ఏఐలో... దూసుకెళ్లాల్సిందే!

ఏఐకి ‘ముందూ... తర్వాత’... బహుశా భవిష్యత్తుని ఇలానే విభజించుకుంటామేమో! సైన్స్‌, సాహిత్యం అని తేడా లేకుండా.. ‘అంతటా తానై’ దూసుకొస్తోంది ఏఐ (కృత్రిమమేధ). ఈ రంగంలో నాయకత్వ హోదాల్లో మగవాళ్లకంటే ఆడవాళ్లే ఎక్కువ. ఇది సంతోషించతగ్గ విషయమే. చిక్కల్లా... కింది స్థాయిలో లేకపోవడమే. అదేమంత పెద్ద సమస్యా అంటారా? కచ్చితంగా సమస్యే.

Updated : 25 Apr 2024 03:17 IST

అంతర్జాతీయ మహిళల శాస్త్ర సాంకేతిక సమాచార దినోత్సవం!

ఏఐకి ‘ముందూ... తర్వాత’... బహుశా భవిష్యత్తుని ఇలానే విభజించుకుంటామేమో! సైన్స్‌, సాహిత్యం అని తేడా లేకుండా.. ‘అంతటా తానై’ దూసుకొస్తోంది ఏఐ (కృత్రిమమేధ). ఈ రంగంలో నాయకత్వ హోదాల్లో మగవాళ్లకంటే ఆడవాళ్లే ఎక్కువ. ఇది సంతోషించతగ్గ విషయమే. చిక్కల్లా... కింది స్థాయిలో లేకపోవడమే. అదేమంత పెద్ద సమస్యా అంటారా? కచ్చితంగా సమస్యే. ఏఐలో మన ప్రాతినిధ్యం లేకపోతే మనమెంతగా నష్టపోతామో తెలుసుకుందాం రండి....  

‘సింహాలు తమ చరిత్ర రాసుకోనంతవరకూ వేటగాడు చెప్పిందే కథ’ అంటారు ఆఫ్రికన్‌ రచయిత చినువా అచెబె. ఈ మాటలు అక్షరాలా ఏఐలో మనమెదుర్కొంటున్న సమస్యకి సరిపోతాయి. ఎలా అంటే.. ఇప్పటి వరకూ అన్ని రంగాల్లో మగవాళ్లదే ఆధిపత్యం. ఏఐలో కూడా అదే కొనసాగిందనుకోండి. టెక్నాలజీ, ఉత్పత్తులు, సేవలు... అన్నీ మగవాళ్లవైపు మొగ్గు చూపుతాయి. ఉదాహరణకి... స్మార్ట్‌ఫోన్‌ని మనం ఒక చేత్తో పట్టుకుని, మరో చేత్తో ఆపరేట్‌ చేస్తాం. మగవాళ్లు ఒక చేత్తో కూడా తేలిగ్గా, సౌకర్యవంతంగా ఆ పని చేయగలరు. వాళ్ల అరచేయి కాస్త పెద్దగా ఉంటుంది గమనించి చూడండి. గూగుల్‌ వాయిస్‌ కమాండ్‌ మీమాట కంటే మీవారి మాటనే ఎక్కువగా వింటుంది. కావాలంటే ఓసారి ప్రయత్నించండి! ఆఫీసులో ఏసీ మనకి చలిగా అనిపిస్తుంది. అదే మగవాళ్లకి ఏమీ అనిపించదు. ఎందుకంటే వాళ్ల శరీర ఉష్ణోగ్రత ఆధారంగానే ఏసీˆల ఏర్పాటు ఉంది మరి. చూస్తుంటే టెక్నాలజీకి ఆడవాళ్లంటే చిన్నచూపేమో అన్న అనుమానం వస్తోంది కదా! కానీ వాస్తవం అది కాదు. ఆ తయారీరంగంలో కానీ.. టెక్నాలజీలోకానీ ఆడవాళ్ల ప్రాతినిధ్యం లేకపోవడమే ఇందుకు కారణం. పైగా ఇప్పుడున్న డేటా అంతా మగవాళ్లపై అధ్యయనం చేసి తీసుకున్నది కాబట్టే ఈ ఇబ్బందులన్నీ! కొన్ని దేశాల్లో ఎమర్జెన్సీ సమయంలో వాడే పీపీఈ కిట్లు, ఆర్మీవాళ్లు వాడే బాడీ ఆర్మర్స్‌ సరిగ్గా అమరక మహిళలు బ్రెస్ట్‌ రిడక్షన్‌ ఆపరేషన్‌ చేయించుకున్న సందర్భాలూ ఉన్నాయి. ఆఖరికి కారు సీటు బెల్టులు కూడా మగవాళ్లపై స్టడీ చేసి ఆ డేటా ఆధారంగా అమర్చినవే. అందుకే రోడ్డు ప్రమాదాల్లో మహిళల మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ పరిస్థితినే జెండర్‌ డేటా గ్యాప్‌ అంటారు. ఇది పెరిగేకొద్దీ మనకు నష్టమే. అలాకాకుండా ఉండాలంటే ఏఐలో మనం అడుగు పెట్టాల్సిందే అంటున్నారు బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ ఎండీ శ్రేయేషా జార్జ్‌.  

మన గొంతు వినిపిస్తేనే...

కృత్రిమ మేధ విషయానికి వస్తే.. ‘దీనికి మంచి, చెడు.... మగ, ఆడ అనే వివక్ష ఉండదు. ఏ డేటా ఇస్తే అదే తీసుకుంటుంది. ఉదాహరణకి ఉత్తరాదిన ఆడపిల్ల అంటే చిన్నచూపు. జనాభా తక్కువ. అనేక రంగాల్లో వెనకబాటుతనం ఉంది. అందుకు కారణమైన సామాజిక కట్టుబాట్ల గురించి, లింగ వివక్ష గురించి ఏఐకి మనం చెప్తేకానీ తెలియదు. అక్కడ ఫలానా రంగంలో మహిళలు లేరు అన్న డేటాని మాత్రమే తీసుకుంటుంది. దాంతో అమ్మాయిలకు అర్హత ఉన్నా, అవకాశాలు మగవాళ్లకే ఇస్తుంది’ అంటారు మైక్రోసాఫ్ట్‌ ఇండియా సీటీవో రోహిణీ శ్రీవత్స. వరల్డ్‌ ఎకనామిక్‌ నివేదికల ప్రకారం... ప్రపంచవ్యాప్తంగా ఏఐలో సీనియర్‌, జూనియర్‌ స్థాయుల్లో కలిపి 22 శాతం మాత్రమే మహిళలు పనిచేస్తున్నారు. తక్కినవారంతా మగవాళ్లే. స్టెమ్‌ (సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథ్స్‌) రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా 25 శాతం మాత్రమే ఆడవాళ్లు ఉన్నారు. ఈ రంగాల్లో మగవాళ్లకు మనం పోటీ ఇవ్వకపోతే ఏఐలో పారదర్శకత లోపిస్తుంది. ఆ మధ్య అమెజాన్‌ ఉద్యోగ ప్రక్రియలో ఏఐతో నడిచే హైరింగ్‌ టూల్‌ని వాడింది. ఫలితం చూస్తే.. అర్హత ఉన్నా దాదాపుగా ఉద్యోగాలన్నీ మగవాళ్లకే ఇచ్చింది. కారణాలు వెతికితే అది పదేళ్ల కిందట మహిళలకు సంబంధించిన పాత డేటాని తీసుకుంది. అంటే భవిష్యత్తులో మనదీ అదే పరిస్థితి కావొచ్చు. ఒక వేళ ఏఐలో మహిళల ప్రాధాన్యం పెరిగితే ఎలా ఉంటుందో చూద్దాం. రొమ్ము క్యాన్సర్‌ నిర్ధారణ కాస్త కష్టతరమే. దీనికి తోడు నొప్పి, బిడియం. కానీ నిరమాయి సంస్థ ఏఐ సాంకేతికతో పనిచేసే కొత్త పరికరాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో రేడియేషన్‌ సమస్య ఉండదు. ఓ చిన్న కెమెరా సాయంతో మనల్ని తాకకుండానే క్యాన్సర్‌ని నిర్ధరిస్తుంది. తోటిమహిళల కష్టాలను అర్థం చేసుకుని ఈ ఏఐ ఆధారిత సంస్థను స్థాపించారు బెంగళూరుకు చెందిన గీతామంజునాథ్‌. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏఐ నిపుణుల్లో ఆమె ఒకరు. కోట్లాదిమంది స్త్రీలకు మేలు చేసే ఆవిష్కరణ ఇది. ట్రక్‌డ్రైవర్లు తమ భార్యాబిడ్డలతో ఎక్కువ సమయం గడిపేందుకు వీలుగా కృత్రిమమేధను వాడుతూ ‘రివిగో’ సంస్థను స్థాపించారు ఐఐటీ దిల్లీ విద్యార్థిని గజల్‌ కల్రా. అలాగే పూజారావ్‌... క్యూర్‌.ఏఐ సంస్థను స్థాపించి వేగంగా వైద్యసేవలు అందేట్టు చూస్తున్నారు. ‘మహిళలు వీలైనంత ఎక్కువగా ఏఐ పరిశోధనా రంగంలోకి రావడంవల్ల ఇలాంటి ప్రయోజనాలే పొందొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఈ తీరు ఊపందుకుంటోంది’ అంటున్నారు రోహిణీ శ్రీవత్స. ఏఐ ఆర్‌అండ్‌డీ విభాగంలో మహిళల ప్రాతినిధ్యం ఎంత పెరిగితే అంత పారదర్శకత ఉంటుందని అంటున్నారు నాస్కామ్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌ సింధు గంగాధరన్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్