వారసత్వ కట్టడాలకు... వైభవం తెస్తున్నారు!

‘సాంకేతికత లేదు... పెద్ద పనిముట్లూ లేవు అయినా మన పూర్వికులు పటిష్టమైన నిర్మాణాలెన్నో చేపట్టారు. అవి ఇప్పటికీ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తూనే ఉన్నాయి. వాళ్ల నైపుణ్యం, ప్రతిభ... రాబోయే తరాలకు పరిచయం చేయాలి కదా...’ అంటూ ఆ బాధ్యతని తమ భుజాలకెత్తుకున్నారు ‘ఎడా’ సభ్యులు.

Updated : 24 Apr 2024 07:42 IST

‘సాంకేతికత లేదు... పెద్ద పనిముట్లూ లేవు అయినా మన పూర్వికులు పటిష్టమైన నిర్మాణాలెన్నో చేపట్టారు. అవి ఇప్పటికీ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తూనే ఉన్నాయి. వాళ్ల నైపుణ్యం, ప్రతిభ... రాబోయే తరాలకు పరిచయం చేయాలి కదా...’ అంటూ ఆ బాధ్యతని తమ భుజాలకెత్తుకున్నారు ‘ఎడా’ సభ్యులు. ఈక్రమంలో అంతర్జాతీయ పురస్కారాలనీ అందుకున్నారు. ఇంతకీ వీళ్లెవరు అంటే...

స్వాతి సుబ్రహ్మణ్యం, సవితా రాజన్‌, రితూ సారా థామస్‌... ఆర్కిటెక్ట్‌లు. వీళ్లది కేరళ. దిల్లీలోని స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌లో కలిసి పీజీ చేశారు. అది 2017... ఆర్కిటెక్ట్‌లంటే కొత్త నిర్మాణాలపైనే ఎందుకు దృష్టి పెట్టాలి? అందరికంటే భిన్నంగా ఎందుకు ప్రయత్నించకూడదు అని ఆలోచించారట ఈ ముగ్గురమ్మాయిలు. ఒకసారి ఏదో టూర్‌లో భాగంగా ఉత్తర భారతదేశం వెళ్లారు. అక్కడ పురాతన కట్టడాలు, ఆలయాలు వాళ్లని ఆకర్షించాయి. ‘మన దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా కేరళలో ఇలాంటివి ఎందుకు చాలా తక్కువ అనే ఆలోచన వచ్చింది. పరిశోధిస్తే... అవి జీర్ణమయ్యే స్థితికి రాగానే పడేసి, కొత్తవి కడుతున్నారని తెలిసింది. అప్పుడే మేము కన్జర్వేషన్‌ ఆర్కిటెక్ట్‌లం అవ్వాలని నిర్ణయించుకున్నాం. దాని ఫలితమే ‘ఎడా’... అంటే దారమని అర్థం. పురాతన నైపుణ్యాలను తరవాతి తరాలకు జోడించడం మా లక్ష్యమని అర్థమొచ్చేలా ఆ పేరు పెట్టాం’ అంటారీ 30 ఏళ్ల యువతులు. పురాతన కట్టడాల సంరక్షణ, కూలిపోయే స్థితికి చేరిన వాటిని పునరుద్ధరించడం, వాటి డాక్యుమెంటేషన్‌ వంటివి వీరి విధులు.

భయమేసింది...

తొలి ప్రాజెక్టుగా ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆర్కిటెక్ట్స్‌ ఆధ్వర్యంలోని ‘రివైవింగ్‌ కోజికోడ్‌’లో భాగమయ్యారు. అక్కడ ఒక నేత ఫ్యాక్టరీని పునరుద్ధరించడంలో భాగస్వాములై అవార్డునీ అందుకున్నారు. తరవాత సంస్కృతి వారసత్వాన్ని కాపాడటంపై పనిచేస్తోన్న ‘ఆర్కైవల్‌ అండ్‌ రీసెర్చ్‌ ప్రాజెక్టు’తో కలిసి మరిన్ని ప్రాజెక్టులు చేసి, గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సంస్థ ద్వారానే ఈ స్నేహ త్రయానికి 400 ఏళ్ల క్రితం నాటి ‘కర్నికారా మండపం’ కోసం సొంతంగా పనిచేసే అవకాశం వచ్చింది. ‘అది కోజికోడ్‌లోని భగవతి ఆలయ ప్రాంగణంలోని మండపం. ఏళ్ల చరిత్ర, ప్రకృతి ఒడిలో దాగున్న ఆ ఆలయం కోసం పనిచేయడానికి ఎంతో ఉత్సాహంగా వెళ్లాం. తీరా చూస్తే మండపం పూర్తిగా పాడైంది. అలా కదిలించినా పడిపోయేలా ఉంది. నిజానికి దీన్ని చూడగానే చేయగలమా అన్న భయం వేసింది. కానీ 16 స్థంభాలతో వికసించిన పద్మంలా ఉన్న ఆ నిర్మాణం మమ్మల్ని ఆకట్టుకుంది. అందుకే దాన్ని కూల్చి ఆధునిక విధానంలో కట్టాలనుకుంటున్న గుడి ధర్మకర్తలు, స్థానిక ప్రజలతో మాట్లాడాం. తిరిగి అదే రూపు తీసుకొచ్చేలా ఒప్పించా’మంటారీ యువతులు.

మహిళలు కాబట్టే...

తరవాత దానికయ్యే ఖర్చు రూపంలో సమస్య ఎదురైంది. ఆ మండపం తయారైంది టేకుతో! అంత పెద్ద మండపాన్ని తిరిగి తీర్చిదిద్దాలంటే చాలా ఖర్చు అవుతుంది. దీంతో ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టారు. ఆ కలప త్వరగా పాడవకుండా ఆయుర్వేద మూలికలతో చేసిన వార్నిష్‌ ఉపయోగించారు. సహజ రంగులు, పెంకులు, మట్టితో పూర్వ పద్ధతులను ఉపయోగించి మూడు నెలల్లో మండపాన్ని సిద్ధం చేసి, స్థానికుల మనసులు గెలుచుకున్నారు. ‘నిజానికి ఊళ్లోవాళ్లు తోచిన సాయం చేస్తూ వచ్చారు. మాది అనుకుని సాయం చేశారు కాబట్టే, ఇంత వేగంగా పూర్తిచేయగలిగాం. ఇప్పుడక్కడ తిరిగి హోమాలు, పూజలు జరుగుతున్నా’యని సంబరంగా చెబుతున్నారీ అమ్మాయిలు. శతాబ్దాల చరిత్రగల పురాతన కట్టడాన్ని పునరుద్ధరించినందుకు యునెస్కో అవార్డునీ గెలుచుకున్నారు. ఇందుకోసం 8 దేశాల్లోని 48 ప్రాజెక్టులతో పోటీపడ్డారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆర్కిటెక్ట్స్‌ నుంచి ‘గోల్డెన్‌ లీఫ్‌’తోపాటు ఇటలీలోని ఫెరారా యూనివర్సిటీ గుర్తింపు సహా పురస్కారాలెన్నో వరించాయి. అన్నట్టూ... ‘కర్నికారా మండపం కోసం పనిచేసిన ఆర్కిటెక్ట్‌లు, ధర్మకర్తలు, పనివారిలో చాలావరకూ మహిళలే. అందుకే కలిసి సాగడం సులువైందంటున్నారు. తాజా ప్రాజెక్టు విజయవంతం అవడంతో ఉత్సాహంగా మరికొన్ని పురాతన కట్టడాలపై దృష్టిపెట్టిన వీళ్ల ప్రయత్నం అభినందనీయమే కదూ!


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు,  సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్