ఓటు వేశా... భారతీయురాలినయ్యా!

‘నాకు ఓటు హక్కు వచ్చింది... నేనూ భారతీయురాలినయ్యానోచ్‌’ అని సంబరపడుతోంది చెన్నైలో ఉంటున్న నళిని. ఇదేంటి కొత్తగా భారతీయురాలు అవ్వడం ఏంటి అనేగా మీ సందేహం.

Published : 20 Apr 2024 02:04 IST

‘నాకు ఓటు హక్కు వచ్చింది... నేనూ భారతీయురాలినయ్యానోచ్‌’ అని సంబరపడుతోంది చెన్నైలో ఉంటున్న నళిని. ఇదేంటి కొత్తగా భారతీయురాలు అవ్వడం ఏంటి అనేగా మీ సందేహం. అవును, ఆమె శ్రీలంక శరణార్థురాలు. ఈ నేలపైనే పుట్టినా... ఓటుహక్కుకోసం 20 ఏళ్లు వేచి చూశారు...

ళినీ కృపాకరన్‌ పూర్వికులు ఉపాధి కోసం శ్రీలంక వెళ్లిన తమిళులు. తల్లిదండ్రులు కన్నన్‌, శాంతి వివాహం కాకముందు శ్రీలంకలోని మన్నార్‌లో ఉండేవారు. తమిళులే లక్ష్యంగా అక్కడ జరిగే దాడులకు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పారిపోయి వచ్చి 1985లో తమిళనాడులోని రామనాథపురానికి శరణార్థులుగా వచ్చారు. ఇక్కడే వాళ్లు పెళ్లిచేసుకున్నారు. ఆ తరవాత ఏడాదికే నళిని పుట్టారు. మరో రెండేళ్లకు ఇంకో తమ్ముడు జన్మించాడు. వీళ్లకు స్థిరనివాసమంటూ ఉండేది కాదు. కుటుంబమంతా రాష్ట్రంలోని వివిధ క్యాంపుల్లో తిరుగుతూ ఉండేవారు. అలా కళ్లకురిచ్చిలోని చిన్నసేలం క్యాంపునకు వచ్చారు. నళిని తనలాంటి మరో శరణార్థి కృపాకరన్‌తో వివాహమయ్యాక తిరుచ్చి క్యాంపునకు చేరుకున్నారు. అప్పటికి ఆమె వయసు 27. ‘నేను పుట్టింది ఇక్కడే. ఇదే నా దేశం. అందుకే నాకు భారత పౌరసత్వం రావాలనీ, ఓటు హక్కు పొందాలని కలలుకన్నా. నమోదు కోసం వెళ్లినప్పుడల్లా ‘మీకు రాదు’ అనే చెప్పేవారు. మేం శరణార్థ శిబిరాల్లో తలదాచుకుంటున్న వాళ్లం. హక్కులు అంత తేలిగ్గా రావని తెలుసు. కానీ ప్రయత్నం ఆపలేదు. మదురై కార్యాలయంలో పాస్‌పోర్టు కోసమూ దరఖాస్తు చేసుకున్నా. కానీ అక్కడి అధికారులూ ఇవ్వమని చెప్పేశారు. తల్లిదండ్రులు శ్రీలంకకు చెందినవారని చూపి దరఖాస్తును తిరస్కరించేవారు. న్యాయ నిపుణుల సలహా తీసుకున్నా. కోర్టుకెళ్లి చట్టప్రకారం పోరాడాలనుకున్నా. మదురైలోని హైకోర్టు బెంచిని ఆశ్రయించా. న్యాయమూర్తులు నాకు అండగా నిలిచారు.

భారతీయ పౌరహక్కుల సవరణ చట్టంలో 1950 జనవరి 26, 1987 జులై 1 మధ్య ఈ దేశంలో పుట్టినవారికి సెక్షన్‌-3 ప్రకారం పౌరసత్వం ఇవ్వొచ్చు అని వారన్నారు. రామనాథపురం సమీపంలోని మండపంలో పుట్టాను కాబట్టి.. అక్కడ జనన ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఇది 2022లో జరిగింది. ఆ సర్టిఫికెట్‌ ఆధారంగా నాకు పాస్‌పోర్టు మంజూరైంది. దీని ఆధారంగా ఓటు హక్కు పొందాలనుకున్నా. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటువేసే అవకాశం రాలేదు. ఈ లోక్‌సభ ఎన్నికల్లోనైనా ఓటువేయాలని ఎన్నికల కమిషన్‌కు దరఖాస్తు చేసుకుంటే దీనిపై విచారణ జరిపి ఈ మధ్యే ఓటు గుర్తింపుకార్డు చేతికిచ్చారు’ అనే నళిని ‘నేను మొట్టమొదటిసారి ఓటు వేశానోచ్‌, నేనూ భారతీయురాలినే’నని అందరితో గర్వంగా చెబుతున్నారు. ప్రస్తుతం తమిళనాడులో వివిధ క్యాంపుల్లో 58,457 మంది శరణార్థులు శ్రీలంకనుంచి వచ్చి ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. భవిష్యత్తులో వీరంతా ఓటు హక్కు పొందే స్ఫూర్తిని రగిలించారామె. ఇక్కడే పుట్టిన తన ఇద్దరు పిల్లలకీ పౌరసత్వాన్ని ఇప్పించడం తన తదుపరి లక్ష్యం అంటున్నారు.

  హిదాయతుల్లాహ్‌.బి, చెన్నై

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్