బాధను దిగమింగి... బిలియనీర్లుగా ఎదిగి!

అయినవాళ్లని కోల్పోయిన బాధ వర్ణనాతీతం. ఇక జీవితాంతం తోడుండాల్సిన భాగస్వామి దూరమైతే లోకంలోనే ఒంటరి భావన వచ్చేస్తుంది. వారు లేకుండా బాధ్యతలను మోయడం మరింత భారంగా తోస్తుంది. కానీ వీళ్లలా కాదు... బాధను పంటిబిగువున అదిమిపెట్టి, తమపై ఆధారపడిన వారి భవిష్యత్తు గురించి ఆలోచించారు. భర్త కలలనే తమవాటిగా భావించి సంస్థలను ముందుకు నడిపారు. ఫోర్బ్స్‌ బిలియనీర్ల జాబితాలో చోటునీ సంపాదించుకున్నారు. 

Updated : 23 Apr 2024 02:52 IST

అయినవాళ్లని కోల్పోయిన బాధ వర్ణనాతీతం. ఇక జీవితాంతం తోడుండాల్సిన భాగస్వామి దూరమైతే లోకంలోనే ఒంటరి భావన వచ్చేస్తుంది. వారు లేకుండా బాధ్యతలను మోయడం మరింత భారంగా తోస్తుంది. కానీ వీళ్లలా కాదు... బాధను పంటిబిగువున అదిమిపెట్టి, తమపై ఆధారపడిన వారి భవిష్యత్తు గురించి ఆలోచించారు. భర్త కలలనే తమవాటిగా భావించి సంస్థలను ముందుకు నడిపారు. ఫోర్బ్స్‌ బిలియనీర్ల జాబితాలో చోటునీ సంపాదించుకున్నారు. వాళ్లెవరంటే...

తొలిసారిగా జాబితాలోకి...

వుట్‌ స్టాండింగ్‌ ఆసియన్‌ బిజినెస్‌ ఉమన్‌, ఆంత్రప్రెన్యూర్‌ ఆఫ్‌ ద ఇయర్‌, స్ట్రాటజిక్‌ లీడర్‌, కెప్టెన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ... మూడు దశాబ్దాల వ్యాపార ప్రయాణంలో ఇలాంటివెన్నో పురస్కారాలు అందుకున్నారు రేణుక జగ్తియానీ. యూనివర్సిటీ ఆఫ్‌ ముంబయి నుంచి బీఏ పూర్తిచేసిన ఈమె భర్తతో కలిసి దుబాయికి మకాం మార్చారు. కుటుంబం కోసం ఇరవై ఏళ్లు ఇంటికే పరిమితమయ్యారు. భర్త దుబాయిలో ‘ల్యాండ్‌మార్క్‌’ పేరుతో పిల్లల దుస్తుల సంస్థను ప్రారంభించి, పెద్ద రిటైల్‌ సంస్థగా తీర్చిదిద్దారు. కానీ దీన్ని భారత్‌ సహా ఇతర దేశాలకు విస్తరించడంలో మాత్రం రేణుకదే ప్రధాన పాత్రగా చెబుతారు. కాబట్టే, లాండ్‌మార్క్‌ 21 దేశాల్లో 2200 స్టోర్లను ప్రారంభించగలిగింది. దుస్తులు, పాదరక్షలు, ఫర్నిషింగ్‌, బేబీ ఉత్పత్తులతోపాటు ఆతిథ్య రంగాల్లోకి అడుగుపెట్టడంలోనూ ఈమె పాత్ర ఎక్కువే. గతంలో కొన్నేళ్లు ఛైర్‌పర్సన్‌, సీఈఓ బాధ్యతలు తీసుకుని సంస్థని ముందుకు నడిపారు కూడా. భర్త అనారోగ్యం కారణంగా తరవాత ఆ బాధ్యతలకు రాజీనామా చేశారు. గత ఏడాది భర్త మిక్కీ జగ్తియానీ మరణం తర్వాత తిరిగి పగ్గాలు అందుకున్నారు. తన ముగ్గురు పిల్లలు డైరెక్టర్లుగా ఈమె ఛైర్‌పర్సన్‌గా సంస్థను పరుగులు పెట్టిస్తున్నారు. భర్త వాటా కూడా చేరడంతో ఆమె సంపద అమాంతం పెరిగి, 4.8 బిలియన్లకు చేరింది. అలా ఈ ఏడాది తొలిసారిగా ఫోర్బ్స్‌ బిలియనీర్ల జాబితాలోకి ఎక్కారామె. 70ఏళ్ల రేణుక ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లోనూ చోటు దక్కించుకున్నారు. 50వేల మంది ఉద్యోగులు గల ఈ సంస్థను సమర్థంగా నడిపిస్తూనే మరింత విస్తరించే పనిలో ఉన్న ఆమెకు ‘ఉత్తమ కార్పొరేట్‌ స్ట్రాటజిస్ట్‌’గా పేరు.


అక్కణ్నుంచి ఏకైక మహిళ!

2021లో భర్త ఎంజీ జార్జ్‌ ముత్తూట్‌ మరణం... సారా జార్జ్‌కి దెబ్బ మీద దెబ్బ లాంటిదే! గతంలోనే ఆవిడ ఒక కొడుకుని కోల్పోయారు. దాన్నుంచి బయటపడటానికి చాలా ఏళ్లే పట్టిందావిడకు. భర్త మరణంతో ఆయన వాటా సారాకి వచ్చింది. అలా బిలియనీర్‌ అయ్యారామె. అలాగని ఆమె పాత్రే లేదనుకుంటే పొరపాటే. ముత్తూట్‌ గ్రూప్‌లో మొదట్నుంచీ డైరెక్టర్‌ ఆమె. కానీ దృష్టంతా విద్యారంగంపై పెట్టారు. స్వస్థలం కేరళ కానీ దిల్లీలో స్థిరపడ్డారు. అక్కడ సెయింట్‌ జార్జ్‌ స్కూల్‌, కొడుకు జ్ఞాపకార్థంగా ప్రారంభించిన పాల్‌ జార్జ్‌ గ్లోబల్‌ స్కూళ్లను సమర్థంగా నడపడమే కాదు... దేశంలోని ప్రముఖ స్కూళ్లలో ఒకటిగా నిలిపారు. యూనివర్సిటీ ఆఫ్‌ కేరళ నుంచి సైన్స్‌లో మాస్టర్స్‌ చేసిన సారాకి ఈ రంగంలో నాలుగు దశాబ్దాలకుపైగా అనుభవముంది. భర్త అకస్మాత్తుగా మరణించడంతో మిగతా ఇద్దరు కొడుకులతో కలిసి కంపెనీ బాధ్యతలు చేపట్టారు. 4700 బ్రాంచీలు, రోజుకు రెండు లక్షలమంది కస్టమర్లతో లావాదేవీలు... తమను నమ్ముకున్న ఎంతోమంది ఉద్యోగుల భవిష్యత్తు కోసం బాధను దిగమింగుకుని ధైర్యంగా నిలబడ్డారు. పక్కా నిర్ణయాలు తీసుకోవడంలో ఎంత దృఢంగా ఉంటారో... సలహాలూ సూచనలూ స్వీకరించడంలోనూ అంతే ముందుంటారు అంటారామెతో కలిసి పనిచేసినవారు. అదే తత్త్వంతో మూడేళ్లలో ‘ముత్తూట్‌’ లాభాలు 21 శాతం పెరిగేలా చేశారు. 1.6 బిలియన్ల సంపదతో ప్రపంచ కుబేరుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. అన్నట్టూ కేరళ నుంచి ఏకైక మహిళా బిలియనీర్‌ 63 ఏళ్ల సారా జార్జ్‌ ముత్తూట్‌.


మీకు తెలుసా?!

ఓటు మన ప్రాథమిక హక్కు. మరి ఆ హక్కును మహిళలకు మొట్ట మొదటగా కల్పించిన దేశం ఏదో తెలుసా! న్యూజిలాండ్‌.. 1893లో పార్లమెంటరీ ఎన్నికల్లో మహిళలకు ఈ అవకాశం కల్పించింది అక్కడి ప్రభుత్వం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్