రైతు కూతురు... పిచ్‌ క్యూరేటర్‌!

చిన్నస్వామి స్టేడియం... కాసేపట్లో రంజీ మ్యాచ్‌ ప్రారంభం అవుతోందనగా చినుకులు మొదలయ్యాయి. అప్పుడు వినిపించిందో మహిళ గొంతు. పిచ్‌ను కవర్‌ చేయమంటూ గ్రౌండ్‌ మెన్‌లకు చకాచకా ఆజ్ఞలిస్తోంది.

Published : 18 Apr 2024 01:37 IST

చిన్నస్వామి స్టేడియం... కాసేపట్లో రంజీ మ్యాచ్‌ ప్రారంభం అవుతోందనగా చినుకులు మొదలయ్యాయి. అప్పుడు వినిపించిందో మహిళ గొంతు. పిచ్‌ను కవర్‌ చేయమంటూ గ్రౌండ్‌ మెన్‌లకు చకాచకా ఆజ్ఞలిస్తోంది. పిచ్‌ క్యూరేటర్లు కదా ఆ పని చేసేదంటారా? ఆమె పిచ్‌ క్యూరేటరే! దేశంలో గుర్తింపు పొందిన తొలి మహిళా క్యూరేటర్‌... జసింతా కల్యాణ్‌!

బెంగళూరుకు 80 కి.మీ. దూరంలోని హరోబెలె జసింతాది. వ్యవసాయ కుటుంబం. ఊళ్లో చదువు కొనసాగించే అవకాశాలు లేకపోయినా ఆమె భవిష్యత్తు బాగుండాలని బెంగళూరుకు పంపారు. హాస్టల్‌లో ఉండే చదువు కొనసాగించారామె. కుటుంబానికి అండగా ఉండాలని కర్ణాటక స్టేట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ క్లబ్‌ హౌజ్‌లో రిసెప్షనిస్టుగా చేరారు. ఇది 1993 నాటి మాట. తరవాత గ్రౌండ్‌ స్టాఫ్‌ డిపార్ట్‌మెంట్‌కు మేనేజర్‌గా బదిలీ అయ్యారు. రైతు కుటుంబం నుంచి వచ్చారు కదా... మట్టిపై ప్రేమ సాధారణమే. దీంతో పిచ్‌, దాని నిర్వహణలను ఆసక్తిగా గమనించేవారామె. అది ఓసారి కర్ణాటక క్రికెట్‌ అసోసియేషన్‌ సెక్రటరీ బ్రిజేష్‌ పటేల్‌ కంట పడింది. ‘పిచ్‌ క్యూరేటర్‌ అవ్వాలనుందా’ అనడిగారట. ఆ మాటకి తడబడినా వెంటనే సరేనన్నారు జసింత.

క్యూరేటింగ్‌కి సంబంధించి కొంత కూడా అవగాహన లేదు. కానీ నేర్చుకోవాలన్న ఆసక్తే తనను ముందుకు నడిపించింది అంటారీమె. అక్కడి క్యూరేటర్ల వద్ద శిక్షణ తీసుకొని మెలకువలన్నీ నేర్చుకోవడమే కాదు, బీసీసీఐ నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు కూడా. 2018 నుంచి అధికారికంగా రంజీ మ్యాచ్‌లకు సేవలూ అందిస్తున్నారు. తాజాగా డబ్ల్యూపీఎల్‌ కోసమూ పనిచేశారు. బీసీసీఐ సెక్రటరీ జే షా ఈమె గురించి ఎక్స్‌లో పోస్ట్‌ చేయడంతో ప్రపంచానికి జసింతా పరిచయం అయ్యారు. ‘క్రికెట్‌ మ్యాచ్‌లు విజయవంతంగా కొనసాగడంలో తెర వెనక ఈమె పాత్రా ఎక్కువే’ అంటూ పొగిడారాయన. ‘స్టేడియంతో నా అనుబంధం 30 ఏళ్లది. క్యూరేటర్‌గా బాధ్యతలు తీసుకోవడం కొత్తే అయినా సవాలుగా తీసుకున్నా. వ్యవసాయం, పిచ్‌ నిర్వహణ రెండూ సైన్స్‌తో ముడిపడినవే. సరైన పద్ధతిలో చేస్తే పంట బాగా పండుతుంది. పిచ్‌ విషయంలో కాస్త కష్టపడాలి. ఒక్కో కాలంలో ఒక్కోలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకరకంగా పసిపాపాయిని చూసుకున్నట్లే ఉంటుంది. అయితే ప్రేమతో చేస్తే ఏదైనా సులువే అనిపిస్తుంది’ అంటారు 49 ఏళ్ల జసింతా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్