మహిళల కోసం... ‘పింక్‌ స్క్వాడ్‌’..!

చెన్నై డాక్టర్‌ ఎం.జీ రామచంద్రన్‌ సెంట్రల్‌ మెట్రోస్టేషన్‌ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. ప్లాట్‌ఫాంపై అప్పటివరకు నిలబడి ఉన్న ఓ అమ్మాయి.. ఆగిన రైల్లోకి ఎక్కింది. ఆమెనే అనుసరిస్తున్న ఒక ఆకతాయి కుర్రాడు ఊహించనంత వేగంగా ఎక్కాడు.

Published : 14 Apr 2024 02:13 IST

చెన్నై డాక్టర్‌ ఎం.జీ రామచంద్రన్‌ సెంట్రల్‌ మెట్రోస్టేషన్‌ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. ప్లాట్‌ఫాంపై అప్పటివరకు నిలబడి ఉన్న ఓ అమ్మాయి.. ఆగిన రైల్లోకి ఎక్కింది. ఆమెనే అనుసరిస్తున్న ఒక ఆకతాయి కుర్రాడు ఊహించనంత వేగంగా ఎక్కాడు. ఆ తరవాత ఆ అమ్మాయిని వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టాడు. అంతగా జనం ఎక్కని ఆ పెట్టెలో ఆ అమ్మాయికి భయంతో ఏం చేయాలో తోచలేదు. అంతలో నలుపు రంగు యూనిఫాం, స్పోర్ట్స్‌ క్యాప్‌, చేతిలో లాఠీతో వేగంగా ఒకామె అక్కడికొచ్చింది. క్షణాల్లో ఆ ఆకతాయి చేతులు రెండింటినీ వెనక్కిలాగి పట్టి, పోలీసులకు సమాచారాన్నిచ్చింది. ఆమె మరెవరో కాదు. దేశంలోనే తొలిసారిగా చెన్నై మెట్రో ప్రారంభించిన ‘పింక్‌ స్క్వాడ్‌’ సభ్యురాలు. తమిళనాడులోని చెన్నై మెట్రోస్టేషన్లలో ఈ విమెన్‌ స్క్వాడ్‌ నిఘా చేపడుతూ.. మహిళలకు రక్షణ కల్పిస్తోంది. 

పింక్‌ స్క్వాడ్‌లోని 23మంది మహిళలు మార్షల్‌ఆర్ట్స్‌లో ఆరితేరారు. ఆత్మరక్షణతోపాటు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌లోనూ వీరంతా శిక్షణ పొందారు.సెంట్రల్‌, అరిజ్ఞర్‌ అన్నా ఆలందూర్‌, ఎయిర్‌పోర్ట్‌ మెట్రో స్టేషన్లలో మహిళలపట్ల ఎటువంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా, ఈవ్‌ టీజింగ్‌కు గురికాకుండా ఈ స్క్వాడ్‌ కాపలా కాస్తోంది. ‘గృహిణిగా ఉన్న నేను ఇలా స్క్వాడ్‌లో ఒకరినవుతానని కలలో కూడా అనుకోలేదు. మెట్రో రైళ్లు, స్టేషన్లలో పెట్రోలింగ్‌ చేయాల్సిన బాధ్యత తీసుకోవడం సంతోషంగా ఉంది’ అంటుంది ఈ స్క్వాడ్‌లో ఒకరైన గోమతి.  మహిళా ప్రయాణికులకు రక్షణగా మేమున్నామనే ధైర్యాన్నిస్తున్నాం అంటుంది మరొక సభ్యురాలు 21ఏళ్ల అనిష్‌ నిషా. ‘కరాటేలో బ్లాక్‌ బెల్ట్‌ తీసుకున్నా. ఎవరికి ఏ ఆపద వచ్చినా కాపాడటానికి సిద్ధంగా ఉంటా. రైలుపెట్టెలోకి అడుగుపెట్టిన వెంటనే నన్ను నేను పరిచయం చేసుకుంటా. ఎవరిపైనైనా అనుమానం వచ్చినా, ఆపద అనిపించినా తక్షణం మాకు సమాచారమివ్వాలని సంబంధిత ఫోన్‌ నంబరు చెబుతా. మహిళలపట్ల ఎవరైనా అమానుష ప్రవర్తన, టీజింగ్‌ వంటివి జరగకుండా నిత్యం కాపలా కాయడం నా బాధ్యత’ అంటోందీమె. అలాగే ఈ స్క్వాడ్‌లోని మరో సభ్యురాలు మోనీషా కరాటే శిక్షకురాలు. ‘చెన్నై నుంచి 54 కిలోమీటర్ల దూరం వరకూ ప్రయాణించే మెట్రో రైళ్లు నిత్యం రద్దీగా ఉంటాయి. నగరానికి దూరంగా ఉండే ఆలందూర్‌, ఎయిర్‌పోర్ట్‌ మెట్రోస్టేషన్ల వరకూ వెళ్లే మహిళా ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చూడటమే మా బాధ్యత. వాళ్ల కోసం మేమున్నామనే నమ్మకం అమ్మాయిలకు కలిగితే చాలు. వారంతా ఆత్మవిశ్వాసంతో తమ గమ్యానికి చేరుకుంటారు. అదే మా లక్ష్య’మని చెబుతోంది మోనీషా. రోజూ లక్షలమంది ప్రయాణించే మెట్రోలో మహిళలకి తమకు రక్షణపరంగా ఇబ్బందులెదురవుతున్నాయని ఒక సర్వేలో తేలడమే ఈ పింక్‌స్క్వాడ్‌ ఏర్పాటుకు కారణమైంది. ఈ తరహా సేవలు దేశవ్యాప్తం చేస్తే మహిళలంతా ధైర్యంగా ప్రయాణం చేయొచ్చు కదూ...

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్