మిద్దెపై సుగంధద్రవ్యాలు.!

మార్కెట్లో మసాలా దినుసులు కూడా నకిలీవి వస్తున్నాయని ఆలోచించేవారికి... వీటిని కూడా పెరట్లో ఎవరికివారు పండించుకోవచ్చని చెబుతున్నారు డాక్టర్‌ రతి అన్షు. ‘ముంగిట్లో ఈ మొక్కలుంటే ఇంటిల్లపాదికీ ఆరోగ్యం.

Published : 16 Apr 2024 01:55 IST

మార్కెట్లో మసాలా దినుసులు కూడా నకిలీవి వస్తున్నాయని ఆలోచించేవారికి... వీటిని కూడా పెరట్లో ఎవరికివారు పండించుకోవచ్చని చెబుతున్నారు డాక్టర్‌ రతి అన్షు. ‘ముంగిట్లో ఈ మొక్కలుంటే ఇంటిల్లపాదికీ ఆరోగ్యం. వీటిని పండించుకుంటే ఆరోగ్యకరమైన ఆహారం మన సొంతం’ అంటున్న రతి 15 రకాలకుపైగా మసాలాలను మిద్దెపై పండించి మరీ చూపిస్తున్నారు.

‘మాది ఉత్తరాఖండ్‌లోని రూర్కీ. ఎలాంటి మొక్కలనైనా పెంచడానికి ఇక్కడి వాతావరణం అనుకూలం. మట్టి కూడా సారవంతమైంది. చిన్నప్పటి నుంచి మొక్కల పెంపకమంటే చాలా ఇష్టం. పెళ్లైన తరవాత ఈ ఆసక్తి మరింత పెరిగింది. మావారు తాజాగా పెరిగే మెంతి ఆకు, గోధుమగడ్డితో చేసే టీ అంటే ఎక్కువ ఇష్టపడతారు. పెరట్లో పెరిగిన కూరగాయలతో చేసినప్పుడు వంట రుచిగానే కాదు, పోషకాలూ పుష్కలంగా అందుతాయి. వైద్యవృత్తిలో ఉన్న నేను బయటివారికి చెప్పడానికంటే ముందు మా ఇంట్లో వాళ్లకి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలనుకున్నా. అలా కూరగాయల పెంపకం కోసం 1,500 చదరపుటడుగులున్న మిద్దెను వాడుకున్నా’అంటారీమె.

కాలాన్ని బట్టి...

మిద్దె సాగులోభాగంగా కూరగాయలుసహా నారింజ, జామ, యాపిల్‌ పండ్లనూ, ఆకుకూరలనూ పండించడం మొదలుపెట్టారు రతి. వాటితో పాటు లెట్యూస్‌, స్ట్రాబెర్రీ, కుంకుమపువ్వు వంటివాటినీ సాగు చేస్తున్నారీమె. ‘మన దేశంలో అన్ని రకాల పంటలనూ పండించే వాతావరణం ఉంటుంది. అయితే ఆయా రకానికి అనువైన వాతావరణాన్ని మనం గుర్తించాలి. నల్ల మిరియాలు, జీలకర్ర వంటివాటికి చలికాలం అనుకూలమైతే, పసుపు వేసవి కాలంలో పండుతుంది. అలాగే మేలురకమైన విత్తనాలను ఎంచుకుని సహజ ఎరువులను అందించాలి’ అంటోన్న రతి, తమ మిద్దెపై లవంగాలు, దాల్చినచెక్క, జీలకర్ర, బిరియానీ ఆకులు, మిరియాలు, యాలకులు, జాజికాయ, మెంతులు, కుంకుమపువ్వు, పసుపు, సోంపు, ఇంగువ వంటి 15 రకాల మసాలాలనూ ప్రత్యేకంగా పండిస్తున్నారు.

అంతేకాదు, వీటినెలా పెంచొచ్చు అనేది ఇన్‌స్టాలో వీడియోగా పోస్టు చేస్తున్నారు. ఔషధమూలికలైన అశ్వగంధ, తులసి, కర్పూరవల్లి వంటివీ ఈమె మిద్దెపై కనిపిస్తాయి. ‘మొత్తం 400రకాలకుపైగా మొక్కలు మా మిద్దెపై ఉన్నాయి. ప్రతి మొక్కా మొలకెత్తడానికి ఒక్కో సమయం ఉంటుంది. మెంతులు వారంలోపు మొలకెత్తితే, జీలకర్రకు 45 రోజులు పడుతుంది. జీలకర్ర పంట రావడానికి 5 నెలలు పడుతుంది. మిరియాలు రెండు నుంచి మూడేళ్లు, యాలకులకు అయిదేళ్లకాలం పడుతుంది.

అలాగే ఏ మొక్కనైనా ముందుగా చిన్నదాంట్లో మొలకెత్తించిన తరవాతే, పెద్ద తొట్టెలోకి మార్చాలి. ఆవుపేడ ఎరువు, వేపాకుల పొడి కలిపిన మట్టిని ఫ్లవరింగ్‌ మొదలయ్యే రెండు వారాల ముందు తొట్టెల్లో వేస్తుంటే కావాల్సిన పోషకాలు అందుతాయి’అంటూ.. మసాలాలను సైతం పెరట్లో పండించొచ్చని నిరూపిస్తున్నారీమె.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్