ఆ వందలో... ఈ నలుగురు!

అభినయంతో ఆకట్టుకునే అభినేత్రి... ఆధునిక సమాజాన్ని తీర్చిదిద్దే కార్పొరేట్‌ దిగ్గజం... పరిశోధనలతో మానవాళిని కాపాడే శాస్త్రవేత్త...  ఇలా తమదైన రంగాల్లో నేటి ప్రపంచాన్ని ప్రభావితం చేసే వ్యక్తులకోసం టైమ్‌ మ్యాగజీన్‌ దేశాలన్నీ గాలిస్తుంది... ఎన్నో వడబోతల అనంతరం మేధావులు మెచ్చిన, జనం నచ్చిన వందమందిని ప్రకటిస్తుంది.

Updated : 19 Apr 2024 07:29 IST

అభినయంతో ఆకట్టుకునే అభినేత్రి... ఆధునిక సమాజాన్ని తీర్చిదిద్దే కార్పొరేట్‌ దిగ్గజం... పరిశోధనలతో మానవాళిని కాపాడే శాస్త్రవేత్త...  ఇలా తమదైన రంగాల్లో నేటి ప్రపంచాన్ని ప్రభావితం చేసే వ్యక్తులకోసం టైమ్‌ మ్యాగజీన్‌ దేశాలన్నీ గాలిస్తుంది... ఎన్నో వడబోతల అనంతరం మేధావులు మెచ్చిన, జనం నచ్చిన వందమందిని ప్రకటిస్తుంది. అలా ఈ ఏడాది ఎంపికచేసిన ఎనిమిది మంది భారతీయుల్లో... నలుగురు మహిళలు కావడం విశేషం!


మనసున్న తార

‘అద్భుతమైన నటి’ విదేశీ గడ్డ మీదా ఈ కితాబును అందుకుంది ఆలియా భట్‌. గత ఏడాది ‘హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌’తో హాలీవుడ్‌లోకి అడుగుపెట్టి, విదేశీ అభిమానులనూ సంపాదించుకుంది. తన సినిమా గంగూబాయి కాఠియావాడీకి జాతీయ ఉత్తమ నటి సహా, గతఏడాది ఫిల్మ్‌ఫేర్‌, ఓటీటీ, హాలీవుడ్‌ క్రిటిక్‌- స్పాట్‌లైట్‌ వంటి అవార్డులెన్నో అందుకుంది. ఈక్రమంలో తను దాటుకొచ్చిన సవాళ్లు, విమర్శలెన్నో! ‘ఎటర్నల్‌ సన్‌షైన్‌’ పేరుతో ప్రొడక్షన్‌ హౌజ్‌ను, ఎడ్‌ ఎ మమ్మా అనే పిల్లల బ్రాండ్‌ని ప్రారంభించింది. నైకా, ఫూల్‌, సూపర్‌ బాటమ్స్‌, స్టైల్‌ క్రాకర్‌ వంటి సంస్థల్లో పెట్టుబడులు పెట్టి విజయవంతమైన వ్యాపారవేత్తగా రాణిస్తోంది. తను ఎదగడమే కాదు, సమాజం గురించీ ఆలోచిస్తుంది. మాండ్రియన్‌ ఓరియంటల్‌ హోటల్‌గ్రూప్‌తో కలిసి ‘సలామ్‌ బాంబే ఫౌండేషన్‌’కి సాయం అందిస్తోంది. దాని ద్వారా పిల్లల భవిష్యత్తుకు సాయపడేలా నైపుణ్య శిక్షణ అందేలా చూస్తోంది. ‘కడల్స్‌’తో కలిసి క్యాన్సర్‌ చిన్నారులకు పోషకాహారం అందించడం, ‘మీ వార్డ్‌రోబ్‌ ఈజ్‌ సు వార్డ్‌రోబ్‌’ పేరుతో తన వస్తువులు అమ్మి, వచ్చిన డబ్బును దానం చేయడం లాంటివెన్నో చేస్తోంది. ఇంకా గూచి సంస్థ గ్లోబల్‌ అంబాసిడర్‌ కూడా.


విశ్వంతో ప్రేమ...

విశ్వం ఎలా పుట్టింది? శతాబ్దాలుగా శాస్త్రవేత్తలకు ఇదో మార్మికమైన విషయంగా మిగిలిపోయింది. అసలు విశ్వం పుట్టుక గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? ఎందుకంటే... అందులోనే మన భవిష్యత్తు కూడా దాగి ఉంది కాబట్టి అంటారు ప్రియంవద నటరాజన్‌. తమిళనాడులోని కోయంబత్తూరుకి చెందిన ఈమె దిల్లీలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశారు. ‘ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు. నేనూ ఓ రోజు అనుకోకుండా టెలీస్కోప్‌లో హెలీ తోకచుక్కని చూశా. అప్పట్నుంచీ ఈ అంతూదరీలేని విశ్వంతో ప్రేమలో పడ్డా. ఆస్ట్రోఫిజిక్స్‌లోనే నా కెరియర్‌ అని నిర్ణయించుకున్నా’ అంటారు ప్రియంవద. ఆ విభాగంలోనే కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ చేశారు. కాస్మాలజీ, థియరాటికల్‌ ఆస్ట్రోఫిజిక్స్‌లో పరిశోధనలు చేశారు. ట్రినిటీ కాలేజ్‌ నుంచి జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ని అందుకున్న మొదటి మహిళా ఆస్ట్రోఫిజిక్స్‌ విద్యార్థిని కూడా. ఆ తరవాతా ప్రముఖ విశ్వవిద్యాలయాల నుంచి అనేక ప్రతిష్ఠాత్మక ఫెలోషిప్‌లు అందుకున్నారు. నక్షత్రాలు, కృష్ణబిలాల గురించిన ఆసక్తికరమైన విషయాలు వెల్లడిస్తూ ఈ రంగంలో పరిశోధనలు చేస్తున్న తోటి శాస్త్రవేత్తలకు స్ఫూర్తిగా నిలిచారు. ప్రస్తుతం యేల్‌ యూనివర్సిటీలో ఆస్ట్రానమీ అండ్‌ ఫిజిక్స్‌ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ‘మన పూర్వికుల గురించి తెలుసుకోవడానికి భూమిని తవ్వుతాం. సింధు నాగరికత రహస్యాలు అలా బయటపడినవే కదా! నేనూ చేస్తుంది కూడా అలాంటిదే. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం నక్షత్రాలు విడుదల చేసిన కాంతి ఆధారంగా అంతరిక్షాన్ని తవ్వుకుంటూ వెనక్కి వెళుతున్నా. అదే మన భూమి పుట్టుకనీ, భవిష్యత్తునీ నిర్ణయిస్తుంది’ అనే ప్రియంవద ఈ విశ్వ రహస్యాలు అందరికీ అర్థమయ్యేలా ‘మ్యాపింగ్‌ ది హెవెన్స్‌: రి రాడికల్‌ సైంటిఫిక్‌ ఐడియాస్‌ దట్‌ రివీల్‌ ది కాస్మోస్‌’ అనే పుస్తకాన్ని రాసి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. పరిశోధనా రంగంలో మహిళల్ని ప్రోత్సహించేందుకు యేల్‌ యూనివర్సిటీలో నాలుగేళ్లపాటు విమెన్‌ ఫ్యాకల్టీ ఫోరమ్‌ కమిటీ ప్రధాన బాధ్యతలు తీసుకున్నారు. ‘ఎడ్జ్‌ సర్టిఫైడ్‌ ఫౌండేష’న్‌ సంస్థకి ప్రెసిడెంట్‌గా పనిచేస్తూ అనేక రంగాల్లో లింగ వివక్షని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు.


పోరాడినందుకే...

ఒలింపిక్స్‌లో పతకం సాధించిన మొదటి భారత మహిళా రెజ్లర్‌ సాక్షి మాలిక్‌. ఆసియా ఛాంపియన్‌ షిప్‌లో నాలుగు... కామన్వెల్త్‌ క్రీడల్లో మూడు పతకాలు... రియో ఒలింపిక్స్‌లో కాంస్యం... ఇవి చాలు సాక్షి ఏ స్థాయి రెజ్లరో చెప్పడానికి! దేశానికి పతకాలెన్నో తెచ్చిపెట్టిన ఆమె... జీవితంలో ఎత్తు పల్లాలెన్నో చూసింది. వాటిల్లో డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ వేధింపులకు వ్యతిరేకంగా చేసిన పోరాటం ఒకటి. బాధితుల పక్షాన నిలబడి బజరంగ్‌, వినేశ్‌లతో కలిసి ఉద్యమాన్ని పరుగులెత్తించింది. నెలల పోరాటం తరవాత ప్రభుత్వం అతడిని పదవి నుంచి తప్పించడంతో పాటు కేసులూ నమోదు చేసింది. అయితే, అవి కోర్టులో సాగుతుండగానే... డబ్ల్యూఎఫ్‌ఐకి జరిగిన ఎన్నికల్లో అతడి అనుచరుడు విజయం సాధించడంతో సాక్షి మనస్తాపానికి గురైంది. తన ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించింది. కానీ, సాక్షి చేసిన పోరాటాన్ని టైమ్స్‌ గుర్తించింది. అత్యంత ప్రభావశీలుర జాబితాలో ఆమెకు స్థానం కల్పించింది. సాక్షి మాలిక్‌ది హరియాణా. మల్లయోధుడైన తాతయ్య సుఖ్బీర్‌ని చూసి తానూ రెజ్లింగ్‌ చేయాలనుకుంది. పన్నెండేళ్ల వయసులో రోహ్‌తక్‌లోని ఓ మల్లయుద్ధ శిక్షణ కేంద్రం (అఖాడా)లో శిక్షణ తీసుకోవడం ఆరంభించింది. మొదట్లో ఆడపిల్లంటూ అడుగడుగునా అవాంతరాలు ఎదురైనా నెమ్మదిగా ఆటపై పట్టు సాధించింది. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తన సత్తా చాటింది. ఆటలో గెలుపోటములు సహజం... కానీ, విమర్శల జడి ఆగదుగా... సాక్షి వెనకబడిందనుకున్న ప్రతిసారీ... మెరుపువేగంతో పోటీలోకి దూసుకొచ్చింది. పతకాలు గెలిచి, వారి నోళ్లు మూయించింది. పదమూడేళ్ల రెజ్లింగ్‌ ప్రయాణంలో ఆటుపోట్లు ఎన్ని ఎదురయినా ఆత్మవిశ్వాసంతో అడుగులేసింది. అందుకే దేశం మెచ్చిన స్టార్‌ రెజ్లర్‌ అయ్యింది.


లండన్‌లో భారతీయం...

‘మీరు అదృష్టవంతులు కాబట్టి, కడుపు నిండా తినగలుగుతున్నారు. ఒక్కసారి మురికి వాడలకు వెళితే తిండి విలువ తెలుస్తుంది’ చిన్నతనంలో ఆస్మా ఖాన్‌ తిండి దగ్గర పేచీ పెట్టినప్పుడల్లా వాళ్ల నాన్న చెప్పే మాట ఇది. అప్పుడేమో కానీ... పెళ్లయ్యి ఇంగ్లాండ్‌కి వెళ్లాక మాత్రం ఆమెకు తిండి విలువ బాగా తెలిసొచ్చింది. ఈమెది కోల్‌కతా. విదేశాలకు వెళ్లాక ఇంటి భోజనాన్ని బాగా మిస్‌ అయ్యేవారామె. ఎంత ప్రయత్నించినా ఆ రుచే వచ్చేది కాదు. మనసు పెట్టి నేర్చుకుంటే కదా! కానీ ఈసారి అలా కాదు. ఇంటికి వెళ్లినప్పుడు వాళ్లమ్మ దగ్గర శ్రద్ధగా నేర్చుకున్నారు. తిరిగొచ్చాక ఆ రుచికి వాళ్లాయనే ఆశ్చర్యపోయారట. ప్రేమగా వండటంలోని మాధుర్యం అప్పుడే తెలిసిందావిడకి. లండన్‌లో లా డిగ్రీ, పీహెచ్‌డీ చేసినా... ఆహారానికి సంబంధించి ఏదైనా చేయాలనే తపన ఉండేది. అందుకని వీలు చిక్కినప్పుడల్లా స్నేహితులకు ‘సప్పర్‌ క్లబ్‌’ పేరుతో వండిపెట్టేవారామె. తిన్నవాళ్లు మెచ్చుకోవడమే కాదు, ఆమె వంటలకు ప్రచారాన్నీ కల్పించారు. అదెంతలా అంటే ఓ ప్రముఖ షెఫ్‌ నుంచి ఆమెకు పిలుపు వచ్చింది. ఆయన రెస్టరంట్‌లో ఫుడ్‌ ఫెస్టివల్‌ నిర్వహించేవారామె. అప్పుడొచ్చిన స్పందనతో ఆమె మీద ఆమెకు మరింత నమ్మకం వచ్చింది. భారత్‌ నుంచి వలస వచ్చి నానీలుగా మారి కష్టాలుపడుతోన్న ఎంతోమందిని తను నివసించే ప్రాంతంలో గమనించారు ఆస్మా. వాళ్లకి ఆసరా కల్పించాలనుకున్నారు. అలాంటివారిని కూడగట్టి 2017లో ‘డార్జిలింగ్‌ ఎక్స్‌ప్రెస్‌’ ప్రారంభించారు. అక్కడివారంతా 50పైబడిన మహిళలే. వంటలో ఎలాంటి శిక్షణా తీసుకోలేదు. అయినా వారి వంటలకు ప్రముఖులూ ఫిదా అవ్వడమే కాదు... ‘రెస్టరంట్‌ భోజనంలా లేదు. ఇంటి భోజనంలా ఉంద’నే కితాబులిచ్చేవారు. యూకేలోని ఉత్తమ రెస్టరంట్లలో డార్జిలింగ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఒకటి. అలా స్టార్‌ షెఫ్‌గా, వ్యాపారవేత్తగానే కాదు మనసున్న వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఆస్మా. అంతేకాదు, తన లాభాల్లో కొంత మొత్తంతోపాటు ఫుడ్‌ఫెస్టివల్స్‌ ద్వారా డబ్బు సేకరించి, భారత్‌లో నిరాదరణకు గురైన పిల్లల కోసం అందిస్తూ మాతృదేశంపై ప్రేమనీ చాటుకుంటున్నారు ఆస్మా.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్