తొలి అడుగు పడేదెన్నడో?

1961... తొలి మానవ సహిత అంతరిక్ష నౌక విజయవంతమైన సంవత్సరం. ఆ రెండేళ్లకే మొదటి మహిళ అంతరిక్షంలోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకూ 77 మంది ఆ అవకాశం దక్కించుకున్నారు.

Published : 20 Apr 2024 02:12 IST

1961... తొలి మానవ సహిత అంతరిక్ష నౌక విజయవంతమైన సంవత్సరం. ఆ రెండేళ్లకే మొదటి మహిళ అంతరిక్షంలోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకూ 77 మంది ఆ అవకాశం దక్కించుకున్నారు. కానీ ఆ జాబితాలో భారత మహిళ పేరే లేదు.కల్పనా చావ్లా, సునీత విలియమ్స్‌, శిరీష... పేర్లు చెప్పుకొచ్చినా వాళ్లు అడుగుపెట్టిందీ అమెరికా కోటాలోనే! మరి మనకి ఆ అవకాశం రావడం లేదెందుకు?

చిన్నారికి స్కూల్లో ‘కల నెరవేర్చుకోవడం’ అనే అంశంపై వ్యాసం రాయమన్నారట. ఆమెకేమో వ్యోమగామి కావాలని కల. అదెలా సాధ్యమవుతుందో చెప్పండని నాసాకి ఉత్తరం రాసిందట. ఆమె ఆశించినట్టుగా ప్రత్యుత్తరం వచ్చింది. కానీ ‘ఇప్పట్లో మహిళలకు అవకాశం ఇచ్చే ఉద్దేశం మాకు లేద’న్న సమాధానం చూసి, ఆ చిన్నారి నిరాశ పడింది. 1962 నాటి మాట ఇది. అలాంటి అమెరికా ఇప్పుడు అత్యధిక మహిళా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపిన దేశంగా నిలిచింది.

ఒకప్పుడు అంతరిక్ష రంగమంటే అమెరికా, రష్యా పేర్లే ప్రధానంగా వినిపించేవి. విజయవంతమైన ప్రయోగాలతో భారత్‌ కూడా ఇప్పుడు వాటి సరసన నిలిచింది. అంతెందుకు... ‘గగన్‌యాన్‌’ పేరుతో మనమూ హ్యూమన్‌ స్పేస్‌ ఫ్లైట్‌ను అంతరిక్షంలోకి పంపుతున్నాం. అయితే దానికి ఎంపికైన నలుగురూ మగవారే! ఈ రంగంలో సాంకేతిక విభాగాలు, సైంటిస్టులు సహా ఎన్నో డిపార్ట్‌మెంట్లలో మహిళలు సత్తా చాటుతున్నారు. చంద్రయాన్‌, ఆదిత్య వెనకనున్న మహిళా శాస్త్రవేత్తల కృషీ మర్చిపోలేం. అలాంటప్పుడు ఈ బృందంలో ‘మహిళలకు చోటివ్వలేదెందుకు?’ అనే ప్రశ్న అందరి నుంచీ వ్యక్తమైంది. దానికి ఇస్రో నుంచి వచ్చిన సమాధానం... ‘ఇన్‌స్ట్రక్టర్‌ గ్రేడ్‌లో మహిళా యుద్ధ పైలట్లు లేర’నే! నిజానికి భారత వైమానిక దళం మహిళలకు నాన్‌ కంబాటింగ్‌ విభాగాల్లోకి 30 ఏళ్ల నుంచి.. కంబాటింగ్‌ విధుల్లోకి 2016 నుంచి అవకాశమిచ్చింది. మనదేశంలో మహిళా పైలట్ల సంఖ్య 14 శాతంపైనే. ప్రపంచంలో అగ్రస్థానమూ మనదే. ఏవియేషన్‌ రంగంలో ఎంతో ముందున్న అమెరికాలోనూ మహిళా పైలట్‌ల సంఖ్య సుమారు 6 శాతమే.

వాళ్లు వెళ్లారు కదా...

అదీకాక... 1963లో అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి మహిళ రష్యాకు చెందిన వాలెంటీనా తెరెష్కోవా ఇంజినీర్‌. 1983లో వెళ్లిన తొలి అమెరికా మహిళ సాలీ రైడ్‌ ఫిజిసిస్ట్‌. 2012లో అడుగుపెట్టిన చైనా మహిళ లూ యాంగ్‌ మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్‌ పైలట్‌. వీళ్లేకాదు ఫ్రాన్స్‌, జపాన్‌ నుంచి వెళ్లిన తొలి మహిళలూ యుద్ధ పైలట్లు కాదు. ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌ నుంచి ఒక ఏర్‌హోస్టెస్‌ కూడా వ్యోమనౌకలో ప్రయాణించే అవకాశం సంపాదించుకుంది. పోనీ వయసు, అనుభవం సమస్యేమో అనుకుందామా అంటే... అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి మహిళలంతా 30-40 ఏళ్లలోపు వారే! వారిలో ఒకరికైతే 26 ఏళ్లే! గత ఏడాది ‘బ్లూ ఆరిజన్‌’ సంస్థ ఏకంగా 82 ఏళ్ల వాలీ ఫంక్‌ అనే బామ్మకూ అవకాశమిచ్చింది. అంతరిక్షంలోకి ప్రవేశించిన అత్యంత పెద్ద వయస్కురాలిగా ఆవిడ రికార్డునీ సృష్టించారు.

ప్రమాదాలూ తక్కువే...

ఒక వ్యోమగామికి ఉండాల్సిన కొలతలు మగవాళ్లకే పరిమితమనీ, సన్నగా, చిన్నగా ఉండే అమ్మాయిలు దీనికి సరిపోరని ఒక వాదన. ఇంకా... అంతరిక్షంలో నీటిని చాలా పొదుపుగా ఉపయోగిస్తారు. ఆఖరికి మూత్రాన్నీ వివిధ అంచెల్లో శుభ్రపరిచి తాగునీటిగా మారుస్తారు. నెలసరి సమయంలో వాటిని శుభ్రపరచడం ఆ యంత్రాలకి సాధ్యం కాదు. నెలసరి రాకుండా తీసుకునే మాత్రలు, రేడియేషన్‌ కారణంగా వారికి పిల్లలు పుట్టరని మరో వాదన. అయితే మైక్రోగ్రావిటీలో తక్కువ ఎత్తులో, చిన్నగా ఉండే అమ్మాయిల వల్లే లాభాలున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే వీళ్లు ఆహారాన్ని తక్కువగా ఉపయోగించుకోగలరు. దీంతో వృథా తక్కువ. అలాగే మహిళలకి శారీరకంగా దేన్నైనా తట్టుకోగల సామర్థ్యం ఎక్కువ. కాబట్టి, అక్కడి వాతావరణాన్ని తట్టుకోవడంలో అమ్మాయిల శరీరమేమీ తీసిపోదట. పిల్లలు పుట్టరన్నదానికీ శాస్త్రీయ ఆధారాల్లేవు. అందుకే అమెరికా గరిష్ఠంగా 60 మంది మహిళల్ని అంతరిక్షంలోకి పంపింది. వీళ్లకోసం ప్రత్యేక సూట్‌ల తయారీనీ మొదలుపెట్టింది. పోతే... ఓ పరిశోధన ప్రకారం.. మహిళలు రిస్క్‌ అవకాశాలను పలుమార్లు అంచనా వేసి, ఆ తరవాతే పనిలోకి దిగుతారట. అందుకే వాళ్లు నడిపే విమానాలకు ప్రమాదాలు తక్కువ. ఇన్ని సానుకూలతలున్నా అంతరిక్ష విషయానికి వచ్చేసరికి మన విషయంలో ఇంకా సందేహిస్తూనే ఉన్నారు. మరోవైపు పర్యటకులూ అంతరిక్షంలోకి వెళ్లే ఏర్పాట్లు ఊపందుకుంటున్నాయి. అయినా చారిత్రాత్మక ప్రయాణంలో భారతీయ మహిళలకు మాత్రం ఇంతవరకూ చోటు దక్కలేదు. 2025లో ఇస్రో అవకాశమిస్తామంటోంది. అప్పటికైనా మన ‘తొలి’ అంతరిక్ష కల నెరవేరుతుందేమో వేచి చూడాల్సిందే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్