లెక్కలు రావాలా... సబ్‌స్క్రైబ్‌ చేయాలి!

గణితం అంటే ఆసక్తి ఉన్న పిల్లల కంటే ఆ అంకెల తికమకకు మూగబోయేవారే ఎక్కువ. ఒకప్పుడు ట్యూషన్లు అయినా చెప్పుకోవచ్చని మ్యాథమేటిక్స్‌ సబ్జెక్టు ఎంచుకున్న ఆమె, ఇప్పుడు ఆన్‌లైన్లో లక్షల మంది విద్యార్థులకు ఇష్టమైన లెక్కల టీచరమ్మగా మారిపోయారు. ఆవిడే చెన్నైకి చెందిన రూబీ థెరిసా.

Published : 15 Apr 2024 07:14 IST

గణితం అంటే ఆసక్తి ఉన్న పిల్లల కంటే ఆ అంకెల తికమకకు మూగబోయేవారే ఎక్కువ. ఒకప్పుడు ట్యూషన్లు అయినా చెప్పుకోవచ్చని మ్యాథమేటిక్స్‌ సబ్జెక్టు ఎంచుకున్న ఆమె, ఇప్పుడు ఆన్‌లైన్లో లక్షల మంది విద్యార్థులకు ఇష్టమైన లెక్కల టీచరమ్మగా మారిపోయారు. ఆవిడే చెన్నైకి చెందిన రూబీ థెరిసా...

మూడు దశాబ్దాల క్రితం... రూబీ మ్యాథ్స్‌ టీచర్‌గా ఓ ప్రభుత్వ పాఠశాలలో చేరినప్పుడు చాలామంది పిల్లలు లెక్కలు అర్థంకాక తికమక పడడం గమనించారు. వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలని పుస్తకాలన్నీ వెతికి, రకరకాల పద్ధతుల్లో బోధించేవారామె. కేవలం నేర్పించి వదిలేయడమే కాదు, ఆ అంశాలను రోజూవారీ జీవితంలో ఎలా వినియోగించుకోవాలో కూడా తెలియజేసేవారు. అది 2010... మనదేశంలో యూట్యూబ్‌ ప్రయాణం మొదలుపెట్టి కొన్నాళ్లే అవుతోంది. రూబీ దాని గురించి తెలుసుకోవడమే కాదు.. ఇతర దేశాల్లో గణిత బోధనా వీడియోలను చూసి, పిల్లలకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో నేర్చుకున్నారు.

ఆ మెలకువలను మరింత మందికి నేర్పించాలని 2011లో యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించారు. పిల్లలు కాన్సెప్టులను బట్టీపట్టకుండా తేలిగ్గా అర్థంచేసుకునేలా వివరించేవారు. ట్రిగ్నామెట్రీ అరచేత్తో నేర్చుకునే టెక్నిక్‌ను చెబుతూ, రూబీ టీచర్‌ చేసిన వీడియోకు పాతికలక్షలకు పైగానే వీక్షణలు వచ్చాయి. అదిమొదలు ఆమె క్రమంగా సులువుగా లెక్కలు నేర్చుకునే వీడియోలెన్నో పెట్టారు. దాంతో క్రమంగా రూబీ ఛానెల్‌ ఐదున్నర లక్షలమంది ఫాలోయర్లతో, మొత్తం 4.4కోట్ల వీక్షణలు సొంతం చేసుకుంది.

ట్యూషన్లు చెప్పొచ్చని...

నమ్మక్కాల్‌లోని తిరుచ్చెన్‌గోడ్‌లో పుట్టారు రూబీ. తండ్రి విద్యుత్‌ బోర్డులో పనిచేసేవారు. తన తల్లికి అనారోగ్య సమస్యలు రావడంతో, నాన్న సంపాదించే డబ్బంతా వైద్యానికి సరిపోయేది కాదు. దాంతో కుటుంబాన్ని పోషించడం ఆయనకు భారమైంది. అప్పుడే తన బంధువు ఒకరు గణితం చదివితే, పిల్లలకు ట్యూషన్లు చెప్పుకోవచ్చని సలహా ఇచ్చారామెకు. దాంతో బీఏ మ్యాథమేటిక్స్‌ పూర్తిచేశారు రూబీ. పెళ్లయ్యాక భర్త ఫెలిక్స్‌ సాయంతో బీఎడ్‌ పూర్తిచేసి ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా చేరారు. తమిళ మీడియంలో చదువుకున్న రూబీ, ఇంగ్లిషులో పాఠాలు చెప్పడానికి మొదట్లో ఇబ్బందిపడ్డారు. కానీ, భర్త ఇంగ్లిష్‌ టీచర్‌ కావడంతో భాష నేర్చుకుని ఆ సమస్యను అధిగమించారు. ఆ తరవాత ప్రభుత్వ ఉద్యోగం వచ్చి 2007లో సేలంలోని స్కూల్లో చేరినా, భర్త మరణంతో తన సొంతూరుకే ఉద్యోగం మార్చుకున్నారు. ‘ఇన్నేళ్లుగా నేను తెలుసుకున్న లెక్కల  టెక్నిక్‌లు, అందరికీ అందాలని యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించాను. నాకూ వయసు పెరుగుతోంది కాబట్టి భవిష్యత్తు తరాల కోసం వీటన్నింటినీ ఒకచోట ఉండేలా చేయాలనుకున్నా. వేలమంది విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులకు నా పద్ధతులు ఉపయోగపడుతున్నాయంటే చాలా సంతోషంగా ఉంది. పిల్లలకు బోధించాలంటే మనమూ అప్‌డేట్‌గా ఉండాలిగా. అందుకే ఎమ్మెస్సీ కంప్యూటర్స్‌ కూడా చేశా’ అంటారు రూబీ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్