతోపాటు స్టార్‌ హోదానీ అందుకుంది. తను నటించిన ప్రతి సినిమా సమాజంలోని ఏదో ఒక సమస్య గురించి చర్చించేలా ఉంటుంది. తొలి సినిమా ‘దమ్‌ లగాకే హయీశా’ నుంచి దీన్నో సంప్రదాయంగా మార్చుకుంది భూమి. నిజజీవితంలోనూ క్లైమేట్‌ వారియర్స్‌తోపాటు మరెన్నో ఎన్‌జీఓలతో కలిసి వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తోంది. ‘యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌’కి భారత్‌ తరఫున నేషనల్‌ అడ్వకేట్‌గా, ‘హీలింగ్‌ హిమాలయాస్‌’కి అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. చేసేదేదైనా సమాజంలో మార్పునకు కారణమవ్వాలనే భూమి... ఖాళీ సమయంలోనే కాదు, ప్రత్యేకంగా సమయం కుదుర్చుకుని మరీ వీటికోసం పనిచేస్తోంది.


అమ్మకు వెన్నెముక అద్వైత నాయర్‌

‘నైకా’ ప్రారంభించాలి అనుకున్నప్పుడు ఫల్గుణి నాయర్‌కి తట్టిన తొలిపేరు కూతురు అద్వైతదే! అలాగని తనేమీ వ్యాపారంలో పండిపోయిన వ్యక్తీ కాదు. 21 ఏళ్లమ్మాయి... చదువూ పూర్తవ్వలేదు. అయినా అద్వైత ఉంటే కొండంత అండ అనుకున్నారట ఫల్గుణి. తల్లి ఊహించినట్టుగానే అద్వైత ‘నైకా’కి బలంగా మారింది. వేటితో ప్రారంభించాలి దగ్గర్నుంచి వెబ్‌సైట్‌ రూపకల్పన వరకు తనే దగ్గరుండి చూసుకుంది. ‘ఇతరులు రెండేళ్లలో సాధించేది మనం ఆరునెలల్లో సాధించగలగాలి. అదీ విజయమంటే’ అని లక్ష్యాన్ని నిర్దేశిస్తూనే... పెట్టుబడులు తెప్పించడం, మార్కెటింగ్‌, కస్టమర్‌ సర్వీస్‌, వెబ్‌సైట్‌ డిజైనింగ్‌ వంటి కీలక బాధ్యతలన్నీ తీసుకుంది. అందుకే ‘అద్వైత ఆలోచనలే మా విజయానికి మూల’మని ఫల్గుణి చెబుతారు కూడా. బ్యూటీ సంస్థగా ‘నైకా’ లాభాల్లో దూసుకెళుతోంది చాలని సంతృప్తి పడలేదు అద్వైత. రిటైల్‌ స్టోర్లు ప్రారంభించింది. ‘నైకా ఫ్యాషన్‌’ పేరుతో మల్టీబ్రాండ్‌ రిటైల్‌ బిజినెస్‌ని జోడించింది. తర్వాత సొంత బ్రాండ్‌లనీ దానికి చేర్చి సీఈఓగా లాభాల బాట పట్టించి ‘యంగ్‌ లీడర్‌’గా సత్తా చాటుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్