వైకల్యం ఆమెని ఆపలేదు!

రెండు కాళ్లూ సహకరించకపోయినా, పట్టుదలతో ఆన్‌లైన్‌ వ్యాపారం చేస్తున్నారామె. ఓ యూట్యూబ్‌ ఛానల్‌నీ నడుపుతున్నారు. వాటిపై వచ్చే ఆదాయంతో నిస్సహాయులకు సాయం చేస్తూ, అండగా నిలుస్తున్నారు బొప్పన రాధ. వయసుతో సంబంధం లేకుండా పట్టుదలనే ఆయుధంగా చేసుకున్న ఆమె మాటలు ఎంత నిరాశలో ఉన్నవారిలో అయినా స్ఫూర్తిని రగిలిస్తాయి...  

Updated : 22 Apr 2024 12:46 IST

రెండు కాళ్లూ సహకరించకపోయినా, పట్టుదలతో ఆన్‌లైన్‌ వ్యాపారం చేస్తున్నారామె. ఓ యూట్యూబ్‌ ఛానల్‌నీ నడుపుతున్నారు. వాటిపై వచ్చే ఆదాయంతో నిస్సహాయులకు సాయం చేస్తూ, అండగా నిలుస్తున్నారు బొప్పన రాధ. వయసుతో సంబంధం లేకుండా పట్టుదలనే ఆయుధంగా చేసుకున్న ఆమె మాటలు ఎంత నిరాశలో ఉన్నవారిలో అయినా స్ఫూర్తిని రగిలిస్తాయి...  

మాది కృష్ణా జిల్లా గూడపాడు. పోలియో కారణంగా నడవలేని స్థితి. అయినా అదేమీ పట్టించుకోకుండా పాలిటెక్నిక్‌ డిప్లొమా (ఫార్మసీ) పూర్తి చేశా. వివాహమయ్యాక ఏలూరు ఆర్టీసీ ఆసుపత్రిలో ఫార్మసిస్టుగా అయిదేళ్లు పనిచేసి, హైదరాబాద్‌లోని తార్నాక ఆర్టీసీ ఆసుపత్రికి బదిలీ అయ్యా. చదువుపై ఆసక్తితో ఉద్యోగం చేస్తూనే, డిగ్రీ పూర్తిచేశా. పాప పుట్టింది. విధుల్లో ఉన్నప్పుడు ప్రమాదవశాత్తు కిందపడడంతో మంచానికే పరిమితమయ్యా. దాంతో పీజీ పూర్తవ్వలేదు. కొన్ని సమస్యలతో ఆయనా దూరమయ్యారు. కొన్నాళ్లు విదేశాల్లో ఉంటున్న మా అమ్మాయి దగ్గర ఉన్నా. మరికొన్నాళ్లు  ఓల్డేజ్‌ హోంలో గడిపా. అప్పుడే ఎంతోమంది నిరాశ్రయులు కనిపించారు. కాస్త ఓపిక చేసుకుంటే వాళ్లలో కొంతమందికైనా సాయం చేయగలను అనిపించింది. మా అమ్మాయి, తన స్నేహితురాళ్ల సాయంతో ఎనిమిదేళ్ల కిందట ఆన్‌లైన్‌ వ్యాపారం ప్రారంభించా. ఎవరి సాయం లేకుండానే మంచంపైన కూర్చుని చీరలు, డ్రస్సులు విక్రయించేదాన్ని. అలా వచ్చిన ఆదాయంతోనే పోలియో బాధితులు, దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, వీల్‌చైర్స్‌ పంపిణీ చేసేదాన్ని.

నిజానికి ఈ సేవ చేయాలనే ఆలోచన ఇప్పటిది కాదు. ఏలూరులో ఉద్యోగం చేసే సమయంలో అక్కడి గిరిజనులకు దుస్తులు, దుప్పట్లు, నిత్యావసరాలు అందచేసేదాన్ని. వాళ్ల కళ్లలో కనిపించిన కృతజ్ఞతాభావంతో ఆ సేవను కొనసాగించాలనిపించింది. మొదట్లో నెలకు ఒకర్ని ఎంచుకుని వాళ్లకు ట్రైసైకిల్‌ని ఇచ్చేదాన్ని. కొవిడ్‌ సమయంలో నావల్ల అవుతుందా అని వెనకడుగు వేసినా.... ఎంతోమంది బాధితుల కష్టాలను చూసి చలించిపోయి, కొనసాగించా. రెండు రాష్ట్రాల్లోనూ ఇప్పటి వరకూ 150 వరకు ట్రైసైకిళ్లు, వీల్‌చైౖర్లు, దుస్తులు, దుప్పట్లు అందజేశా. ఒంటరి మహిళలకు టైలరింగ్‌లో శిక్షణ ఇచ్చి, కుట్టుమిషన్లు అందిస్తున్నా. ఇంతవరకూ రూ.తొమ్మిది లక్షలు వరకూ ఖర్చు చేశా. ఈ ఖర్చంతా ఆన్‌లైన్‌ వ్యాపారం ద్వారా వచ్చిన ఆదాయంతోనే చేస్తున్నా. ఎవరినీ చేయిచాచి అడగను. ప్రస్తుతం హైదరాబాద్‌లోని సైనిక్‌పురిలో ఉంటున్నా. మంచానికే పరిమితమైనా వాకర్‌ సాయంతో నా పనులన్నీ నేనే చేసుకుంటూ ‘అమ్మ మాట అమ్మాయి బాట’ అనే యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహిస్తూ.. కథలు, నవలలు చదివి వినిపిస్తున్నా. సేవలోనే సంతృప్తిగా అనిపిస్తోంది.

పెద్దిరెడ్డిగారి పవన్‌కుమార్‌రెడ్డి, కడప

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్