‘ బిగుల్‌’... ఆమె చేతిలో!

అధికారిక కార్యక్రమాలు, పరేడ్‌లు వగైరా ప్రారంభమయ్యే ముందు తుతారీ లేదా బాకా వాయించిన శబ్దం వస్తుంది గమనించారా? ముందువైపు హారన్‌లా మిగతా భాగం చుట్టచుట్టినట్లుగా ఉండే ఆ వాద్య పరికరం పేరు ‘బిగుల్‌’.

Published : 16 Apr 2024 02:00 IST

అధికారిక కార్యక్రమాలు, పరేడ్‌లు వగైరా ప్రారంభమయ్యే ముందు తుతారీ లేదా బాకా వాయించిన శబ్దం వస్తుంది గమనించారా? ముందువైపు హారన్‌లా మిగతా భాగం చుట్టచుట్టినట్లుగా ఉండే ఆ వాద్య పరికరం పేరు ‘బిగుల్‌’. అమరవీరులకు నివాళి ఇచ్చేప్పుడూ, జెండా ఎగురవేసేప్పుడూ దీన్ని తప్పక వాయిస్తారు. అది విన్నప్పుడు చుట్టూ వాతావరణం గంభీరంగా మారిపోతుంది. దేశభక్తి, గర్వం, అభిమానం వంటి భావోద్వేగాలతో మనసంతా నిండిపోతుంది. పోలీసు, మిలిటరీ కార్యక్రమాల్లో, శిక్షణ, యుద్ధ సమయాల్లో సూచనలను ఇవ్వడానికీ ఈ ‘బిగుల్‌’నే ఉపయోగిస్తారు. ఇంతటి ప్రాధాన్యమున్న ఈ వాద్యమెప్పుడూ మగవారి చేతిలోనే కనిపిస్తుంది కదూ! ఇక్కడా పురుషాధిక్యతేనా? అన్ని రంగాల్లో దూసుకొస్తున్న మహిళలకు దీన్నీ వాయించే అవకాశం ఎందుకు ఇవ్వకూడదు అని ఆలోచించింది హిమాచల్‌ ప్రదేశ్‌ పోలీసు శాఖ. అందుకే శివానీ, శ్వేత, నీషు అనే ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లకు బిగుల్‌ వాయించడంలో శిక్షణనీ ఇప్పించింది. నాలుగు నెలల ప్రాథమిక కోర్సు పూర్తిచేసుకొని తాజాగా విధుల్లోకీ చేరిందీ బృందం. దేశంలోనే తొలి ‘విమెన్‌ బిగులర్‌ ప్లేయర్స్‌’గా నిలిచిన ఈ మహిళలు అక్కడి ఇండియన్‌ రిజర్వ్‌ బెటాలియన్‌లోనూ సేవలు అందిస్తున్నారు. ‘పురుషులకు మాత్రమే అన్న విభాగాల్లోనూ మహిళలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం. మరిన్ని విభాగాల్లో వారి సేవలను కొనసాగించే ఆలోచనలో ఉన్నాం’ అంటోన్న ఈ పోలీసు శాఖ నిర్ణయం అభినందనీయమే కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్